Home తాజా వార్తలు ప్రచార శంఖం

ప్రచార శంఖం

CM KCR Public Meeting

నేడు కరీంనగర్ సభతో ప్రారంభించనున్న కెసిఆర్
పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్న సిఎం కెసిఆర్
నేడు కరీంనగర్ స్పోర్ట్ పాఠశాల మైదానంలో బహిరంగ సభ
ఇంటింటికి బొట్టుపెట్టి సభకు ఆహ్వానిస్తున్న మహిళా నేతలు
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కెసిఆర్ సుడిగాలి పర్యటనలు

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు టిఆర్‌ఎస్ ప్రచారపర్వాన్ని పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేడు కరీంనగర్ నుంచి ప్రారంభించనున్నారు. ఆయన రాక కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరీంనగర్ సమీపంలోని ఉజ్వల పార్కు వద్ద గల స్పోర్ట్ పాఠశాల మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి. సభకు రెండున్నర లక్షల మంది ప్రజల హాజరవుతారని భావిస్తున్నారు సిఎం కెసిఆర్ సాయంత్రం ఐదున్నర గంటలకు సభాస్థలికి చేరుకోనున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎంపి వినోద్‌కుమార్, ఎంఎల్‌ఎ గంగుల కమాలాకర్ పార్టీ ఇన్‌చార్జీ బస్వరాజ్ సారయలు ఏర్పాట్లను పరిశీలించారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్‌గా కరీంనగర్ నుంచి టిఆర్‌ఎస్ కార్యక్రమాలు ప్రారంభించడం ఆనవాయితిగా వస్తుంది.

తెలంగాణ ఉద్యమంలో  తొలి బహిరంగ సభ కరీంనగర్‌లో ప్రారంభించి రాష్ట్ర సాధనలో గమ్యాన్ని ముద్దాడిన కరీంనగర్ నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని టిఆర్‌ఎస్ ప్రారంభించిందని నాయకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సిఎంకు సూచించడంతో కరీంనగర్ కార్యక్రమం ఖరారైంది. అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సందర్భాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమపథకాలు కరీంనగర్ నుంచే ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోండటంతో ఆదివారం కరీంనగర్ నుంచే టిఆర్‌ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కెసిఆర్ శంఖారావం పూరించేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిఆర్‌ఎస్ కరీంనగర్‌నే సెంటిమెంట్‌గా మరోసారి ఎన్నుకుంది. ఈమేకరు కరీంనగర్ జిల్లా నాయకులు సిఎం కెసిఆర్ సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

బొట్టుపెట్టి సభకు ఆహ్వానం
కరీంనగర్‌లో ఆదివారం జరగనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్ సతీమణితో పాటు జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సభకు ఆహ్వానిస్తున్నారు. పార్టీల విభేదాలను మరిచి అన్నిపార్టీల నాయకులను సభకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లానాయకులు చెపుతున్నారు. కరీంనగర్ స్పోర్ట్ కళాశాల మైదానంలో సిఎం కెసిఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార తొలి బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కరీంనగర్ టిఆర్‌ఎస్‌కు సెంటిమెంట్ : ఈటల రాజేందర్
ఉద్యమకాలంలో తొలిబహిరంగ సభను కరీంనగర్‌లో నిర్వహించి ఆతర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతంచేసి గమ్యాన్ని ముద్దాడామని వైద్యశాఖమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఆసెంటిమెంట్ తోనే కరీంనగర్ స్పోర్ట్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తొలి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందనే సంకేతాలు వెలుబడుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయని ఈటెల రాజేందర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్ఫూర్తి తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం అవుతుందని ఈటెల రాజేందర్ చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ప్రజలకు ఉన్న భరోసా, నమ్మకం తోనే ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపిస్తారనే ధీమాను వ్యక్తం చేశారు. దేశరాజకీయాల్లో టిఆర్‌ఎస్ కీలకంగా ఉన్నప్పుడే కేంద్రప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికోసం ఆలోచిస్తుందన్నారు. అభివృద్ధిని అకాంక్షించే తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌ను గెలిపించి 16 మంది పార్లమెంట్ సభ్యులను పార్లమెంట్‌కు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సుడిగాలి పర్యటనలకు సిధ్దమవుతున్న సిఎం కెసిఆర్
ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధమయ్యారని టిఆర్‌ఎస్ నాయకులు చెప్పారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ పర్యటనల ప్రణాళిక సిద్ధమవుతుందన్నారు. తొలుత కరీంనగర్‌లో పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించి 19వ తేదీన నిజామాబాద్ జిల్లా గిరిరాజ్ కళాశాల మైదానంలో కెసిఆర్ బహిరంగ సభ ఖరారైంది. ఈ రెండు సభల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యనలు చేసి ఓటర్లను ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తుంది. పండుగ వాతావరణంలో కరీంనగర్ సభనిర్వహించేందుకు మహిళలు ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానిస్తుండగా స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు డప్పులు వాయిస్తూ కెసిఆర్ సభకు ప్రజలను ఆహ్వానిస్తుండటం ఈసభ ప్రత్యేకతగా నిలిచింది.

సిఎం కెసిఆర్ పాల్గొనే తొలి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ చరిత్రలో నిలిచి పోయే విధంగా ఏర్పాట్లు చేయాలని నాయకులు పోటీ పడి పనుల్లో నిమగ్నమయ్యారు. శాసనసభ్యుడు గంగుల కమలాకర్, సిట్టింగ్ ఎంపి వినోద్‌కుమార్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్ రావు కరీంనగర్ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, మైనారిటీ కార్ఫోరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ తదితర నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భారీ వేదికను నిర్మిస్తున్నారు. వేలాధిమంది అభిమానులు ఏ వైపునుంచి చూసినా, దూరం నుంచి చూసినా ముక్యమంత్రి కెసిఆర్ పార్టీశ్రేణులకు, అభిమానులకు అగుపించేవిధంగా వేదిక రూపుదిద్దుకుంటుంది. ఈ వేదిక పైనుంచే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి పేరును టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

Today public meeting in Karimnagar Sport school Ground