Home వార్తలు ఈ-కామర్సా.. మజాకా!

ఈ-కామర్సా.. మజాకా!

ప్రత్యేక యాప్‌లు

మొబైల్ మార్కెటింగ్ కూడా పెరుగుతోంది. ఆన్‌లైన్ సంస్థలు ప్రత్యేక యాప్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. మొబైల్ ద్వారా కొనుగోలు, అమ్మకాలు చేపడుతున్నారు. చాలా ఈ-కామర్స్ సంస్థలు మొబైళ్లపైనా దృష్టి పెట్టాయి. దేశంలో దిగ్గజ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ మధ్య పోటీ వాతావరణం నెలకొంది. భారీగా డిస్కౌంట్లతో ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. పండగ సీజన్‌లలో ఈ రెండు కంపెనీల మధ్య గట్టి పోటీ నెలకొంటొంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌ను, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్‌తో పోటీ పడ్డాయి.

e-commerce2ఆన్‌లైన్‌లో కొత్త ఫోన్ బుక్ చేశాను.. రేటు చాలా తక్కువ పడింది.. నాణ్యతకు ఢోకా లేదు.. గ్యారంటీ ఉంది.. ఇదీ ఇప్పుడు వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి జరుగుతున్న సంభాషణ.. సాంకేతిక ఎంత కొత్త పుంతలు తొక్కుతుందో దీన్నిబట్టి తెలుస్తోంది. ఏదైనా వస్తువు కొనాలంటే ప్రస్తుతం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండి కంప్యూటర్ లేదా పోన్ సహాయంతో లావాదేవీలు జరపవచ్చు. భవిష్యత్‌లో ఏ వస్తువు కొనాలన్నా ఇలాగే ఉంటుందనడానికి ప్రస్తుత పరిస్థితులు అద్దం పడుతున్నాయి. చిన్న పిన్నీసు నుంచి పెద్దపెద్ద కార్ల వరకు ఏ వస్తువైనా ఇ-కామర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దుస్తులు, సెల్‌ఫోన్లు.. ఆఖరికి పప్పులు, ఉప్పులు వంటి ఇంటి సరుకులు కూడా కొను గోలు చేసే వీలుంది. బయటి మార్కెట్‌తో పోల్చి చూస్తే భారీ తగ్గింపు ధరలకే వస్తువులు కొనుగోలు చేసే అవ కాశం ఇ-షాపింగ్‌లో కల్పించడం ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుంది. స్మార్ట్‌ఫో న్లలోనే షాపింగ్ పనులు చకచకా చేసుకుపోతున్నారు. సమయం ఆదా అవుతోంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతరత్రా కొనాలంటే బయటికి వెళ్లాలి, వాటి నాణ్యత, రేట్లు చూడాలి.. వివరాలు తెలుసుకుని. అవసరమైతే బేరమాడాలి. అటువంటి పరిస్థితులు ఇప్పుడు పోయా యి. ఏ వస్తువు కొనాలన్నా ఆన్‌లైన్ వెబ్‌సైట్లోకి వెళితే చాలు.. అన్నీ కనిపిస్తాయి. అదికూడా ఎలాంటి టెన్షన్ లేకుండా మనకు ఎలాంటి వస్తువు కావాలో ఏరికోరి మ రీ ఎంపిక చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది సాంకేతిక పరిజ్ఞానం అంతే.. ఇతర వస్తువులతో పోల్చి చూసి, మన కు నచ్చేంత వరకు ఎంత సమయమైనా తీసుకోవచ్చు. దీనికి అడ్డు చెప్పేవారెరూ లేరు. దీనికి కావాల్సింది ఇంటర్నెట్.. లేకపోతే స్మార్ట్‌ఫోన్ అంతే. ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల వ్యాపారాన్నే ఇ-కామర్స్ అంటున్నారు.
ఇ-కామర్స్ అంటే?
ఎలక్ట్రానిక్ కామర్స్ అని పూర్తి నిర్వచనం. ఇది ఇంటర్నెట్ సహాయంతో జరిగే ఒక రకమైన వ్యాపారం. ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్‌పై సరుకుల కొనుగోళ్లు, అమ్మకాలు లేదా నిధుల బదిలీనే ఇ-కామర్స్ అంటారు. ప్రపంచంలో పెను మార్పులను తీసుకొస్తున్న ఇ-కామర్స్‌లో వ్యాపార లావాదేవీలు పలు రకాలుగా జరుగుతాయి. ఇ-కామర్స్‌లో బిజినెస్ నుంచి బిజినెస్, బిజినెస్ నుంచి కస్టమర్, కస్టమర్ నుంచి కస్టమర్ లేదా కస్టమర్ నుంచి బిజినెస్ వంటి రకాలు ఉన్నాయి. ఇ-కామర్స్ పదాలను ఇ-బిజినెస్‌కు పర్యాయ పదంగా వినియోగిస్తారు. మొబైల్ కామర్స్, ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ, సరఫరా గోలుసు నిర్వహణ, ఇంటర్నెట్ మార్కె టింగ్, ఆన్‌లైన్ లావాదేవీ ప్రక్రియ, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్‌ఛేంజ్, జాబితా నిర్వహణ వ్యవస్థలు, స్వయం చాలక డేటా సేకరణ వ్యవస్థలు వంటి టెక్నాలజీలు ఇ-కామర్స్‌లో ఉంటాయి. ఆధునిక ఎలక్ట్రానిక్ కామర్స్‌కు సాధారణంగా వరల్డ్ వైడ్ వెబ్(డబ్లుడబ్లుడబ్లు) వినియోగిస్తారు. ఇ-మెయిల్, ఇ-కామర్స్ బిజినెస్ అందరి జీవితాల్లో ఒక భాగమైనాయి. అమెరికా, బ్రిటన్, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ ఇ వ్యాపారంలో చాలా వెనుకనే ఉన్నా, ఇప్పుడిప్పుడే వేగంగా పుంజుకుంటోంది. 2020 సంవత్సరం నాటికి భారత్ ఇ-కామర్స్ మార్కెట్ 50-70 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ అంచనా వేస్తున్నారు.
చాలా తక్కువ ధరకే…
బహిరంగ మార్కెట్‌లో దుకాణం అద్దె, సిబ్బంది జీత భత్యాలు, విద్యుత్ ఇతర ఖర్చులు, రవాణా, పంపిణీదారులు కమీషన్లు.. ఇలా అన్ని కలిపి వస్తువు తయారీ రేటుతో పోలిస్తే రెట్టింపు అవుతున్నాయి. అదే ఇ-కామర్స్ విషయంలో పైన పేర్కొన్న ఖర్చులు చాలా వరకు ఉండవు. దీంతో తయారీదారుతో నేరుగా ఒప్పందం చేసుకున్న ఆన్‌లైన్ కంపెనీలు, రిటైల్ ధరలతో పోల్చినప్పుడు 30 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గింపు ధరకే వస్తువులను విక్రయించి యువతను ఆకర్షిస్తున్నాయి. దీనివల్లే ఇ-కామర్స్‌కు ఆధరణ రోజురోజుకీ పెరుగుతోంది.
నాణ్యతలో రాజీపడడం లేదు
ఆన్‌లైన్ వస్తువులో రాణిస్తున్న ఫ్లిప్‌కార్ట్, జోపీ, స్నాప్‌డీల్, జంగ్లీ, జబాంగ్, మెంట్రా, అమేజాన్ వంటి కంపెనీలు సరుకులు నాణ్యతతో రాజీపడటం లేదని వినియోగదారులు చెబుతున్నారు. మౌత్ పబ్లిసిటీ నాణ్యత కారణంగానే జరుగుతోందని, ఈ కారణంగానే ఒకరు ఒకరు పెరిగి యువత ఆన్‌లైన్ షాపింగ్‌లో మునిగితేలుతున్నారని తెలుస్తోంది. ఆన్‌లైన్ మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది.
జాగ్రత్తలు తప్పనిసరి
ఆన్‌లైన్ షాపింగ్ వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రయోజనాలూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సింది వినియోగదారులే, ఆన్‌లైన్ షాపింగ్ చేసేముందు కంపెనీకి చెందిన గత రికార్డుల చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. కోరిన సరుకులు ఇవ్వడంతో పాటు రిటర్న్ (వాపసు) సౌకర్యం కల్పిస్తున్నన్నాయా? లేదా? తెలుసుకోవాలి. అన్ని విషయాలపై పూర్తిగా ముందే నిర్ధారించుకోవాలి. క్యాష్ ఆన్ డెలివరీ కన్నా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేసేవారు అన్ని వివరాలు నిర్ధారించుకున్నాకే చెల్లించాలని వారు అంటున్నారు.
దసరా, దీపావళికి బంపర్ ఆఫర్ల మోత
దసరా, దీపావళి పండగలకు ఇ-కామర్స్ సంస్థలు ఆఫ ర్లతో వినియోగిదారులను ముంచెత్తుతాయి. భారీ తగ్గిం పు ధరలు, క్యాష్‌బ్యాక్ ప్రైజ్‌లు వంటి బంపర్ ఆఫర్లు అందిస్తాయి. ఇదే వరుసలో ముందున్న ఫ్లిప్‌కార్ట్.కామ్ కంపెనీ భారీ ఆఫర్లతో కస్టమర్లను ఊగించింది. ఒక దశలో లక్షల్లో వినియోగదారులు ఎగబడటంతో సర్వర్లు జామ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఒక్క రోజే ఏకంగా రూ.610 కోట్ల భారీ వ్యాపారం చేసిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది పండగ సీజన్‌లో ఈ రెం డు దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీల మధ్య గట్టి పోటీ నెల కొంది. ప్రతి ఏడాది ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డే సేల్‌ను ప్రకటించి, సంచలనం సృష్టిస్తోంది. స్నాప్‌డీల్ దాదాపు 70 శాతం తగ్గింపు ధరలతో వస్తువు లను ఆఫర్ చేశాయి. ఫ్యాషన్ విభాగంలో 40 నుంచి 70 శాతం డిస్కౌంట్, అలాగే హోం, లీవింగ్ వస్తువుల్లో 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌లో 50 శాతం వరకు తగ్గింపును ఇచ్చాయి. పోటీ వల్ల వినియోగదారులకు మరింతగా ప్రయోజనం చేకూరుతోంది. ఆకర్షణీమైన ఆఫర్లతో పాటు డెలివరీ సేవలను కూడా పెంచుతూ, ఇన్‌స్టంట్ రిఫండ్ సౌకర్యాన్ని ప్రారంభించాయి. కంపెనీ నుంచి అందుకున్న ఉత్పత్తిని కస్టమర్లు వెంటనే పంపితే గంటలోపే రిఫండ్ చేసే సౌకర్యాన్ని కలిస్తున్నారు. తక్షణ వాపసు విధాన సౌకర్యాన్ని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన తర్వాత 12 రోజులకే స్నాప్ డీల్ కూడా ఇదే విధానాన్ని తమ సంస్థలోనూ తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ విధానం ప్రకారం, వినియోగదారులు వస్తువులను అందుకున్న తర్వాత వాపసు చేస్తే 24 గంటల్లోగా తిరిగి డబ్బు చెల్లిస్తారు.

ఈ కామర్స్ రంగంలోకి బడా కంపెనీలు
దేశంలో ఈ కామర్స్ రంగం విజృంభిస్తోంది. ఒక్క మౌస్ క్లిక్ తో అన్ని ఇంటిదగ్గరకు వచ్చే ఆధునిక టెక్నాలజీ పట్ల యువత అత్యంత ఆసక్తి చూపుతోంది. టాటా, విప్రో, అలీబాబా లాంటి బడా కంపెనీలు సైతం దేశీయ ఈ కామర్స్ రంగంలోకి పెట్టుబడులు పెడుతున్నాయి. ఆన్ లైన్ బిజినెస్‌ను బడ్జెట్ నిరాశకు గురి చేసింది. అస్సలు ఈ విషయం గురించే ప్రస్తావించలేదు. ఏప్రిల్ ఒకటి తర్వాత వచ్చే స్టార్టప్‌లకు మూడేళ్లపాటు పూర్తిగా పన్ను మినహాయిస్తామన్నారు. ఈ కామర్స్‌లో వచ్చే స్టార్టప్‌లు దీని ద్వారా ప్రయోజనం పొందుతారన్నమాట. ఇప్పటికే ఇ-కామర్స్‌లో కుప్పలు తెప్పలుగా ఇ-కామర్స్ సంస్థలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు స్టార్టప్ రిజిస్ట్రేషన్ కోసం నెలలతరబడి ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు ఒక్కరోజులోనే ప్రక్రియ పూర్తవుతుందని ఆర్థికమంత్రి జైట్లీ హామీనిచ్చారు. ఈ నిబంధన అమలుకు ప్రభుత్వ చిత్తశుద్ధి అవసరం. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమల్లోకి వస్తే పరోక్షపన్నుల సమస్యలన్నీ తొలగిపోతాయి. అందుకే ఈ కామర్స్ కంపెనీలు ఈ బిల్లు ఆమోదాన్ని కోరుకుంటున్నాయి. జిఎస్‌టి అమలైతే అందులోనే ఈ కామర్స్ ఉందంటున్నాయి పలు కంపెనీలు.
రాష్ట్రాలకే మేలు: ఆర్‌బిఐ
ఈ-కామర్స్ వ్యాపారానికి పన్ను విధింపు వల్ల రాష్ట్రాల ఆదాయం మరింతగా పెరుగుతుందని, దేశంలో పాలనాపరమైన నిబంధనలు, విధానాల స్పష్టత ఇవ్వాల్సి ఉందని ఆర్‌బిఐ పేర్కొంటోంది. అమెజాన్ వంటి ఈ-కామర్స్ కంపెనీలకు పన్నుపై పలు రాష్ట్రాల్లో అనేక వ్యాజ్యాలు వచ్చాయి, వీటిని పరిశీలించిన అనంతరం ఆర్‌బిఐ ఈ సూచనలు చేసింది. ఈ-కామర్స్ కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడినాయంటూ కేరళ ప్రభుత్వం సదరు కంపెనీలకు సుమారు రూ.54 కోట్ల పన్ను నోటీసులను పంపింది. ఈ క్లిష్ట సమస్యను పరిష్కరించాల్సి ఉందని, దేశవ్యాప్తంగా ఒకే విధానంలో పన్నును అమలు చేయాల్సి ఉందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. సమస్యలను పరిష్కరించేందుకు ఈ-కామర్స్ పన్ను విధానానికి ఏకరీతి మోడల్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందని ఆర్‌బిఐ నివేదికలో వెల్లడించింది.
మరిన్ని చర్చలు అవసరమన్న వాణిజ్య మంత్రి
రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) విధానంలో ఎలాంటి మార్పు లేదని వాణిజ్య శాఖమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రిటైల్ రంగంలో 51 శాతం విదేశీ పెట్టుబడులను 2012లో కాంగ్రెస్ హాయాంలో నిర్ణయం తీసుకున్నారని, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఇ-కామర్స్‌లో ఎఫ్‌డిఐపై ప్రభుత్వం చర్చలు జరిపింది. బి2సి(బిజినెస్ టు కన్జూమర్) విభాగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించాలా? వద్దా? అనే అంశంపై రిటైల్ దిగ్గజ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్ సహా వాటాదారులతో చర్చించారు. ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని, ప్రతిఒక్కరి అభిప్రాయాలను తీసుకుంటామని వాణిజ్య శాఖమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇ-కామర్స్‌లో ఎఫ్‌డిఐ అవసరమా? లేదా? తెలుసుకుంటున్నామని, దీనికి మరిన్ని సమావేశాలు నిర్వహించాల్సి ఉందని ఆమె తెలిపారు. ప్రస్తుతం బి2బి(బిజినెస్ టు బిజినెస్) ఇ-కామర్స్‌లో విదేశీ పెట్టుబడులు 100 శాతం అనుమతి ఉంది. కానీ వినియోగదారులకు ప్రత్యక్షంగా విక్రయించేందుకు బి2సిలో అనుమతి లేదు. పరిశ్రమ సంఘాలు సిఐఐ, ఫిక్కీ, నాస్కామ్, ఇబే, స్నాప్‌డీల్, డెకాథ్లాన్, హెచ్ అండ్ ఎం, ఐకియా వంటి కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
పెరుగుతోన్న తపాలా శాఖ ఆదాయం
ఇ-కామర్స్ కంపెనీలు పోస్టల్ విభాగం ఆదాయాన్ని మరింతగా పెంచుతున్నాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇ-కామర్స్ కంపెనీలు దేశీయ తపాల శాఖ సహాయంతో కస్టమర్లకు మరింత వేగవంతంగా సేవలు అందించా లనుకుంటున్నాయి. దీంతో పోస్టల్ శాఖ ఆదాయం పెరుగనుంది. దేశీయ వాణిజ్య పట్టణం ముంబయిలో ఇ-కామర్స్, పార్సిల్ ప్రాసెసింగ్ సెంటర్ సన్నాహాలు జరిగాయి. పట్టణంలో పారెల్ వద్ద 12వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రతి రోజూ 5వేల దాకా ఆర్డ ర్లను పొందాలని నిర్ణ యించగా, దీంతో రోజుకు 10వేల వరకు పార్సిల్ వచ్చే అవకా శముంది. ఈ కేంద్రంలో ప్రతి రోజు 30వేల పార్సిల్‌ల సామర్థం ఉంది. ఇప్పటికే పలు ఈ-కామర్స్ కంపెనీలు తపాలా శాఖను సంప్రదించాయి. వీటిలో అమేజాన్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, ఈ-బే, టెలిబ్రాండ్ ఇండియా, టివిసి నెట్‌వర్క్, క్విక్ సర్వీసెస్, రెడ్ బాక్స్ వంటివి ఉన్నాయి. గత సంవత్సరమే వాణిజ్య ఒప్పందం ప్రక్రియను ప్రారంభించామని, ప్రస్తుతం ముంబయిలో 46 ఇ-కామర్స్ కంపెనీలు, పుణెలో ఏడు, గోవాలో 6 కంపెనీలతో ఒప్పందం కలిగి ఉన్నామని పోస్టల్ విభాగానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు.
50 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు
ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరిగే ఆటోమేటిగ్గా ఇ-కామర్స్ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. 2016 సంవత్సరంలో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50 కోట్లకు కోట్లకు చేరుకుంటుందని టెలికామ్ మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 40 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. రెండేళ్లలో వీరి సంఖ్య 50 కోట్లకు చేరుకోవాలని ప్రభుత్వం లక్షంగా చేసుకుంది. కానీ 2016 సంవత్సరంలో ఈ టార్గెట్‌ను చేరుకోనున్నామని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
పలు ఇ-కామర్స్ సంస్థల్లో రతన్ పెట్టుబడులు
స్టార్టప్‌లలో పెట్టుబడులతో ప్రోత్సాహం అందిస్తున్న టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పలు ఇ-కామర్స్ సంస్థ ల్లోనూ ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఇన్వెస్ట్ చేసిన వాటిలో ఇ-కామర్స్ సంస్థలే ఎక్కువగా ఉండడం గమనార్హం. కొత్త వ్యాపారాలను ప్రోత్సహించి వారికి వెన్నుదన్నుగా నిలుస్తు న్నారు. స్నాప్‌డీల్, బ్లూస్టోన్, అర్బన్ లాడర్, కార్‌దేకో. కామ్, వన్ 97 కమ్యూనికేషన్స్, గ్జియోమి, ఫ్యాషన్ పోర్టల్ కార్యాహ్, జంగిల్ వెంచర్స్, ఓలా తదితర సంస్థల్లో రతన్ ఇన్వెస్ట్ చేశారు.
యూఎన్ ఇ-కామర్స్‌లో భారత్‌కు 83వ ర్యాంకు
ఈ కామర్స్ సంసిద్ధతపై ఐక్యరాజ్యసమితి వాణిజ్య విభాగం కొత్తగా రూపొందించిన సూచీలో భారత్‌కు 83వ ర్యాంకు లభించింది. ప్రపంచంలోనే కామర్స్ విధా నంలో కంపెనీల నుంచి ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు వచ్చిన నాలుగో దేశం భారత్ కావడం గమనార్హం. యూఎన్ సిటిఎడి మొత్తం 130 ఆర్థిక వ్యవస్థలను సర్వే చేసింది. ఇంటర్నె ట్ వినియోగం, సర్వర్ల భద్రత, క్రెడిట్ కార్డుల అనుసంధానం, మెయిల్ డెలివరీ వంటి నాలుగు అంశాలపై అధ్యయనం చేసింది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్న వారి శాతంతో సూచీ విలువ సహసంబం ధాన్ని పరిశీలించింది. ఇందులో భారత్‌కు 40.6 సూచీ విలువ లభించింది. అలాగే 15 ఏళ్ల వయస్సు మించిన ఆన్‌లైన్ కొనుగోలు దారుల్లో 1.8 లక్షల మంది క్రెడిట్ కార్డు లను కలిగి ఉన్నారు. అలా గే 12.6 శాతం మంది ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. మిలి యన్ ప్రజల్లో 48.2 శాతం మంది సర్వర్లను ఉపయో గిస్తున్నారు. 100 శాతం మందికి ఇంటి నుంచే మెయిల్ పంపే సౌకర్యం ఉంది. క్రెడిట్ కార్డుల విని యోగంలో మాత్రం భారత్ వెనుకబడి ఉంది. ఇంటర్నెట్ విని యోగంలో కూడా దేశీయస్థాయిలో వెనుకబడే ఉంది. అన్ని దేశాలకు భిన్నంగా నూరు శాతం మెయిల్ డెలివరీ ఉన్న దేశంగా భారత్ నిలవడం సానుకూల అంశంగా తెలిపారు. ఈ కామర్స్ సంసి ద్ధతలో ప్రపంచంలో ఒకటి నుంచి నాలుగు స్థానాలను లక్సెంబర్గ్, నార్వే, ఫిన్‌లాండ్, కెనడాలు వరుసగా ఆక్రమించాయని తెలిపారు.

2.5 లక్షల ఉద్యోగాల సృష్టి 

ఇ-కామర్స్ పరిశ్రమ ఈ ఏడాది కొత్తగా 2.5 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తన నివేదికలో పేర్కొంది.2016లో నియామకాలలో పెరుగుదల 60 నుంచి 65 శాతం ఉండొచ్చని నివేదికలో తెలిపింది. గత ఏడాది ఇ-కామర్స్ విభాగాల్లో టర్నోవర్ భారీగా పెరిగిందని, అది మున్ముందు జరిగే అభివృద్ధికి ఎంతగానో తోడ్పడనుందని అసోచామ్ పేర్కొంది. 2009లో దేశంలో ఇ-కామర్స్ మార్కెట్ విలువ 3.8 బిలియన్ డాలర్లు కాగా అది 2014లో 17 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది 38 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు రిపోర్టులో తెలిపింది.తాత్కాలిక ఉద్యోగాలు, సరఫరా, లాజెస్టిక్స్, సహాయక విభాగాలలో ఈ నియామకాలు ఉండొచ్చని అభిప్రాయపడింది.

2020 కల్లా 40-50 బిలియన్ డాలర్లకు 

భారత ఈ-కామర్స్ రంగం సరికొత్త తీరాలకు చేరనుందని ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఇండియా రిటైల్ అసోసియేషన్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. 2020 కల్లా భారత ఈ-కామర్స్ లావాదేవీలు ఐదు రెట్లు పెరిగి 8-12 బిలియన్ డాలర్ల నుంచి 40-50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించింది. 2020 ఏడాదికి అమ్మకాలు 60 శాతం పెరిగితే అందులో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వాటా 30 శాతం ఉంటుందని నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్ యూజర్లు 260 మిలియన్ల నుంచి 650 మిలియన్లకు చేరుకోవడంతో అమ్మకాల్లో వృద్ధి ఉంటుంది. యూజర్ల సంఖ్య పట్టణాల్లో 80-120, గ్రామాల్లో 29-40 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. 2020లోపు 400 మిలియన్ల వినియోగదారులు డిజిటల్ ప్రభావానికి గురవుతారు. వీరిలో 25 శాతం మంది ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ధరలు పరిశీలించి వస్తువులు కొనుగోలు చేస్తారని నివేదిక తెలిపింది.

