Home తాజా వార్తలు 83 ఏళ్ల నాటి నిబంధనను ప్రభుత్వం ప్రయోగిస్తుందా?

83 ఏళ్ల నాటి నిబంధనను ప్రభుత్వం ప్రయోగిస్తుందా?

Today the RBI Board meeting on some key issues

నేడే ఆర్‌బిఐ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ : నేడు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) బోర్డు సమావేశం ఇటు ప్రభుత్వం, అటు ఆర్‌బిఐకి కీలకం కానుంది. ఈ సమావేశంలో ఆర్‌బిఐ సభ్యులు, ప్రభుత్వ అధికారులు ఎవరి పంతాలో వారు నిర్ణయాలను తెలిపే అవకాశముంది. అయితే ప్రభుత్వం, ఆర్‌బిఐల మధ్య కొద్ది రోజులుగా విభేదాలు నెలకొన్నాయి. ఆర్‌బిఐ స్వతంత్రతకు విఘాతం కల్గుతోందంటూ ఇటీవల ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య చేసిన పరోక్ష ఆరోపణలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. అప్పటి నుంచి మొదలు ఈ మంటలు ఇంకా చల్లారలేదు. ఓ దశలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేస్తారని మీడియా వర్గాలు కోడైకూశాయి. ఆర్‌బిఐ బోర్డు సమావేశం తర్వాత ఉర్జిత్ రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం రాజీ దిశగా చర్చలు చేపట్టిందని, కొన్ని విషయాల్లో మాత్రం మొండి పట్టుదలతో ఉందనే వార్తలు కూడా వెలువడ్డాయి.

ఈ ఉత్కంఠతకు తెరపడాలంటే ఈరోజు జరిగే బోర్డు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రభుత్వం, ఆర్‌బిఐలు సానుకూలంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాయా? లేదా? అనే అంశాల మీద ఆధారపడింది. ఆర్‌బిఐ వద్ద ఉన్న నిల్వలు, వాటిపై అధికారం.. ఇంకా ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఈ సమావేశంలో కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు. పార్ట్ టైమ్ ఆర్‌బిఐ డైరెక్టర్‌గా ఉన్న స్వామినాథన్ గురుమూర్తి.. మొండి బకాయిల విషయంలో బ్యాంకులు మరింత కఠినంగా ఉండకుండా నిరోధించడం, ఆర్‌బిఐ నిల్వలపై గురిపెట్టారు. ఎన్నికల సంవత్సరానికి ముందు ప్రభుత్వానికి చేతిలో మరింత నిధులు అందేందుకు ప్రయత్నాలు పెంచారు. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణ లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు చేపడుతూ, బ్యాంకు ల్లో ఎన్‌పిఎల భారాన్ని తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేపడుతోంది.

ఈ నేపథ్యంలో విరల్ ఆచార్య అక్టోబర్ ఆఖరులో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఆర్‌బిఐ స్వయం ప్రతిపత్తిపై బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను పరిశీలించిన మీదట ప్రభుత్వం ఆర్‌బిఐపై 83 ఏళ్లలో ఎన్నడూ వినియోగించని నిబంధనను ప్రయోగించాలని చూస్తోంది. రిజర్వు బ్యాంక్ చట్టం సెక్షన్ 7 అంశంపై గత నెలలో ఆర్థిక శాఖ పటేల్ అభిప్రాయాలను కోరింది. ఆర్‌బిఐ బోర్డు అంటే సలహాలు, మార్గనిర్దేశకుడి పాత్ర పోషించడమేనని.. పాలసీ అంశాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గురుమూర్తి, ప్రభుత్వ నామినీలు సుభాష్ చంద్రగార్గ్, రాజీవ్ కుమార్‌లు.. బ్యాంక్ పర్యవేక్షణ, పరిశ్రమకు రుణ ప్రవాహం, షాడో బ్యాంకింగ్ సెక్టార్‌లో సంక్షోభాన్ని అధిగమించేందదుకు దేశానికి సులువైన ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలపై స్వరం వినిపించవచ్చని భావిస్తున్నారు.

ఇదంతా నిల్వల కోసమే : చిదంబరం
ఆర్‌బిఐ బోర్డు సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఆర్‌బిఐ తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తోందని, తద్వారా రూ.9 లక్షల మిగుళ్లపై పట్టును సాధించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. సోమవారం బోర్డు సమావేశంలో ఆర్‌బిఐ, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోనుందని అన్నారు. ట్విట్టర్ ఆయన ఈ వ్యాఖ్యలు పోస్టు చేశారు.

Today the RBI Board meeting on some key issues

Telangana Latest News