Home కలం బలసాహితీ శిఖరం పెండెం

బలసాహితీ శిఖరం పెండెం

 To make today's child a better Indian prosperity

తెలుగు సాహిత్యంలో బాలసాహిత్యానిది విశిష్టస్థానం నేటి బాలల్ని భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగిన మహత్తరశక్తి బాలసాహిత్యానికుంది. అంతటి ప్రాధాన్యత గలిగిన బాలసాహిత్యంలో గత రెండున్నర దశాబ్దాలుగా కృషి చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రత్యేక గుర్తింపు పొందారు, పెండెం జగదీశ్వర్. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం గర్వించదగిన బాలసాహితీవేత్తల్లో ఒకరైన జగదీశ్వర్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందినవారు.
1976 జూన్ 28న రామన్నపేట మండంలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో జన్మించిన జగదీశ్వర్ వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులు రామన్నపేటలో స్థిరనివాసులుగా ఉన్నప్పు డే కథలు రాసి పత్రికలకు పంపించడం ప్రారంభించారు. కానీ ఏ ఒక్క కథ అచ్చు కాలేదు. గోడకు కొట్టిన బంతిలాగా వెనక్కి తిరిగొచ్చేవి. అయినా నిరుత్సాహ పడకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించేవారు. అలా ఆరేళ్ళ సుధీర్ఘ ప్రయత్నాల తరువాత 1994లో విద్యార్ధి చెకుముకి బాలల సైన్స్ మాసపత్రికలో భాస్వరలీలలు కథతో తొలిసారిగా పాఠకలోకానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. తెలుగులో వెలువడు తున్న వివిధ బాలల పత్రికలన్నింటిలో ఇప్పటివరకు సుమారు 200కు పైగా కథలు రాశారు.
జగదీశ్వర్ రచించిన కథలతో ఆనందవృక్షం, పసిడి మొగ్గలు, ఉపాయం, బాలల కథలు, తాను తీసిన గోతిలో, గజ్జెల దయ్యం, చిన్ని కోరిక, మాయా ఉంగరం, మాతో పెట్టుకోకు, మరుగుజ్జు సాహసం, మాయాటోపి, అమ్మాయే చదివితే మొదలైన ఎన్నో పుస్తకాలు వెలువరించారు. ప్రముఖ ముద్రణా సంస్థలు జగదీశ్వర్ పుస్తకాలను ప్రచురించి పాఠకలోకానికి అందుబాటులో ఉంచాయి.
బాలసాహిత్యంలో జానపదకథలది ప్రత్యేకమైనస్థానం అటువంటి జానపద కథాసాహిత్యాన్ని గ్రంథస్తం చేసి జానపదకథాసాహిత్యాన్ని అంతరించిపోకుండా తన వంతు సాహిత్యం సేవ చేశారు. 1997వ సం॥ నుండి ఆ కథల సేకరణను చేపట్టి 130 కథలతో జానసద కథలు, ముగ్గురు అవివేకులు అనే పుస్తకాలు ప్రచురించారు.
