Home తాజా వార్తలు శుభ్రతే నివారణ మార్గం

శుభ్రతే నివారణ మార్గం

Coronavirus Disease

 

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రస్తుతానికి ఈ వైరస్‌కి మందులేదు. యూకే నేషనల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం కరోనా వైరస్ బారిన పడ్డ వ్యక్తితో రెండు మీటర్ల కన్నా తక్కువ దూరంలో 15 నిముషాల కన్నా ఎక్కువ సేపు గడిపితే వైరస్ సోకడం ఖాయం. 

కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపరల ద్వారా కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ఏదైనా వస్తువుకు అంటి పెట్టుకుని సజీవంగా చాలా కాలంపాటు ఉంటుంది. చల్లని ప్రదేశాల్లో తొమ్మిది రోజుల వరకూ ఇది బతికుండే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. కాబట్టి, ఆ వైరస్ ఉన్న వస్తువులపై చేతులు వేసిన వాళ్లకూ అది సోకే ప్రమాదముంది. అందుకే, మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్ల హ్యాండ్ రెయిల్స్, మెట్రో రైళ్లలో నిలబడేటప్పుడు పట్టుకునే హ్యాండిళ్లు, బస్సుల్లో సీట్ల వెనుక ఉండే హ్యాండిళ్లు వంటి వాటిపై చేతులు వేయకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. ఆ వస్తువులను పట్టుకుని, తర్వాత అదే చేత్తో ముఖాన్ని, నోటిని, ముక్కు, కళ్లను తాకితే వైరస్ నేరుగా శరీరంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

కరోనా వైరస్ లక్షణాలు :
కరోనావైరస్ సోకినవారిలో లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి.
1. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు.
2. జ్వరంతో మొదలై, తీవ్రమైన పొడి దగ్గు వస్తుంది.
3. వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.
4. సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది.
5. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులు, పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు గురవుతున్నారు.
6. ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి కూడా రావచ్చు. తప్పనిసరి కాదు.
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే…
కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అందుకు కొన్ని సూచనలు చేసింది.
7. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరుచుకోవాలి.
8. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి కనీసం ఒక మీటరు నుంచి మూడు మీటర్ల దూరంలో ఉండాలి.
9. ఆ రెండు లక్షణాలతో బాధపడుతున్నవారు తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా గుడ్డను అడ్డుపెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.
10. ప్రయాణాల్లో, షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతునే ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంది. అవే చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కనుక అదే పనిగా చేతులతో కళ్లను, నోటిని, ముక్కును తాకవద్దు.
11. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు
12. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి.
13. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకూడదు.
14. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం దగ్గర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

అసలీ వైరస్ ఎలా దాడిచేస్తుందంటే….
వైరస్‌లు మన శరీరంలోని కణాల్లోకి వెళ్లి, వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. కొత్త కరోనా వైరస్‌ను అధికారికంగా సార్స్ -కోవ్-2 అని పిలుస్తున్నాం. మనం ఈ వైరస్‌ను శ్వాసలోకి పీల్చినపుడు లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మొదట గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. ఆ ప్రదేశాల్లో వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి మరిన్ని శరీరకణాల మీద దాడి చేస్తుంది. ఇది ప్రాథమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం- ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది.

1. కరోనా వైరస్ వల్ల వచ్చే దగ్గు ఆరంభంలో పొడిగా ఉంటుంది. అంటే తెమడ వంటిదేమీ రాదు.
2. వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి బహుశా దీనికి కారణం కావచ్చు.
3. కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది.
4. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు తెమడ రూపంలో బయటకు వస్తాయి.
ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు శరీరానికి పూర్తి విశ్రాంతి అవసరం. ఎక్కువ మోతాదులో ద్రవాలు తీసుకోవాలి. ప్రత్యేకమైన ఆస్పత్రి చికిత్స అవసరం ఉండదు. ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా ఉన్నవాళ్లు ఈ వైరస్‌తో పోరాడి గెలుస్తారు. కొంతమందిలో కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది.
ఈ దశలో ముక్కు కారటం, జలుబు వంటి లక్షణాలు కూడా రావచ్చని పలు అధ్యయనాల్లో తెలుస్తోంది.

శుభ్రత ఒక్కటే మార్గం :
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో వైద్యులు దీన్ని అరికట్టేందుకు శుభ్రతపైన దృష్టి పెట్టమంటున్నారు. మనకు తెలియకుండానే మనచుట్టూ ఎన్నో ప్రదేశాల్లో అనారోగ్యాన్ని కలిగించే వైరస్‌లు దాక్కుని ఉంటున్నాయి. ఎంతో శుభ్రంగా ఉంచుకునే వంటిల్లు ముఖ్యంగా ఎన్నో బ్యాక్టీరియాలను దాచి ఉంచుతుంది. ఒక అధ్యయనంలో వంటింట్లో ఉపయోగించే స్పాంజిల్లో, ఆహారాన్ని భద్రం చేసే ఫ్రిజ్‌లో, కిచెన్ సింక్‌లో, డిష్ క్లాత్స్‌లో, కాఫీ మేకర్స్‌లో, కటింగ్ బోర్డ్‌లపైన బ్యాక్టీరియా అధిక శాతం తిష్టవేస్తుంది. వీటన్నింటినీ శుభ్రం చేస్తూనే ఉండాలి. అలాగే రోజవారీ జీవితంలో కొనుగోళ్లతో అందుకునే డబ్బు, చిల్లర, ఆఫీస్ డోర్ హాండిల్స్, టాయ్‌లెట్స్, మనం పని చేసుకునే టేబుల్స్ అన్నింటిపైనా బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని వాడకుండా ఉండేందుకు అవకాశమే లేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి దృష్టా శానిటైజర్‌ను బ్యాగులో వేసుకోవటమే నివారణ పద్ధతి.

ఇల్లు శుభ్రం చేయటంలో మరింత శ్రద్ధ తీసుకోవటం, నీళ్లు నిలువ చేసే ట్యాంకులపైన మూతలు పెట్టటం, ఇంటిచుట్టూ చిన్న చిన్న గుంటల్లో నీరు ఉండకుండా చూడటం, నిత్యం రెండు పూటలా స్నానం చేయటం, దుప్పట్లు, దిండ్లు, కర్టెన్స్, డోర్‌మేట్స్‌తో సహా వారానికోసారి శుభ్రం చేసుకోవటం చేయగలిగిన కర్తవ్యాలు. శరీర శుభ్రత, ఇంటి శుభ్రత పాటిస్తే సగం అనారోగ్యాలు తగ్గుతాయి. సమూహాలుగా ఉండటం, బయట తిండి తినడం, ప్రయాణాలు చేయడం కొన్నాళ్లు మానుకోవాలి. ఒకవేళ అత్యవసరం అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాగులో ఎప్పుడూ శానిటైజర్, టిష్యూ పేపర్లు, మాస్క్‌ల్లాంటివి ఉంచుకోవాలి. ఇలాంటివన్నీ పాటిస్తే ఎలాంటి రోగాలు దరిచేరవు. మనతోపాటు చుట్టుపక్కల వారినీ ఆరోగ్యంగా ఉంచాలంటే ఈ కనీసపు జాగ్రత్తలు పాటించమని వైద్యులు చెబుతున్నారు.

Tips for Prevention of Coronavirus Disease