వచ్చే ఐదేళ్లలో  వృద్ధి 36 శాతానికి

భారీ డిస్కౌంట్లు, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం బాగా పెరగడంతో ఇ-కామర్స్ మార్కెట్లో తనదైన వృద్దిని పెంచుకుంది. భారత మార్కెట్‌లో వచ్చే ఐదేళ్లలో ఈ వృద్ధిని 36 శాతానికి పెంచుకోగలదని నివేదికలు వెల్లడిచేస్తున్నాయి. 2015-20 కాలానికి ఇ-కామర్స్ మార్కెట్ దూసుకుపోతూ ఉపాధి మార్గాన్ని మరింత విస్తృతపరచనుంది. యాంత్రికమవుతున్న జీవన విధానం ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ పెరగడమే ఇందుకు కారణంగా నివేదిక వెల్లడించింది. కూర్చున్న చోటే భారీ డిస్కౌంట్లతో మార్కెట్ చేయడానికి వినియోగదారులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇ-కామర్స్ మార్కెటింగ్ సేవలలో ట్రావెల్ మార్కెట్ ముందువరుసలో ఉంది. వీకెండ్‌లు, సెలవు రోజులలో గడపటానికి హోటళ్లు, బస్, రైలు, విమాన టికెట్ల బుకింగ్స్‌కు ఎక్కువగా ఆన్‌లైన్ ట్రావెలింగ్‌నే ఎంచుకుంటున్నారు. ఇ-కామర్స్ మార్కెట్ చెల్లింపులు మెరుగుపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ సురక్షితం కాదనే భావన నుంచి వినియోగదారులు బయటపడుతున్నారు. కొనుగోలు చేసిన రోజే డిలివరీ కూడా ఎక్కువైంది. దీంతో ఈ-కామెర్స్ వేగంగా వృద్ది రేటును పెంచుకుంటోంది.
– పిల్లలమర్రి వేణుగోపాల్

2015లో ఈ-కామర్స్ జోరు

2015లో ఈ-కామర్స్ జోరు అంతా ఇంతా కాదు. 2015 సంవత్సరంలో  6 బిలియన్ డాలర్ల మార్కెట్‌కు చేరువైన ఇ-కామర్స్ 2016 సంవత్సరంలోనూ మరింత దూకుడును కొనసాగించనుందని అంచనా వేస్తున్నారు. పట్టణాల్లో ఆన్‌లైన్ మార్కెట్‌దే హవా, రిటైల్ మార్కెట్లలోనూ చిన్నగా పాగా వేస్తోంది. ఆన్‌లైన్ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేపడుతూ కొత్త టెక్నిక్‌లను అందిపుచ్చుకుంటున్నాయి. ఫ్లాష్ సేల్స్‌ను ప్రారంభించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వినియోగదారులను అనుకూలంగా ఆన్‌లైన్ మార్కెట్ రూపు సంతరించుకుంటుండగా, ఇంటర్నెట్ సర్ఫింగ్ రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశంలో ఆన్ షాపింగ్, సేల్స్ ట్రెండ్ ఊపందుకోవడం వల్ల ఇంటర్నెట్ వినియోగదారులు కూడా పెరుగుతున్నారు. కస్టమర్లు  కొనుగోలు చేసే వస్తువుల గురించి ఆన్‌లైన్‌లోనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కస్టమర్లలో పరిశీలనా శక్తి పెరగడానికి కూడా ఈ-కామర్స్ కంపెనీలు దోహదం చేస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి, వాణిజ్య వ్యూహాల్లో భాగంగా ఉద్దీపన విధానాలతో వివరాలు ఇవ్వడం వల్ల బిజినెస్ మోడల్‌పై ప్రభావం చూపుతోందని ఆర్ట్ అండ్ డెకర్స్.కామ్ వ్యవస్థాపకుడు దివ్యన్ గుప్తా అన్నారు. 2015 సంవత్సరంలో ఆన్‌లైన్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, వచ్చే సంవత్సరాల్లోనూ మరింత అభివృద్ధి చెందగలదన్నారు.