అంతేగాక తెలంగాణవాసిగా తెలంగాణ మాండలిక పరిరక్షకుడిగా తెలంగాణ మాండలికంలో బాలసాహిత్యంలో లేని లోటును తీర్చాలనే ఉద్యేశంతో పాఠశాల విద్యార్థులు తరుచుగా చెప్పుకునే ఇరవై జానపద హాస్యకథలతో బడిపిలగాల్లకతలు (2015) అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇది తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలి బాలల కథాసంకలనంగా ప్రత్యేకతను సంతరించుకుంది. పిల్లలకు తెలంగాణ భాషా సంస్కృతుల సౌందర్యాన్ని పరిచయంచేసిన గొప్ప ప్రయత్నంగా ఈ పుస్తకం పలువురి ప్రశంసల అందుకుంది. సాహిత్యసేవలో మరో మైలురాయిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఉపాధి నిమిత్తం వలస వస్తున్న తెలుగువారిలో అత్యధికమంది తెలంగాణ ప్రాంతం వారే ఉంటుండటం వల్ల అక్కడి పిల్లలకు తెలంగాణ భాషా సంస్కృతులను ప్రతిబింబించే రచనలు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు జగదీశ్వర్ బడిపిలగాల్ల కతలు లోంచి “నా కోసం యెవలేడుస్తరు ?” అనే కథను “ఉల్లిలొల్లి” పేరుతో ఆరవతరగతి తెలుగుమీడియం ప్రథమ భాష తెలుగువాచకం బాలభారతిలోను వొంకాయంత వజ్రం అనే కథను ఇంగ్లీషు మీడియం ద్వితీయభాష తెలుగువాచకం సరళభారతిలో పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టింది. ఈ రెండు వాచకాలు 201617 విద్యా సంవత్సరం నుండి అమలులోకి వచ్చాయి.
రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని గోండి, కొలామి గిరిజన బాలల జానపద కథాసాహిత్యాన్ని సేకరించే కార్యక్రమంలో విషయనిపుణుడిగా వ్యవహరించారు. అంతేగాక ఆర్వీయం బాలసాహిత్య పుస్తకాల రూపకల్పనలో రాష్ట్రస్థాయి ఎడిటింగ్ టీం సభ్యునిగా కొనసాగి వందలాది పుస్తకాలకు తుదిమెరుగులు దిద్దారు. నల్లగొండ జిల్లా ఆర్వీయం బాలల మాసపత్రిక జాబిలికి సంపాదకవర్గ సభ్యునిగా కొనసాగారు.
పర్యావరణస్పృహను కలిగిస్తూ జగదీశ్వర్ రాసిన చెట్టుకోసం కథను మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఆరవతగరతి తెలుగు మీడియం తెలుగు వాచకం బాల భారతిలో 2007-2008 విద్యా సంవత్సరం నుండి 201516 విద్యా సంవత్సరం వరకు పాఠ్యాంశంగా కొనసాగించింది. తమకు చల్లని నీడనిచ్చే వేపచెట్టును నరికివేయకుండా కాపాడుకునేందుకు ఒక పాఠశాల పిల్లలు పడిన తాపత్రయాన్ని, చేసిన ప్రయత్నాన్ని జగదీశ్వర్ ఈ కథలో అద్భుతంగా చిత్రించారు. పలువరి మన్ననలు అందుకున్న ఈ కథ జగదీశ్వర్ కథల్లో మేలిమి ముత్యంలా నిలిచింది. సాహిత్య అకాడమి ప్రచురించనున్న కథాసంకలనంలో చోటు దక్కించుకుంది,
స్టేట్ రిసోర్స్‌సెంటర్ వయోజనులు, నూతన అక్షరా స్యుల కోసం జగదీశ్వర్ రాసిన విముక్తి, పాడి తగ్గింది, బొబ్బరాగం, మిక్సి రిపేరు., మొదలగు పుస్తకాలను ప్రచురించింది. వారు సాక్షర భారత్ చదువుకుందాం వాచకరచనలో పాల్గొన్నారు.
201213 విద్యా సంవత్సరం నుండి 201415 విద్యాసంవత్పరం వరకు మనరాష్ట్రంలో అమలులో ఉన్న 3వ తరగతి తెలుగు(ప్రథమభాష) 6,7 తరగతుల తెలుగు (ద్వితీయ భాష) వాచకాల రూపకర్తలలో జగదీశ్వర్ కూడా ఒకరు. బెంగళూరులోని దక్షిణ ప్రాంతీయ సాహిత్యఅకాడమి, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, మైసూరులోని భారతీయ భాషాసంస్థల బాలసాహిత్యం మీద నిర్వహించిన కార్యశాలలు, సదస్సులలో జగదీశ్వర్‌కు ప్రాతినిధ్యం కల్పించాయి. కార్టూన్లు గీయడంలో కూడా ప్రవేశమున్న జగదీశ్వర్ సామాజిక సమస్యల మీద సంధించిన నూటపదహారు కార్టూన్లతో 116 నవ్వులు అనే కార్టూన్ల సంకలనాన్ని ప్రచురించారు.
