Thursday, March 28, 2024

శ్రీరాంపూర్‌లో పులి కదలికలు

- Advertisement -
- Advertisement -

Tiger Hulchul in Mancherial District అడుగులను గుర్తించిన అధికారులు
వీడియోను చిత్రీకరించిన స్థానికులు
హాని కలిగిస్తే పిడియాక్ట్: పోలీస్, అటవీ అధికారులు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కార్యాలయ పరిసరాల్లో పెద్దపులి సంచారం దడ పుట్టిస్తోంది. పెద్దపులి కదలికలు స్థానికులను కలవర పెడుతున్నాయి. పక్షం రోజులుగా వివిధ ప్రదేశాల్లో పులి ప్రజలకు కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కార్యాలయం ముందు నుంచి జాతీయ రహదారి దాటి అడవుల్లోకి వెళ్తుండగా స్థానికులు, సింగరేణి కార్మికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని పోలీసులు, అటవీ అధికారులకు తెలియజేశారు. పులి రోడ్డు దాటుతుండగా స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేశారు.

ఏక్షణంలో ఎటువైపు నుంచి పులి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్దపులి ఆచూకీ తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఐదు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. శుక్రవారం ఉదయం కనిపించిన పెద్దపులి శ్రీరాంపూర్ మీదుగా ఇందారం వైపు వెళ్ళినట్లు అధికారులు గుర్తించి అక్కడి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. రామగుండం సిపి సత్యనారాయణ శ్రీరాంపూర్ చేరుకొని పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపులికి ఎలాంటి హాని తలపెట్టవద్దని సూచించారు. వన్యప్రాణి వేటగాళ్లపై ఇప్పటికే కన్నేసి ఉంచామని, అవసరమైతే వారిపై పిడి యాక్టు నమోదు చేస్తామన్నారు.

ప్రత్యేక బృందాలతో పెద్దపులి సంరక్షణకు చర్యలు చేపడతామన్నారు. పులి వల్ల ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. బెల్లంపల్లి, చెన్నూర్, జైపూర్, ఆసిఫాబాద్, కవ్వాల్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సుమారు నాలుగు పెద్దపులులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, లాక్‌డౌన్ కారణంగా రాత్రి సమయంలో జనసంచారం లేకపోవడంతో పట్టణాల వైపు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని, పొలాల వద్ద పశువులను కట్టేయరాదని సూచించారు. పెద్దపులికి చిన్న హాని చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News