Thursday, April 25, 2024

ఫుల్ జోష్‌లో భారత్

- Advertisement -
- Advertisement -

 India vs New Zealand 2nd T20

 

కివీస్‌కు పరీక్ష, నేడు రెండో టి20

ఆక్లాండ్: తొలి టి20లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే రెండో మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో మరింత పట్టు సాధించాలనే లక్షంతో కోహ్లి సేన ఉంది. ఇక, ఆతిథ్య న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ సవాలుగా తయారైంది. తొలి మ్యాచ్‌లో ఓటమి నేపథ్యంలో కివీస్‌పై ఒత్తిడి నెలకొది. మొదటి టి20లో 203 పరుగుల భారీ స్కోరును సాధించినా ఓటమి తప్పలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ను ఎలా కట్టడి చేయాలో కివీస్‌కు అంతు బట్టకుండా పోతోంది. ఈసారి మరింత మెరుగైన ఆటను కనబరచాలనే పట్టుదలతో ఆతిథ్య జట్టు ఉంది. భారత్ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోరుకు సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి ప్రత్యర్థి జట్టును ఆత్మరక్షణలో పడేయాలని భావిస్తోంది. కిందటి మ్యాచ్‌లో ఓపెనర్ లోకేశ్ రాహుల్, యువ సంచలనం శ్రేయస్ అయ్యర్ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

జోరు సాగాలి
కిందటి మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగిన ఓపెనర్ రాహుల్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాల్సి ఉంది. అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్ విజృంభిస్తే భారత్ బ్యాటింగ్ కష్టాలు తీరి పోతాయి. తొలి టి20లో తక్కువ స్కోరుకే పెవిలియన్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఈసారి భారీ స్కోరుపై దృష్టి పెట్టాడు. ఎంతటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా రోహిత్‌కు ఉంది. కొంతకాలంగా ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోరు సాధించి జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో రోహిత్ ఉన్నాడు.

ఇటీవల కాలంలో రాహుల్, రోహిత్‌లు ఓపెనర్లుగా అద్భుతంగా రాణిస్తున్నారు. పలు మ్యాచుల్లో భారత్‌కు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టారు. ఈ మ్యాచ్‌లో కూడా ఓపెనర్లు శుభారంభం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా కివీస్ బౌలర్లకు కష్టాలు ఖాయమనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్, రాహుల్‌లపై జట్టు భారీ అంచనాలతో ఉంది. వీరూ కూడా తమ పాత్రకు న్యాయం చేయాలనే పట్టుదలతో మ్యాచ్‌కు సిద్ధమయ్యారు.

కోహ్లినే కీలకం
మరోవైపు ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా జట్టుకు చాలా కీలకమని చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో రాహుల్‌తో కలిసి విరాట్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగడంలో కోహ్లికి ఎవరూ సాటిరారు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వర్షం కురిపించడం కోహ్లికి పరిపాటిగా మారింది. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ సిరీస్‌లో కూడా జట్టు కోహ్లిపై భారీ ఆశలే పెట్టుకుంది. దానికి తగినట్టుగానే మొదటి మ్యాచ్‌లో కోహ్లి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో కోహ్లి ఉన్నాడు.

దూకుడు మీదున్న అయ్యర్
యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తొలి టి20లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో మళ్లీ ఫామ్‌ను అందుకున్నాడు. కీలక సమయంలో చిరస్మరణీయ బ్యాటింగ్‌తో అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ అయ్యర్ సాగించిన పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఈసారి కూడా జట్టుకు చాలా కీలకంగా తయారయ్యాడు. రానున్న సిరీస్‌లలో జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలంటే మిగిలిన మ్యాచుల్లో అయ్యర్ మెరుగ్గా రాణించక తప్పదు. నాలుగో నంబర్‌లో అతను అద్భుతంగా రాణిస్తున్నాడు.

ఇది టీమిండియాకు శుభసూచకంగా చెప్పాలి. మనీష్ పాండేకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో పాండే తరచూ విఫలమవుతున్నాడు. కిందటి మ్యాచ్‌లో మాత్రం చివరి వరకు క్రీజులో ఉంటూ జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. యువ ఆటగాడు శివమ్ దూబే కూడా మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొలి టి20లో సత్తా చాటే అవకాశం లభించినా దాన్ని అనుకూలంగా మార్చుకోలేక పోయాడు. ఈసారైనా మెరుగైన ఆటను కనబరచాలి.

మెరుగు పడాలి
ఈ మ్యాచ్‌లో బౌలర్లు మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. తొలి మ్యాచ్‌లో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పిచ్ కూడా బౌలర్లకు సహకరించడం లేదు. తొలి మ్యాచ్‌కు వేదికగా నిలిచిన గ్రౌండ్‌లోనే రెండో టి20 జరుగనుంది. దీంతో బౌలర్లు ఈసారి మరింత కుదురుగా బౌలింగ్ చేయక తప్పదు. కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయాల్సిన బాధ్యత బౌలర్లపై నెలకొంది. సీనియర్లు బుమ్రా, షమి, జడేజాలు మరింత మెరుగైన బౌలింగ్‌ను కనబరచాలి. అప్పుడే కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. లేకుండా మరోసారి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించడం ఖాయం.

గెలుపే లక్ష్యంగా
ఇదిలావుండగా తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఈ పోటీలో గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జయభేరి మోగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగానే ఉన్నా తొలి మ్యాచ్‌లో కివీస్‌కు ఓటమి తప్పలేదు. సీనియర్లు మార్టిన్ గుప్టిల్, కొలిన్ మన్రో, రాస్ టైలర్, కెప్టెన్ విలియమ్సన్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. దీంతో న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచడంలో సఫలమైంది. కానీ, బౌలర్ల వైఫల్యంతో ఓటమి తప్పలేదు.

ఈ మ్యాచ్‌లో మాత్రం బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్షంతో కనిపిస్తున్నారు. సౌథి, సాంట్నర్, సోధి, టిక్నర్ తదితరులతో బౌలింగ్ బలంగానే ఉంది. కానీ, తొలి మ్యాచ్‌లో వీరంత విఫలమయ్యారు. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలనే పట్టుదలతో ఉన్నారు. టాప్ ఆర్డర్ ఫామ్‌లో ఉండడంతో బ్యాటింగ్ కూడా బలంగా తయారైంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు మరోసారి గట్టి పోటీ తప్పక పోవచ్చు.

జట్ల వివరాలు

భారత్ (అంచనా): విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, శార్ధూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, బుమ్రా, మహ్మద్ షమి.

న్యూజిలాండ్ (అంచనా): కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గుప్టిల్, కొలిన్ మన్రో, గ్రాండోమ్, రాస్ టైలర్, సెఫర్ట్, మిఛెల్ సాంట్నర్, టిక్నర్, టిమ్ సౌథి, ఐష్ సోధి, హామిష్ బెన్నెట్.

మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

Today India vs New Zealand 2nd T20
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News