Home తాజా వార్తలు హామీల అమలు కోసమే సిఎంను కలిశాం

హామీల అమలు కోసమే సిఎంను కలిశాం

Karam-Ravinder-Reddy

 రాష్ట్ర సిబ్బంది సంఘాలపై ఆరోపణలను ఖండిస్తున్నాం
 ఆర్‌టిసి కార్మికుల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి
 సకల జనుల సమ్మెలో మేమూ ఉన్నాం
– తెలంగాణ ఉద్యోగుల జెఎసి చైర్మన్ రవీందర్‌రెడ్డి, కన్వీనర్ వి. మమత

మన తెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ ఉద్యోగుల జేఏసి, టిఎన్జీఓ, టిజిఓ సంఘాలపై జరుగుతున్న దుష్ఫ్రచారాన్ని ఖండిస్తున్నామని, కొంతమంది కావాలనే తమపై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారని చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి.మమతలు ఓ ప్రకటనలో ఖండించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు సిఎం కెసిఆర్‌ను తాము కలిశామన్నారు. గత సంవత్సరం ఉద్యోగుల జేఏసితో నిర్వహించిన సమావేశంతో పాటు గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇచ్చిన హామిలను అమలు చేయాలని సిఎంను కోరినట్టు వారు పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగులకు పిఆర్‌సి ఇచ్చారని, ఆర్టీసీ ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలను ప్రభుత్వం చేపట్టలేదని వారు పేర్కొన్నారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని వారు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయన్నారు. కొన్ని సంఘాల నేతలు, కొందరు రాజకీయ పార్టీల నేతలు జేఏసి, టిఎన్జీఓలు, టిజిఓల ప్రతిష్టను దెబ్బతీయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పేరున సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారన్నారు. కొంతమంది నాయకులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల మధ్య అగాధాన్ని సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం మన మధ్యన అనైక్యతను దారితీస్తుందని, అది మనకు నష్టం చేస్తుందన్నారు.
సకల జనుల సమ్మెలో మేము కలిసి పనిచేశాం
తెలంగాణ ఉద్యోగుల జేఏసి ఆరు సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు సంబంధించి అనేక సమస్యలను పరిష్కరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్‌సి ఇచ్చిన తరువాతే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం పిఆర్‌సీ ఇచ్చిందన్నారు. అది అందరికన్నా ఎక్కువగా 44 శాతం ఫిట్‌మెంట్ పిఆర్‌సీ ఇచ్చిందన్నారు. తాము సాధించిన పరిష్కారాలే అందరికీ మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఆర్టీసీ, ఉపాధ్యాయులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయినప్పటికీ తోటి కార్మికులుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని సకల జనుల సమ్మెలో తాము కలిసి పనిచేశామన్నారు. అదే స్ఫూర్తితో ఆర్టీసీ, కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామన్నారు.
తోటి సంఘాల మద్దతు కోరడంలో తప్పులేదు
ఆర్టీసీని ప్రజలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు సేవలందించే ఒక రవాణా సంస్థగా పరిగణిస్తున్నామన్నారు. ఉద్యమంలో తోటి సంఘాల మద్ధతు కోరడంలో తప్పులేదన్నారు. కానీ బెదిరింపులకు పాల్పడితే అది నష్టం చేస్తుందన్నారు. టిఎన్జీఓ, టిజిఓల పట్ల కొన్ని సంఘాలు అవలంబిస్తున్న వైఖరినే తాము కూడా ఆయా సంఘాల పట్ల వ్యక్తం చేస్తామని, తమ వైఖరి అదేవిధంగా ఉంటుందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు తమ సమస్యల పరిష్కారం కొరకు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలన్నారు. అన్ని సంఘాల మద్ధతు తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల జేఏసి కట్టుబడి ఉందన్నారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వారు విజ్ఞప్తి చేశారు.

TNGO president Karam Ravinder Reddy To Meets Cm Kcr