Tuesday, April 23, 2024

సిరీస్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: సాగర తీర నగరం విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగే రెండో వన్డేకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ముంబైలో జరిగిన తొలి వన్డేలో జయకేతనం ఎగురవేసిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక మొదటి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. విశాఖలోని డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోకి చేరడంతో భారత్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా తహతహలాడుతోంది.

బ్యాటింగే సమస్య..

తొలి వన్డేలో టాపార్డర్ విఫలం కావడంతో సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా కీలక బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తారా లేదా అనేది సందేహంగా మారింది. కెప్టెన్ రోహిత్ చేరికతో బ్యాటింగ్ బలంగా మారింది. శుభ్‌మన్ గిల్‌తో కలిసి అతను మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్, గిల్‌లు సెంచరీలతో అలరించారు. దీంతో ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు తొలి వన్డేలో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయిన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈసారి బ్యాట్‌ను ఝులిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే భారత బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి.

అందరి కళ్లు రాహుల్‌పైనే

కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న కెఎల్ రాహుల్ తొలి వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. చిరస్మరణీయ బ్యాటింగ్‌తో భారత్‌కు అద్భుత విజయాన్ని సాధించి పెట్టాడు. ఈ మ్యాచ్‌లోనూ రాణించి విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాలని భావిస్తున్నాడు. రాహుల్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు శుభసూచకంగా చెప్పాలి. ఈసారి కూడా జట్టు రాహుల్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. కాగా, కిందటి మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన సూర్యకుమార్ యాదవ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది.

టి20లలో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయే సూర్య వన్డేలకు వచ్చేసరికి పేలవమైన ప్రదర్శనతో తేలిపోతున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను మెరుగ్గా బ్యాటింగ్ చేయకతప్పదు. తొలి వన్డేలో రాణించిన హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలు ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారారు. ఇదిలావుంటే బౌలింగ్‌లో భారత్ చాలా పటిష్టంగా ఉంది. షమి, సిరాజ్, జడేజా, కుల్దీప్, హార్దిక్, శాకూర్‌లతో బౌలింగ్ చాలా బలంగా ఉన్న విషయం తెలిసిందే. మొదటి వన్డేలో షమి, సిరాజ్‌లు మెరుగ్గా బౌలింగ్ చేశారు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా తయారయ్యారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

గెలిచి తీరాల్సిందే..

ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మ్యాచ్‌లో గెలుపు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అయితే బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కిందటి మ్యాచ్‌లో మిఛెల్ మార్ష్ ఒక్కడే రాణించాడు. మార్ష్ మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. స్మిత్, హెడ్, లబుషేన్, ఇంగ్లిస్, మాక్స్‌వెల్, గ్రీన్ తదితరులు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచారు. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆస్ట్రేలియాకే గెలుపు అవకాశాలు ఉంటాయి.

పొంచి ఉన్న వర్షం ముప్పు..

కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో విశాఖపట్నంలో జరిగే వన్డే మ్యాచ్ సాఫీగా సాగుతుందా లేదా అనేది ఆందోళన కలిగిస్తోంది. భారీ వర్షం కురిస్తే మ్యాచ్ సాగడం కష్టమే. అయితే ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే విశాఖపట్నం వన్డేకు ఢోకా ఉండదు. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు చెందిన అభిమానులు విశాఖ చేరుకున్నారు. ప్రస్తుతం విశాఖ నగరంలో ఎక్కడ చూసిన క్రికెట్ సందడే కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News