Home తాజా వార్తలు టీమిండియాకు సవాల్

టీమిండియాకు సవాల్

Today 2nd test match India vs Nz

ఆత్మవిశ్వాసంతో కివీస్, నేటి నుంచి రెండో టెస్టు

ముంబై: తొలి మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకు వచ్చి చివరికీ డ్రాతో సరిపెట్టుకున్న ఆతిథ్య టీమిండియా శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే రెండో టెస్టులో విజయమే లక్షంగా పెట్టుకుంది. ఇక మొదటి టెస్టులో అనూహ్యంగా ఓటమిని తప్పించుకున్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇరు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో రెండో టెస్టు మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.

ఓపెనర్లపై సస్పెన్స్..

ఇక ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఓపెనర్లుగా ఎవరూ బరిలోకి దిగుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తొలి టెస్టులో విఫలమైన మయాంక్ అగర్వాల్ స్థానంలో ఈసారి సూర్యకుమార్‌కు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే కెప్టెన్ కోహ్లితో పాటు కోచ్ ద్రవిడ్ యువ ఓపెనర్ మయాంక్‌కు మరో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక రెండో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌కు చోటు ఖాయంగా కనిపిస్తోంది. కాన్పూర్ టెస్టులో గిల్ బాగానే ఆడాడు. దీంతో అతనికి మరో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

రహానె x శ్రేయస్

మరోవైపు తుది జట్టులో స్థానం కోసం రహానె, శ్రేయస్ అయ్యర్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తొలి మ్యాచ్‌లో రహానె రెండు ఇన్నింగ్స్‌లలో కూడా విఫలమయ్యాడు. బ్యాటర్‌గా విఫలమైనా కెప్టెన్‌గా మాత్రం రహానె మెరుగైన ప్రదర్శనే చేశాడు. ఇక శ్రేయస్ అయ్యర్ అరంగేట్రం మ్యాచ్‌లోనే చెలరేగి పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం సాధించాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. అంతేగాక రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో రెండో టెస్టులో అతన్ని పక్కనబెట్టే సాహసం టీమ్ మేనేజ్‌మెంట్ చేస్తుందా అనేది సందేహమే. ఒకవేళ అయ్యర్‌ను ఆడించాలని భావిస్తే మాత్రం రహానెను ఉద్వాసన ఖాయం. కానీ అపార అనుభవజుడైన రహానెను తప్పించే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. దీంతో శ్రేయస్ రెండో మ్యాచ్‌కు దూరమైనా ఆశ్చర్యం లేదు. ఒకవేళ వృద్ధిమాన్ సాహా పూర్తి ఫిట్‌నెస్‌ను సాధిస్తే అతన్ని ఓపెనర్‌గా దించి అయ్యర్, రహానెలను ఆడించే అవకాశాలను కొట్టి పారేయలేం. అదే జరిగితే మయాంక్ అగర్వాల్‌పై వేటు తప్పదు.

అందరి కళ్లు కోహ్లిపైనే..

ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు కెప్టెన్ విరాట్ కోహ్లిపైనే నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న కోహ్లి ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఆటకు శ్రీకారం చుట్టనున్నాడు. ఇప్పటికే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి టెస్టులపై పూర్తి ఏకాగ్రత పెట్టాలని భావిస్తున్నాడు. రానున్న రోజుల్లో పలు కీలక టెస్టు సిరీస్‌లు ఉండడంతో కోహ్లికి కివీస్‌తో పోరు సవాల్‌గా మారింది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్‌గా కూడా తన పాత్రను సమర్థంగా పోషించక తప్పదు. ఏమాత్రం విఫలమైనా టెస్టు కెప్టెన్సీ కూడా వదులుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

సిరాజ్‌కు చోటు!

తొలి టెస్టులో విఫలమైన సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ స్థానంలో యువ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు కల్పించే అవకాశాలున్నాయి. విశ్లేషకులు సయితం సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఐపిఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన సిరాజ్‌ను ఆడించడమే మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ కోహ్లి కూడా అతనివైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే ఇషాంత్‌కు చోటు కష్టమే. మరోవైపు స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్, జడేజాలు ఈసారి కూడా బరిలోకి దిగడం ఖాయం. ఉమేశ్ యాదవ్ కూడా తుది జట్టులో ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

రెట్టించిన ఉత్సాహంతో..

కాగా, తొలి టెస్టులో అసాధారణ పోరాట పటిమతో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్‌లు తొలి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వీరు రాణిస్తే కివీస్‌కు ఎదురే ఉండదు. అయితే కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేలవమైన ఫామ్‌తో సతమతమవుతుండడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈసారైనా అతను రాణించాల్సిన అవసరం జట్టుకు ఎంతైనా ఉంది. రాస్ టెలర్, రచిన్ రవీంద్ర, హెన్రీ నికోల్స్, టామ్ బ్లుండెల్, జేమిసన్ తదితరులతో కివీస్ బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. ఇక ఎజాజ్ పటేల్, సోమర్‌విలే, సౌథి తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇలాంటి స్థితిలో కివీస్ గెలుపు అవకాశాలను కొట్టి పారేయలేం. ఇటు భారత్, అటు న్యూజిలాండ్ కూడా పటిష్టంగానే ఉండడంతో టెస్టు పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.