Home ఆంధ్రప్రదేశ్ వార్తలు 8 నుంచి తిరుమల గుడి కూడా

8 నుంచి తిరుమల గుడి కూడా

Tirumala Temple to Reopen for Darshan from June 8

 

11 నుంచి రోజుకు 3 వేల సర్వదర్శనం టోకెన్లు, 3 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు జారీ..
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి

మనతెలంగాణ/తిరుమల: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ -19 లాక్డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో జూన్ 8వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్తో కలిసి ఛైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

1. కరోనా వ్యాధి కారణంగా మార్చి 20వ తేదీ నుంచి భక్తులకు స్వామి దర్శనం నిలిపివేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో సుమారు 80 రోజుల తరువాత భక్తులకు స్వామి దర్శనం కల్పించబోతున్నాం.
2. ఇందుకోసం ఈ నెల 8 వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా దర్శనం కల్పించబోతున్నాం.
3. జూన్ 8 ,9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు మరియు వారి గుర్తింపుకార్డు పై ఉన్న కుటుంబ సభ్యులకు ఇంట్రానెట్లో టైం స్లాట్ బుకింగ్ ద్వారా దర్శనం పొందడానికి, ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు టోకెన్లు జారీ చేస్తాం. 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వారికి ఇందులో అనుమతి లేదు.
4. జూన్ 10వ తేదీ తిరుమలలోని స్థానికులకు గంటకు 500 మంది చొప్పున తిరుమలలోని కౌంటర్ల లో టైం స్లాట్ టోకెన్ల జారీ.
5. జూన్ 11వ తేదీ నుంచి ప్రతి రోజూ 3000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్ ద్వారా జూన్ 8వ తేదీ నుంచి జారీ చేస్తారు. సర్వదర్శనం టికెట్లు 3000 చొప్పున తిరుపతిలోనే కౌంటర్ల ద్వారా జారీ చేస్తారు.
6. జూన్ 11 నుంచి రోజుకు 1 గంట మాత్రమే స్వయంగా వచ్చే విఐపిలకు బ్రేక్ దర్శనం ఉంటుంది. సిఫారసు లేఖలు స్వీకరించబడవు.
7. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అలిపిరి కాలి బాట మార్గంలో భక్తులను అనుమతిస్తారు.
8. భక్తుల భద్రత దృష్ట్యా శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రస్తుతానికి మూసి ఉంచుతారు.
9. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఘాట్ రోడ్లు తెరచి ఉంచుతారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.
10. అలిపిరి టోల్గేట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్, వెహికల్ స్కానింగ్, హ్యాండ్ సానిటైజర్లు ఏర్పాటుచేసి ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేశాక దర్శన టికెట్ ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు.
11. దర్శనం, ఇతర వసతుల పర్యవేక్షణకు సీనియర్ అధికారుల నియామకం.
12. ప్రతి 2 గంటలకు గదుల శానిటైజేషన్ చేస్తారు. గదికి ఇద్దరికే అనుమతి. ఆల్టర్నేట్ పద్ధతిలో గదుల కేటాయింపు జరుగుతుంది. గదులు 24 గంటలకు మించి పొడిగింపు లేదు. కొండ మీద మఠాలు కూడా భక్తులకు ఇదే పద్ధతిలో గదులు కేటాయిస్తారు.
13. తిరుపతిలో కూడా ఇదే విధంగా గదులు కేటాయిస్తారు.
14. తిరుమలలోని కళ్యాణ మండపాల్లో వివాహాలు చేసుకోవాలనుకున్న వారు ముందుగా ఆరోగ్య శాఖ అధికారి నుంచి అనుమతి పొందాలి. 50 మందికి మాత్రమే అనుమతి.
15. అలిపిరి కాలిబాట, క్యూ కాంప్లెక్స్ లలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిరంతరాయంగా 5 భాషల్లో అనౌన్స్మెంట్ చేస్తాం.
16. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవాలి. కనీసం రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది.