Home జిల్లాలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలి

సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలి

cpiచేవెళ్ల :టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో ఘోరంగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్మాకుల జంగయ్య, ఎం. ప్రభులింగం, చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జి కె. రామస్వామి ఆరోపించారు. చేవెల్ల మండల పరిధిలోని ధర్మాసాగర్ గ్రామంలో ఆదివారం సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రంలో భాజపా, తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న నేటికి ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంలో ఆమడదూరంలో నిలిచాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనం వెలికి తీయించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు, పప్పుధాన్యాల ధరలు పెంచి సామాన్య ప్రజలకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణగా మారుస్తానని ప్రగల్బాలు పలికిన సీఎం కేసిఆర్ నిత్యం తన మాటల గారడితో ప్రజలకు మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. రైతుల రుణమాఫి, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేకుండా రూ.10లక్షలు రుణాలు, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు లాంటి వాగ్ధానాలు మరిచిపోయి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపిలను పార్టీలోకి చేర్చుకునే పనిలో ఉన్నారే తప్పా… ఇచ్చిన హామిలను పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. మండల పరిధిలోని ధర్మాసాగర్ గ్రామంలోని సర్వేనంబర్ 124లో ఉన్న 7 ఎకరాల భూమిలో పేద వారికి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వమే డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్మాసాగర్ గ్రామకమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుధాకర్‌గౌడ్, సిపిఐ పార్టీ కార్యకర్తలు మంజుల, బ్రహ్మచారి, శంకర్‌గౌడ్, చంద్రకళ, సావిత్రి, సత్యయ్య తదితరులు పాల్గొన్నారు.