Home వరంగల్ నరక ప్రయాణం

నరక ప్రయాణం

To develop Warangal City as Smart City

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయటానికి చివరి అంకం చేరుకుంటున్న క్రమంలో నగరంలోని పలు ప్రాంతాలలోని రోడ్లు నరకం చూపిస్తున్నాయి. చినుకు జల్లుతో ప్రమాదకరంగా మారుతున్నాయి. పోచమ్మమైదాన్ నుంచి దేశాయిపేట వరకు మరీ ప్రమాదకరంగా రోడ్లు మారడంతో స్థానికులు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని జ్యోతిబసు కాలనీలో నడవటం కూడా కష్టతరంగా మారింది. ఇక పలు కాలనీలలో చినుకుపడితే చిత్తడే అవుతోంది. ముఖ్యంగా పోచమ్మమైదాన్ నుంచి దేశాయిపేట రోడ్లు దుర్భరంగా మారటానికి అనేక రాజకీయ కారణాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని రోడ్డు నలుగురు కార్పొరేటర్ల పరిధిలోకి రావడంతో అభివృద్ధి నలుగురిలో నలుగుతూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందనే ఆరోపణలున్నాయి. అనేక సందర్భాలలో రాజకీ య నాయకులు, అధికారులు సందర్శించడం తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపకపోవడం గమనార్హం.

దసరా బతుకమ్మ, వినాయక చవితి లాంటి సందర్భాలలో మరమత్తులు చేయడంతోనే చేతులు దులుపుకుంటున్నారని తద్వారా రోడ్డు నరకయాతనంగా మారుతుందనే స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 80 ఫీట్ల రోడ్డు నుంచి లక్ష్మిటౌన్‌షిప్ వరకు సుమారు రూ.4 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ నలుగురు కార్పొరేటర్ల పరిధిలో ఉన్నందున టెండర్లు వేసేందుకు, ఫైనల్ చేసేందుకు అనేక చిక్కులు ముందుకు వస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఈ రహదారిలో విద్యాసంస్థలు ఉంగటం గమనార్హం. దీంతో ఆటో ప్రయాణాలు గానీ, పాఠశాలలకు విద్యార్థులను చేరవేసే బస్సుల రాకపోకలు కష్టసాధ్యంగా మారుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇక వరంగల్, హన్బకొండకు నిత్యం వచ్చివేళ్లే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటం సర్వసాధరణంగా మారింది. అసలు రోడ్డు అద్వానంగా ఉందిరా దేవుడా అంటే ఇది సరిపోదన్నట్టుగా లారీలు బైపాస్ కావడం మరో కారణంగా మారుతోంది. ఇదే దారిలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు లారీలు వేళ్లడంతో పాటు ఇసుక లారీలు సైతం ఇదే దారిని ఆశ్రయించడం కూడా రోడ్డు దుస్థితి మరింత అద్వానంగా మారుతోంది. అయితే వీటన్నింటికీ బైపాస్ రోడ్డుగా ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు. రెండు రోజుల కింద మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా పరిశీలించిన విషయం విధితమే. దీంతో ప్రజలకు ఆశలు చిగురించాయి. ఏదైమైనప్పటికీ పోచమ్మమైదాన్ రోడ్డుతో పాటు నగరంలోని దుర్భర స్థితిలో ఉన్న రోడ్లన్నింటికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు.