Home జాతీయ వార్తలు రక్షణ భూములపై ప్రధానితో నేడు టిఆర్‌ఎస్ ఎంపిల భేటీ

రక్షణ భూములపై ప్రధానితో నేడు టిఆర్‌ఎస్ ఎంపిల భేటీ

Today, TRS MPs meet with Prime Minister of defense lands

లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన జితేందర్‌రెడ్డి
పోడియం వద్ద ఎంపిల నినాదాలు

మనతెలంగాణ/న్యూఢిల్లీ : రక్షణశాఖ భూముల విషయంలో కేంద్రం అను సరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు నిర సనగా లోక్ సభలో గురువారం ఆందోళన చేపట్టిన టిఆర్‌ఎస్ ఎంపిలు శుక్రవారం ఉదయం  ప్రధాని మోడీతో పార్ల మెంటులో భేటీ కానున్నారు. అరుణ్‌జైట్లీ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో బైసన్ పోలో గ్రౌండ్స్‌తో పాటు జింఖానా గ్రౌండ్స్ స్థలాన్ని కూడా ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారని, అధికారికమైన ఉత్తర్వులు వెలువడడమే తరువాయి అనే సందర్భంగా నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్న విషయాన్ని వివరించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న రక్షణ భూములను వెంటనే రాష్ట్రానికి అప్పగించాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. టిఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపిలంతా ప్రధానిని పార్లమెంటులోని ఆయన ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కలిసి వివరించడంతో పాటు ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా చర్చించిన విషయాన్ని గుర్తుచేయనున్నారు.

కర్నాటక రాష్ట్రానికి రక్షణ భూములను ఇవ్వడంలో చొరవ చూపిన రక్షణ శాఖ ఇప్పుడు తెలంగాణ విషయంలో మాత్రం భిన్నవైఖరి అవలంబిస్తోందని, సవతితల్లి ప్రేమ వివక్షకు నిదర్శనమంటూ లోక్‌సభలో జితేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు ప్రధానితో భేటీ కానుండడం గమనార్హం. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకే ప్రధానితో ఈ భేటీకి టిఆర్‌ఎస్ ఎంపిలు చొరవ తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా అవసరాల నిమిత్తం బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ స్థలాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా చొరవ తీసుకోవాలని ప్రధానికి వివరించనున్నారు. ఆ స్థలంలో నూతన సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని, హైదరాబాద్‌కు ఇతర జిల్లాలతో అనుసంధానంగా ఉండేలా జాతీయ, రాష్ట్ర రహదారులను, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం స్కై వే, ఫ్లై ఓవర్‌లను నిర్మించేందుకు వీలుగా రక్షణ భూములు అవసరమన్న విషయాన్ని కూడా ప్రధానికి టిఆర్‌ఎస్ ఎంపిల బృందం వివరించనుంది.

తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ : తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, నిర్దిష్టంతా తమ రాష్ట్రంపైనే ఎందుకిలా జరుగుతోందని టిఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడు జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభలో గురువారం ఈ మేరకు ‘ప్రత్యేక ప్రస్తావన’ చేస్తూ బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ గురువారం సమావేశం కావడంతోనే టిఆర్‌ఎస్ ఎంపిలు పోడియంలోకి వెళ్లి తెలంగాణకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. నిరసన తెలియజేయడానికి గల కారణాలను జితేందర్ రెడ్డి వివరించారు. తమ రాష్ట్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయని, గత నాలుగు రోజులుగా ప్రతీ మంత్రిత్వశాఖ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదన్నారు.

రక్షణ భూములను కర్ణాటకలో ఏ విధంగా బదిలీ చేశారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి రక్షణ భూములను బదిలీ చేయాలని జితేందర్ రెడ్డి కోరారు. అయితే ప్రశోత్తరాల సమయం తర్వాత ‘జీరో అవర్’లో మాట్లాడడానికి అవకాశమిస్తానని స్పీకర్ సుమిత్రా మహాజన్ నచ్చచెప్పారు. తమ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని జితేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వానికి అలాంటి పక్షపాతం ఉండదంటూ స్పీకర్ వారించే ప్రయత్నం చేసినా టిఆర్‌ఎస్ ఎంపిలు శాంతించలేదు. రక్షణ భూముల విషయంలో మూడేళ్ళ నుంచి కేంద్రానికి మొర పెట్టుకుంటున్నామని, రక్షణ శాఖ విధించిన అన్ని షరతులకూ అంగీకరించామని జితేందర్ రెడ్డి వివరించారు. ‘జీరో అవర్’లో మాట్లాడడానికి తప్పకుండా ఆవకాశమిస్తానని స్పీకర్ చెప్పడంతో శాంతించారు. ఆ తర్వాత జీరో అవర్‌లో జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కొత్త రాష్ట్రమని, కొత్తగా సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.

రక్షణ శాఖ పరిధిలో ఉన్న బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పలుసార్లు రక్షణ శాఖ మంత్రిని, ప్రధానిని కోరారని గుర్తుచేశారు. పలు సంప్రదింపుల తర్వాత 596 ఎకరాల బైసన్ భూమిని రాష్ట్రానికి బదిలీ చేయడానికి అప్పటి రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సూత్రప్రాయంగా అంగీకరించారని, రాష్ట్ర ప్రభుత్వం రూ . 95 కోట్లు చెల్లించాలని చెప్పారని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. మూడేళ్ళు గడిచినా ఇప్పటికీ రక్షణశాఖ నుంచి ఏ రకమైన చర్యలూ లేవని జితేందర్ రెడ్డి వివరించారు. ఆస్తులపై ఆదాయం కోల్పోతున్న దృష్ట్యా నష్ట పరిహారం చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుతాన్ని కంటోన్మెంట్ బోర్డు కోరిందని, నష్టపరిహారం నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని, అప్పటినుంచీ ఈ అంశం పెండింగ్‌లోనే ఉందని గుర్తుచేశారు. కర్ణాటకకు అతి తక్కువ సమయంలో 210 ఎకరాల భూమిని బదిలీచేసిన రక్షణ శాఖ మూడేళ్ళుగా తాము చేస్తున్న ప్రయత్నాలకు మాత్రం స్పందించలేదని, తమ ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.