జగదీశ్వర్‌ను తరచుగా చాలామంది చాలాసార్లు అడిగే ప్రశ్నలు మీకు రచనా వ్యాపకం ఎలా వచ్చింది? మీరు ఎప్పటి నుంచి రచనలు చేస్తున్నారు? రచయితగా మీకు స్ఫూర్తి ఎవరు?… ఇలా సంధించే ప్రశ్నలకు సమాధానంగా వారు తెలిపిన విషయాలు ఆబాలగోపాలాన్ని అబ్బురపరుస్తాయి.
మీ అమ్మ గురించి, నాన్న గురించి ఒక్కో పేరా రాయండి అనే పని అప్పగించినపుడు తొమ్మిదోతరగతి చదివే సంకీర్తన సార్ మా నాన్న లేడు కదా నేను ఎవరి గురించి రాయాలి? అని అడిగినపుడు ద్రవించిన హృదయంలోంచి అనుబంధం అనే కథ ప్రవహించింది.
ఒక పిల్లల కార్యక్రమం కోసం సిరిసిల్లలోని రంగినేని ట్రస్టుకు వెళ్ళినపుడు దాని వ్యవస్థాపకుడు రంగినేని మోహన్‌రావు నిస్వార్ధంగా పిల్లలకు చేస్తున్న సేవను చూసి చలించిపోయినపుడు నల్లనిమనసు కథ రూపుదిద్దుకుంది.
ఒక మిత్రుడు భాగ్యనగరంలో కనిపించే బాలకార్మికుల గురించి ఆవేదనతో మాట్లాడుతుంటే పుట్టినరోజు బహుమతి కథ పుట్టుకొచ్చింది. అని వారిచ్చిన సమాధానాలతో కథలు ఉద్భవించేది ఊహాల్లోంచే కాదు, జీవితంలోంచి కూడా అని అవగతమవుతుంది.
కథాసామ్రాజ్యానికి రారాజుగా నిలిచి బాలల హృదయాలతో పాటు పాఠకజన హృదయాలను దోచుకున్న జగదీశ్వర్ నేడు అంతర్థానం కావడం శోచనీయం.
జగదీశ్వర్ కృషిని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కొణిజేటి రోశయ్య, రాజకీయ ప్రముఖులు సూదిని జైపాల్‌రెడ్డి, వి.హనుమంతరావు, సాహితీవేత్తలు డా॥సి.నారాయణరెడ్డి, రాళ్లబండి కవితా ప్రసాద్, కె.వి. రమణాచారి, అక్కిరాజు రమాపతిరావు, ఎన్.గోపినాథ్‌రెడ్డి, ఆచార్య కసిరెడ్డి, సుద్దాల అశోక్ తేజ, విద్యావేత్త చుక్కారామయ్య, తదితరులు ఘనంగా సత్కరించారు.
బాసాహిత్యానికే తన కలాన్ని అంకితం చేసిన జగదీశ్వర్ కృషికి గుర్తింపుగా హైదరాబాద్‌లోని బాలసాహిత్య పరిషత్, బాలసాహితీరత్న (2011) పురస్కారాన్ని అందజేసింది.
బాలసాహిత్యంద్వారా బాలల సంపూర్ణ మనోవికాసంతో పాటు మాతృభాషాభిరుచిని, నైతికవిలువల్ని పరివ్యాప్తం చేసిన పెండెం జగదీశ్వర్ చిరస్మరణీయులు. బాలసాహిత్యానికి జగదీశ్వర్ లేని లోటు తీరనిది.