Home తాజా వార్తలు వీరుడా… వందనాలు

వీరుడా… వందనాలు

Komuram Bhim

 

నేడు కొమురంభీం 79వ వర్థంతి
భీం స్ఫూర్తితోనే రజాకార్లతో పోరాడిన యువకులు
జల్..జంగల్..జమీన్ హక్కులపై రాజీలేని పోరాటం
గిరిజనుల ఆరాధ్యదైవం కొమురంభీం
వర్థంతి సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

మంచిర్యాల : జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో నిజాం సర్కార్‌పై జంగు సైరన్ మో గించిన కొమురంభీం గిరిజనుల ఆరాద్యదైవం అయ్యారు. 1940 కంటే ముందే తుపాకీ పట్టిన వీరుడు కొమురంభీం. భీం స్ఫూర్తితో రజాకర్లతో పోరాడిన యువకులు ఇప్పటికీ భీం స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నారు. ఆశ్వయుజ పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం ఆయన వర్థంతిని నిర్వహిస్తారు. ఆయన మరణించి 79 వసంతాలు పూర్తయినప్పటికీ ఆయన స్పూర్తిని ధైర్యాన్ని అడవి బిడ్డలు ఇప్పటికీ తలుచుకుంటారు. ఆదివారం కొమురంభీం వర్థంతి సభను అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతోపాటు ఇతర శాఖల అధికారులు జోడేఘాట్ గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఆదివాసీ బిడ్డలపై నిర్బంధానికి వ్యతిరేకంగా నిజాం సర్కార్‌పై జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో రాజీలేని పోరాటాలు చేశారు. నిజాం అనుచరులు చేస్తున్న ఆ గడాలను సహించలేక సాయుధ పోరే సమస్యకు పరిష్కారమని నమ్మి 1940 కంటే ముందే జోడేఘాట్ పోరాట గడ్డపై తుపాకీ ఎక్కుపెట్టాడు. తనదైన గెరిళ్లా వ్యూహాలతో నిజాం సైన్యాన్ని ముక్కుతిప్పలు పెట్టి నిజాం గుండెల్లో నిద్రపోయాడు. నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేయకముందే జిల్లాలో కొమురంభీం తుపాకీ పట్టి ఉద్యమానికి సిద్దమయ్యారు.

భీం పోరాట స్పూర్తితోనే1948లో నిజాం ప్రభువుపై ప్రభుత్వంపై జరిపిన సైనిక చర్యకు మద్దతుగా రజాకార్లతో ఎంతో మంది యువకులు సాయుధ పోరాటాలకు దిగారు. జాగిర్ధారుల అణచివేత, అత్యాచారాలు, ఆగడాలను తట్టుకోలేక తనతో కలసి పెరిగిన అడవి బిడ్డలనే అణుచరులుగా మార్చుకొని వారికి సాయుధ శిక్షణ ఇవ్వడం ద్వారా నిజాం సైనికులను ఓడించినంత పని చేశారు. కొమురంభీం స్వగ్రామం ఆసిఫాబాద్ మండలం సంకెపల్లి గ్రామం కాగా భీం తండ్రి తన బాల్యంలోనే మరణించడంతో 15వ యేట గ్రామపెద్దగా బాధ్యతలు చేపట్టారు.

నిజాం పోలీసుల, అటవీ అధికారుల ఆగడాలను సహించలేకపోయాడు. ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోరాడేందుకు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో గిరిజన యువకున్ని చేరదీసి సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరుపున పట్వారీలు, చౌకి దారులు పన్నులు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారిపై దాడులు చేశారు. నిజాం కాలంలో పట్టే దారులు గిరిజన మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడగా వారిని సైతం ఎదిరించి దా డులు చేశారు. నిజాం పోలీసులను అటవీ అధికారులను దోపిడి దారులను ఎదుర్కొనేందుకు కొమురంభీం సా యుధ దళాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి నిజాం గుండెల్లో నిద్రపోయారు.

గిరిజనులందరు ఏకమై కెరమెరి మండలంలోని జోడేఘాట్ కేంద్రంగా ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఆప్రాంతానికి వచ్చే పోలీసులను సైతం భయబ్రాంతులకు గురి చేస్తూ ప్రతిఘటించే వారు . కాగా కొమురంభీంను హతమార్చేందుకు నిజాం ప్రభుత్వం ఎన్నో కుట్రలను పన్నగా ఏవిధంగానైనా అడ్డు తొలగించుకోవాలని కొమురంభీం అనుచరుడైన మడావి కొద్దు అనే వ్యక్తి 1940 అక్టోబర్ 6న ఇచ్చిన సమాచారంమేరకు నిజాం ప్రభుత్వం అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరింపజేసి, గాలింపు చేపట్టింది. అర్థరాత్రి కొమురంభీంపై నిజాం పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి తుపాకీ గుండ్ల వర్షం కురిపించారు. నిజాం పోలీసులను వీరోచితంగా ఎదుర్కొని చివరికి కన్నుమూశారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా దర్బార్…. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా 2014 సంవత్సరంలో కొమురంభీం 74వ వర్థంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా చేపట్టగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జోడేఘాట్‌ను సందర్శించిన వారిలో కేసిఆర్‌కే ఘనత దక్కింది. జోడేఘాట్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని దర్బార్‌లో సిఎం కేసిఆర్ ప్రకటించారు. దీంతో రూ.25 కోట్లను మంజూరు చేయగా జోడేఘాట్ పర్యాట కేంద్రంగా రూపుదిద్దుకుంది. కాగాఆదివారం జోడేఘాట్‌లో అధికారంగా నిర్వహించే ధర్బార్‌కు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ దర్బార్‌కు జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వేలాది సంఖ్యలో గిరిజనులు హాజరై భీంకు నివాళులు అర్పిస్తారు.

Today is 79th Death Anniversary of Komuram Bhim