Saturday, April 20, 2024

సమయస్ఫూర్తి

- Advertisement -
- Advertisement -

 

సిరి పల్లెలో ఉండే రామయ్య, భీమయ్యతో పాటు మరో ఎనిమిది మంది కలసి, ఊరి పొలిమేరలో ఉన్న ఎండిన చెట్లకొమ్మలను కొట్టడానికి చేరుకొని కొమ్మలు కొట్ట సాగారు. ఆ ప్రాంతంలో క్రూర మృగాలు ఉన్నాయి, కాని రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. వారంతా పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడినుండో ఒక పులి కాస్త కుంటుతూ వీళ్లు ఉన్న ప్రాంతానికి వచ్చి గాండ్రించ సాగింది. అంద రూ ఎక్కడి వారు అక్కడే గొడ్డళ్లను పారేసి, గజగజ వణకసాగారు. ‘ఇదిగో చెబుతున్నా బా గా వినండి… నాకు బాగా ఆకలిగా ఉంది, మీ లో ఎవరు ముందుగా నాకు ఆహారంగా మారతారో నిర్ణయించుకోండి?‘ అంది పులి. రామ య్య బాగా బక్క పలచగా ఉంటాడు. భీమ య్య, భీముడులా ఉంటాడు. అందుకే అంద రూ భీముడుని నాయకుడిగా ఎన్నుకున్నారు.
పులి మాటలు విన్న అందరూ, భీమయ్య వైపు చూసారు. కానీ అందరినీ దాటుకుని రామయ్య పులి ముందుకు వచ్చి నిలబడి ‘నేను నీకు మొదటగా ఆహారమవుతాను’

అన్నాడు. ‘నీవు మరీ బక్క పలచగా ఉన్నావు…నా ఆకలి తీరదు కదా?’ అంది పులి. ఎలాగూ మేమంతా నీకు ఆహారం అవుతాము, నన్ను చంపి తిన్న తరువాత నీకు ఆకలి తీరని పక్షంలో, మరొకరిని తినవచ్చు, నీకు పోయేదేముంది?’ అన్నాడు రామయ్య. ‘అవును అదీ నిజమే సుమా!’ అంది పులి.

‘అయితే ఒక్క నిముషం…మేమంతా మధ్యాహ్నానికి సంకటి తింటాము. నేను ఎలాగూ నీకు ముందుగా ఆహారం అవుతున్నాను కాబట్టి, నేను ముందుగా సంకటిని తింటాను!’ అన్నాడు రామయ్య. ‘ఓ అలాగే తిను’ అంది పులి.
రామయ్య ఇంటి పెరడులో కూరగాలతో పాటు, పచ్చి మిరపకాయలను పండిస్తున్నాడు. ప్రతిరోజు అందరికీ సంకటిలోకి, తలా ఆరు మిరపకాయల చొప్పున తెస్తాడు.

రామయ్య ఒక పళ్లెంలో సంకటి ముద్దను పెట్టి, అందరికనీ తెచ్చిన పచ్చి మిరపకాయల తొడిమెలు తీసి,వాటిని ముక్కలుగా చేసి, సంకటి ముద్దలో బాగా కలపబోతుండగా… ‘అవి ఏంటి?’ అంది పులి.

‘వీటిని పచ్చి మిరపకాయలు అంటారు…ఇవి చాలా రుచిగా ఉంటాయి, ఇవి తింటే రెండింతల శక్తి వస్తుంది… అందువల్లే నేను బక్క పలచగా ఉన్నా కొమ్మలను సులువుగా కొట్ట గలుగుతున్నాను” అయితే వాటిని బాగా కలిపి ఆ ముద్దను నాకు ఇవ్వు. నువ్వు కావాలంటే మరో ముద్దను తయారుచేసుకో…ఒక కాలు చచ్చుపడిపోవడం వల్ల, నాకు చాలా శక్తి పోయింది” సరే ఇస్తాను కానీ. ఈ ముద్దను ఒకేసారి నమిలి మింగాలి…అప్పుడే శక్తి బాగా వస్తుంది’ ‘మనిషి తలనే ఒక్కసారి నమిలేస్తాను.. ఈ సంకటి ముద్ద ఒక లెక్కా’

రామయ్య పళ్ళెంలోని సంకటి ముద్దలో మిరపకాయలను బాగా కలిపి, పులి ముందర పెట్టాడు. పులి ఆ ముద్దను నమిలి మింగిన కొద్దిసేపటికే, దాని కళ్లలో నుండి నీళ్లు జలజలా రాసాగాయి. ‘అయ్యో!..ఏదోలా వుంది ’ అని మట్టిలో పడి పొర్లసాగింది.

‘అయితే శక్తి పని చేస్తుందన్నమాట’ అన్నాడు రామయ్య. ‘శక్తి వద్దు, ఏమీ వద్దు…చాలా బాధగా ఉంది… నన్ను కాపాడు’ అంది పులి. ‘ఇక్కడకు కొద్ది దూరంలో ఒక బావి వుంది… అందులో దూకి నీళ్లు తాగు నీకు బాగవుతుంది’ అన్నాడు రామయ్య. పులి బాధతో కుంటుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అందరూ రామయ్య సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. భీముడులా ఉంటే సరిపోదు…రామయ్య బక్క పలచగాఉన్నా, బుద్ధిలో బృహస్పతి అని కొనియాడారు.  మళ్ళీ ఆ పులి వీళ్లున్న చోటికి రాలేదు.

 

Tiger moral stories in telugu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News