Home ఖమ్మం ప్రజా ఉద్యమాల సారధి సిపిఐ

ప్రజా ఉద్యమాల సారధి సిపిఐ

నాటి నుంచి నేటి వరకు అలుపెరుగని పోరాటాలు
నేడు సిపిఐ 90వ వార్షికోత్సవం

CPIమన తెలంగాణ/ ఖమ్మ: స్వాతంత్య్రోద్యమం, స్వాతంత్య్రం అనంతరం తెలంగాణ సాయుధ పోరాటం మొదలు నిన్నటి, మొన్నటి ప్రజా ఉద్యమాల వరకు అనేక చారిత్రాత్మక ఘట్టాలకు నేతృత్వం వహించింది భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రజా ఉద్యమాలకు సారధిగా నిలిచింది. 90 వసంతాల సుదీర్ఘ ప్రస్థానంలో అనేక పోరాట విజయాలను చవి చూసింది. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ ఖమ్మం జిల్లా చరిత్రలో ఏ పార్టీ సాధించలేని ఉద్యమ విజయాలను, రాజకీయ విజయాలను సాధించింది.  కమ్యూనిస్టు పార్టీ పోరాటాలతోనే జిల్లాకు “ఖమ్మం విప్లవోద్యమాల గుమ్మం” అన్న పేరు వచ్చింది. అడవి తల్లి సహా చెట్టు, పుట్ట ప్రజా ఉద్యమానికి సహకరించినవే. అందుకే విప్లవ కవులు ఖమ్మం ప్రకృతిని, ప్రజా ఉద్యమాన్ని కలగలిపి కవితలు, పాటలు రాశారు. సిపిఐ ఆధ్వర్యంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో అశువులు బాసి సువర్ణ అక్షర లిఖిత చరిత్రకు కారకులయ్యారు. దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, పుల్లరి వ్యతిరేక పోరాటం, 2-ఎ భూముల పట్టాల కోసం జరిగిన పోరాటం, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు సిపిఐ నేతృత్వం వహించింది. వేలాది ఎకరాల బంజర, అటవీ భూములను పేదలకు పంచిన చరిత్ర సిపిఐది. చింతగుర్తి, మల్లెలమడుగు, వినోభా నగర్, తోటపల్లి భూ పోరాటాలు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతాయి. సింగరేణి కార్మికుల హక్కుల కోసం, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరా టాలు నిర్వహించింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఇటీవల కాలంలో అనేక పేరెన్నికగన్న ప్రజా ఉద్యమాలను నిర్వహిం చింది. గోదావరి జలాల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి, జిల్లా దిగ్బం ధనం లాంటి ఆందోళనతో  ప్రజా ఉద్యమాలకు కొత్త ఊపును, రూపును ఇచ్చింది. లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద అన్యాక్రాంతమై  చివరకు దోపిడీదార్ల కంటపడి విదేశాలకు తరలుతుంటే అడ్డుకుని ప్రజా సంపదను కాపాడడం ద్వారా అఖండ విజయాన్ని సాధించింది. మణుగూరులో ధర్మల్ విద్యుత్ కేంద్రం సహా అనేక పరిశ్రమల సాధనకు ఉద్యమించిన ఘనత సిపిఐకే దక్కుతుంది. 2008కి ముందే రైతు రుణాలను రద్దు చేయాలని 48 గంటల పాటు బ్యాంకులను దిగ్బందించి ప్రభుత్వ కళ్లు తెరిపించింది. గిరిజనులకు నష్టం జరగకుండా 1/70 చట్టాన్ని సవరించాలని పోరాటం చేసింది కమ్యూనిస్టు పార్టీ. అనేక ప్రజా ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. పోడుభూముల పోరాటంలో లాఠీలు ఝుళిపించినా, జైళ్లకు పంపినా వెనుతిరగక భూమి కోసం పోరాటాలు సాగించి సుదీర్ఘ ప్రజా ఉద్యమాలను సిపిఐ మాత్రమే చేయగలిగిందని నిరూపించింది. జాతీయ సమితి నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించింది.  ధర్నాలు, బంద్‌లు, ఆమరణ దీక్షలతో ప్రజలను కారన్మోఖులను చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం టిఆర్‌ఎస్ ఏకపక్ష నిర్ణ యాలు, సంక్షేమ పథకాల అమల్లో జరుగుతున్న పొరపాట్లను  ఎత్తిచూపడం ద్వారా తనది ఎప్పుడు ప్రజాపక్షమేనని చాటింది. శాసన మండలి ఎన్నికల్లో తమకు ఎదురు లేదని విర్రవీగుతున్న టిఆర్‌ఎస్‌కు విపక్షాలను కలుపుకుని మండలి బరిలో దిగి అధికార గాలికి జిల్లాను ఎదురు నిలిపింది. నిన్న, నేడు, రేపు ఎప్పుడూ ప్రజా పక్షమే అంటూ 90వ వార్షికోత్సవాలకు సిద్ధం అయింది. 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో అశువులు బాసిన అమరులకు జోహార్లు అర్పిస్తూ ప్రజా ఉద్యమ నేతలకు సెల్యూట్ చేస్తూ సిపిఐ పతాకం రేపటి ఉద్యమానికి నేతృత్వం వహించేందుకు సిద్ధం అయింది.