Home జాతీయ వార్తలు లేచిపోయిన తమ్ముడి కోసం అక్కలపై ఖాకీల క్రౌర్యం

లేచిపోయిన తమ్ముడి కోసం అక్కలపై ఖాకీల క్రౌర్యం

Rapeగువాహటి: ఒక హిందూ మహిళతో ముస్లిం యువకుడు పారిపోగా ఆ యువకుడి ముగ్గురు సోదరీమణులను పోలీసులు వివస్త్రలను చేసి లాఠీలతో చితకబాదారు. అస్సాంలోని దర్రంగ్ జిల్లాలోని పోలీసు ఔట్‌పోస్ట్ వద్ద సెప్టెంబర్ 9న ఈ సంఘటన జరిగింది. తమ కుమార్తెను ఆ ముస్లిం యువకుడు కిడ్నాప్ చేశాడంటూ ఆ హిందూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడి సోదరీమణులు ముగ్గురిని పోలీసు ఔట్‌పోస్టుకు రప్పించిన పోలీసులు వారిని వివస్త్రలను చేసి లాఠీలతో కొట్టి, కాళ్లతో తన్ని చిత్రహింసలకు గురిచేశారు.

ఆ ముగ్గురు మహిళలలో ఒకరు గర్భిణి. బాధితులలో ఒకరు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సబ్ ఇన్‌స్పెక్టర్ మహేంద్ర శర్మ తమ అక్కచెల్లెళ్లు ముగ్గురిని సెప్టెంబర్ 9న పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. తమను ఎందుకు స్టేషన్‌కు పిలిపిస్తున్నారని తాము ప్రశ్నించగా ఎస్‌ఐ తమకు పిస్టల్ చూపించి ఎక్కువ మాట్లాడొద్దంటూ బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తను లాకప్‌లో వేసి తన సోదరిని వివస్త్రను చేసి లాఠీతో కొట్టారని 28 ఏళ్ల ఆ బాధితురాలు తెలిపింది. ఎడమ కాలు సమస్యతో బాధపడుతున్న తన సోదరిని అదే కాలుపై లాఠీతో కొట్టారని, తన అక్కను కూడా వివస్త్రను చేసి కొట్టారని ఆమె తెలిపింది.

ఆమె గర్భిణిని అని తాము చెబుతున్నప్పటికీ నాటకాలు వేయొద్దు అంటూ ఆ ఎస్‌ఐ మండిపడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. చివరగా తనను కూడా వివస్త్రను చేసి లాఠీతో కొట్టి, కాలితో తన్నారని ఆమె తెలిపింది. ఎస్‌ఐ శర్మతోపాటు మహిళా కానిస్టేబుల్ బినితా బోరా తమ అక్కచెల్లెళ్లు ముగ్గురిని నగ్నంగా వివస్త్రలను చేసి, తమను కొట్టి, మర్మాంగాలను తాకి పైశాచిక ఆనందం పొందారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన అస్సాం డిజిపి కులధర్ సైకియా ఎస్‌ఐ శర్మతోపాటు కానిస్టేబుల్ బారోను కూడా సస్సెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సంఘటనపై విచారణకు ఆయన ఆదేశించారు. ఇలా ఉండగా, హిందూ మహిళతో పారిపోయిన ఆ యువకుడిని షిల్లాంగ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

Three Sisters Stripped Assaulted at Police Outpost, After Their Brother Elopes With Woman, Two Assam Cops Suspended