Friday, March 29, 2024

నేడు అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Meditation Center

 

ప్రారంభించనున్న యోగా గురు బాబా రాందేవ్
30 ఎకరాల విస్తీర్ణంలో తాబేలు ఆకారంలో ధ్యాన కేంద్రం నిర్మాణం
ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రాక

హైదరాబాద్ : ప్రపంచంలో అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ రాష్ట్రంలోని నందిగామ మండలం కన్హ గ్రామంలోని శాంతివనంలో నేడు (మంగళవారం) ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రంగా గ్రేటర్ శివారులోని నందిగామలో హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో కన్హాశాంతివనం ప్రారంభానికి సిద్ధమయ్యింది. నేడు (జనవరి 28వ తేదీన) ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్, హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ గైడ్ దాజీలు ఈ శాంతివనాన్ని ప్రారంభించనున్నారు. ఒకే సారి లక్ష మంది ఉమ్మడిగా ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఈ మెడిటేషన్ సెంటర్‌ను నిర్మించారు. తాబేలు ఆకారంలో నిర్మించిన ఈ ధ్యానకేంద్రాన్ని హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ 75వ వార్షికోత్సవంలో భాగంగా నిర్మించింది. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ గ్లోబల్‌హెడ్ క్వార్టర్స్‌గా భావిస్తున్న ఈ శాంతివనం ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి 40వేల మంది ధ్యానం చేయనున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ మొదటి గైడ్ లాల్జీకి ఈ ధ్యానకేంద్రాన్ని అంకితమివ్వనున్నారు.

ప్రసంగించనున్న రాష్ట్రపతి..
కన్హా శాంతివనం ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రోజుల చొప్పున మూడు విడతల్లో పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. జనవరి 28వ తేదీ నుంచి -30 వరకు, ఫిబ్రవరి 7 నుంచి -9వ తేదీ వరకు మూడు రోజులపాటు, ఫిబ్రవరి 2-4న నిర్వహించే కార్యక్రమాల్లో సుమారుగా 1.2 లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. జనవరి 28వ తేదీన ధ్యానకేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత, 29న బాబా రాందేవ్ ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల గవర్నర్లు సైతం పాల్గొంటారని వారు వెల్లడించారు. ఫిబ్రవరి 2వ తేదీన రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్, ఫిబ్రవరి 7వ తేదీన సామాజిక కార్యకర్త అన్నాహజారే పాల్గొని 75వ వార్షికోత్సవంలో ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 1,400 ఎకరాల్లో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఏర్పాటుకాగా, 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ఒక సెంట్రల్‌హాల్, 8 సెకండరీ హాల్స్ చొప్పున మొత్తం 9 హాల్స్‌ను ఇక్కడ నిర్మించారు.

6 లక్షల మొక్కలతో నర్సరీలు..
ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే ముంబైలో 2వేల మందికి సరిపోయే ధ్యానకేంద్రముండగా, హైదరాబాద్‌లో నిర్మితమైన ధ్యానకేంద్రంలో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యానకేంద్రం రాత్రిపూట కాంతుల్లో సిడ్నీహార్బర్‌లా కనిపిస్తుంది. 40 వేల మందికి అతిథ్యమిచ్చే క్యాంపస్‌లో, రోజుకు లక్ష మందికి భోజనాలు పెట్టే వంటగదులు, 350 పడకల సామర్థ్యం గల ఆయుష్ దవాఖాన, 6 లక్షల మొక్కలతో ఏర్పాటు చేసిన నర్సరీలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. నాలుగేళ్లలో సుమారుగా లక్ష మొక్కలు నాటగా, మలిదశ జీవితాన్ని ప్రశాంతంగా గడిపే వారికి ఈ ధ్యానకేంద్రం మంచి అవకాశంగా నిలుస్తుందని నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Today is start of largest Meditation Center
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News