Home ఎడిటోరియల్ సంపాదకీయం: రాజకీయ ప్రాధాన్యతగల ఎన్నికలు

సంపాదకీయం: రాజకీయ ప్రాధాన్యతగల ఎన్నికలు

sampadakeyam

మూడు ఈశాన్య భారత్ రాష్ట్రాలకు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించటంతో రాజకీయ సందడి మొదలైంది. ఒక్కొక్క అసెంబ్లీలో సీట్ల సంఖ్య 60. ఓటర్లు త్రిపురలో 25.69 లక్షలు, మేఘాలయలో 18.30లక్షలు, నాగాలాండ్‌లో 11.89 లక్షలు. ఈ మూడు అతిచిన్న రాష్ట్రాలే అయినా రాజకీయ ప్రాధాన్యత తక్కువేమీ కాదు. ఈశాన్యంలో సంపూర్ణ ఆధిపత్యం కొరకు ప్రయత్నిస్తున్న బిజెపి తన లక్షాన్ని నెరవేర్చుకోగలుగుతుందా? నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేఘాలయను నిలుపుకోగలుగుతుందా? నాగా సమస్య పరిష్కారం కాకుండా ఎన్నికల వద్దన్న డిమాండ్ నేపథ్యంలో నాగాలాండ్ ఎవరి వశం కానుంది? సిపిఐ(ఎం) దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న త్రిపురలో ఎర్రజెండా అధికారం నిలుపుకోగలుగుతుందా? బిజెపి, కాంగ్రెస్‌లకు, వామపక్షాలకు ఈ ఎన్నికలు కీలకం.

పశ్చిమ బెంగాల్, జ్యోతిబసు ఉన్నంతకాలం సిపిఐ(ఎం)కు కంచుకోటగా ఎలా ఉండిందో త్రిపుర మణిక్ సర్కార్‌తో అంతగా ముడివడి ఉంది. ఆయన ప్రభుత్వం గిరిజన తిరుగుబాట్లను అదుపు చేసి దశాబ్దంపైగా సామరస్యం నెలకొల్పింది. నీరు, రహదారులు, స్కూళ్లు, ఆరోగ్యం వంటి సామాజిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించింది. అక్షరాస్యత దాదాపు సంపూర్ణం. వ్యవసాయం, అటవీసంపదపై ప్రధానంగా ఆధారపడిన రాష్ట్రం కావటంవల్ల వనరులు తక్కువ. ఉపాధికల్పన ప్రధాన సమస్య. మిగతా రాష్ట్రాల్లాగా టీచర్లకు, ప్రభుత్వోద్యోగులకు వేతన సంఘం సిఫారసులు అమలు చేయలేని స్థితి. ఈ రాష్ట్రంపై బిజెపి కన్నేసింది. 32 శాతంగా ఉన్న గిరిజనుల్లో చిచ్చుపెట్టింది. త్రిపుర గిరిజన ప్రాంతాలతో త్విప్రరాష్ట్రం ఏర్పాటును డిమాండ్ చేస్తున్న స్థానిక నేషనలిస్ట్ పార్టీ కొమ్ముకాస్తున్నది. 7వ వేతన సంఘం వేతనాలు అమలు జరుపుతామని వాగ్దానం చేస్తున్నది. గతంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు మమతాబెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. బిజెపి విచ్ఛిన్న రాజకీయాలతో గట్టి సవాలు విసిరినా, అధికారం నిలుపుకోగలమన్న ఆత్మవిశ్వాసం వామపక్ష సంఘటనలో ఉంది.

మేఘాలయను నిలుపుకోవటానికి కాంగ్రెస్ పోరాడుతోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా సుస్థిరత నెలకొల్పారు. అయితే నిధులకు ఇతర ఈశాన్య రాష్ట్రాలవలె కేంద్రంపై ఆధారపడి ఉంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించకమునుపే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించి రాష్ట్రానికి రూ.90వేల కోట్ల ప్యాకేజి ప్రకటించారు. రాష్ట్రంలో బిజెపి ఉనికి నామమాత్రం. అయితే కేంద్రంలో ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న కన్రాడ్ కె.సంగ్మా నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీపై అది అధారపడుతున్నది. కాగా తాము ఇండిపెండెంట్‌గా 60లో 53 సీట్లు పోటీచేస్తామని ఆయన ప్రకటించారు. లోక్‌సభ మాజీ స్పీకర్, ఎన్‌సిపి నాయకుడు పి.ఎ.సంగ్మా కుమారుడైన కన్రాడ్ మిగతా సీట్లను ఎన్‌సిపికి విడిచిపెడతారో, లేక బిజెపి హద్దుల్లో ఉంచేందుకు ఈ ప్రకటన చేశారో వేచిచూడాలి. అయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని బిజెపి ధీమా వ్యక్తం చేస్తోంది.

నాగాలాండ్ అస్థిరతకు నిలయంగా ఉంది. నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) ప్రభుత్వంలో బిజెపి జూనియర్ భాగస్వామి. ముఖ్యమంత్రి టిఆర్ జీలింగ్, మాజీ ముఖ్యమంత్రి ఎస్.లీజీత్సు మధ్య డిసెంబర్‌లో రాజీ కుదిరింది. నాగా ఒప్పందం కొరకు చర్చలు పురోగతిలో ఉన్నందున, అందుకు తోడ్పడే సుస్థిర ప్రభుత్వాన్ని తాము కోరుకుంటున్నట్లు బిజెపి చెబుతున్నప్పటికీ అలజడి జలాల్లో చేపలు పట్టే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ ఎంపి ఎన్.రియో పాలక ఎన్‌పిఎఫ్ నుండి వైదొలిగి నాగా డెమొక్రటిక్ ప్రోగ్రసివ్ పార్టీ నాయకత్వం చేపట్టటంతో బిజెపికి ఒక ప్రత్యామ్నాయం దొరికింది. తమ ప్రభుత్వాన్ని కూలదోయటానికి బిజెపి అరుణాచల్ తరహా పథకం పన్నినట్లు అనుమానించిన ఎన్‌పిఎఫ్ రాష్ట్రంలో బిజెపితో తెగతెంపులు చేసుకుంది. అయితే పార్లమెంటులో బిజెపిని బలపరుస్తున్నది. కాగా అత్యున్నత నాగా గిరిజన సంస్థ నాగా హోహో ఎన్నికల బహిష్కరణకు పిలుపుఇచ్చింది. కాబట్టి ఈ మూడు ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు ఆసక్తిదాయకం.