Home ఖమ్మం భారతీయ సంగీతం ప్రపంచానికే దిక్సూచి

భారతీయ సంగీతం ప్రపంచానికే దిక్సూచి

World Music Day

 

విశ్వానికే తలమానికం మన శాస్త్రీయ సంగీతం
నేడు ప్రపంచ సంగీత దినోత్సవం

ఖమ్మం: రాగం.. తానం… పల్లవి.. ఈ మూడు సంగీత సరస్వతికి ప్రాణాధారాలు, సరిగమపదనిసలే సప్తస్వరాలై సంగీత ప్రపంచానికి మూలాధారాలగా నిలుస్తున్నాయి. ఏ సంగీతాకైనా శాస్త్రీయ సంగీతమే ప్రాణము, మూలం. సంగీతంలో ఎన్ని పోకడలున్నా అది ఇక్కడ నుండి ప్రారంభం కావాల్సిందే. సంగీతంలో రాగాలు మొదట భగవన్నామ కీర్తించటానికి ఎక్కువగా అవకాశముండేది. సాంప్రదాయ కోణంలో సాగే శాస్త్రీయ సంగీతంలో లబ్ద ప్రతిష్టులైన సంగీత విద్వాంసులు సంగీతాన్ని దేవుని కీర్తించటంతో వారికే ఎక్కువగా ఆదరణ ఉండేది. శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, హిందుస్తాన్ సంగీతంతో పాటు పలు పద్దతులు సంగీతంలో చోటుచేసుకున్నా వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్న విషయం తెలిసిందే. దైవాన్ని సంగీతంతో స్తుతించేపుడు గొప్ప సాహిత్యం జంటగా ఉంటేగాని ఆ కీర్తనలు చక్కగా అమరేవికావు. అందుకే ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు.

ఈ రోజు ఆయా దేశాల్లో అమలులో ఉన్న సంగీత వాయిద్యాలతో సంగీత ఉత్సవం పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారు. నేడు సంగీతం అంటే సినిమా సంగీతం మాత్రమేనన్న భావన ఉండటం దురదృష్టకరం. సినిమా సంగీతంకు కూడా శాస్త్రీయ సంగీతమే ఆధారం. సినీ సంగీతదర్శకులు ఎవరో ఒక గొప్ప సంగీత గురువుల వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించినవారే. ఏ రాగంలో పాట కావాలంటే ఆ రాగంలో పాటను క్షణాల్లో కూర్చిన ఘనతను చాటుకుంటున్నవారే. ఒకప్పుడు సంగీతాన్ని రాజలు పోషించి కవులతోపాటు సంగీతకళాకారులకు కూడా వారు అగ్రహారాలు బహుమానంగా ఇచ్చేవారు. అందుకే సంగీతకళాకారులు రాజులను ఎక్కువగా ఆశ్రయించేవారు. స్వయంగా రాజులు కొంత మంది సంగీత విద్వాంసులు కావటంతో సంగీతకళకు ఎనలేని ఆదరణ లభించేది. రాజుల తరువాత సంగీత విద్వాంసులు పెద్ద పెద్ద ఆలయాల్లో తమ సంగీత కచేరిలు ఇచ్చేవారు. సంగీతంతో పలు శారీరక, మానసిక రుగ్మతలు దూరం అవుతాయని అంటుంటారు.

సంగీతంలో మనసును రంజింపచేసే మహత్తు ఉంది. శిశువు నుండి పెద్ద వయస్సుల వారి వరకు, పశువులు, జంతువులు సైతం సంగీతానికి ముగ్దులవ్వక మానరు. సంగీతంలో ఉండే రాగం వల్ల మనసు ఆహ్లాదం చెంది, కొత్త ప్రపంచంలో విహరింపచేసే శక్తి సంగీతానికి ఉంది. ఇటీవల పాశ్యాత్య సంగీతం పేరుతో కొన్ని దేశాల్లో వస్తున్న సంగీతం శాస్త్రీయ సంగీతానికి పోటీగా వచ్చిందేనని అంటున్నారు. అది నిజమో కాదో తెలియదుకానీ, శాస్త్రీయ సంగీతానికి గల నిబధ్దత, ఆకట్టుకునే రసజ్ఞత, ఆరోహణ అవరోహాణాధి ఇతర పద్దతులు, ప్రక్రియలు ఇతర సంగీతాల్లో అంతగా లేవని కచ్చితంగా చెప్పవచ్చు. అలా అని పాశ్యాత్య సంగీతాన్ని తక్కువ చేసి చూడవద్దు, దేని గొప్పతనం దానిదే. భారత సాంప్రదాయాన్ని గౌరవించేవారు శాస్త్రీయ సంగీతాన్ని తప్పక ఇష్టపడతారు. శాస్త్రీయ సంగీతంకు ఒక పద్దతి, నియమం అంటూ ఉందని, ఎందరో వర్థమాన కళాకారులు శాస్త్రీయ సంగీతంతోనే రంగప్రవేశం చేస్తుంటారు.

సంగీతం గురించి వివరించి చెప్పాలంటే అదొక సముద్రం, అమృతం ఎంత తాగినా ఇంకా తాగాలని ఎలా అనిపిస్తుందో చక్కటి సంగీతం కూడా అంతే. సంగీతం జీవితానికి కావాల్సిన మార్గదర్శకత్వాన్ని ఇస్తుందంటారు. సత్వశోధనకు, సత్యశోధనకు సంగీతమే ప్రాణమని పూర్వీకులు ఏనాడో చెప్పారు. సంగీతం గురించి అసలు తెలియనివారైనా ఒక్కసారి సంగీతకచేరికి హాజరైతే రస గంగాలోకాలు చుట్టి రావటం ఖాయం. అందుకే సంగీతం త్యాగరాజ హృదయమై… రాగరాజ నిలయమై వర్దిల్లుతోంది. పండితుడి నుండి పామరుడి వరకు ఒక్కసారి వింటే సులభంగా అర్దంచేసుకునే బాషగా, గానంతో కూడిన సంగీతంలో సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు పరవశిస్తున్నాయి. . సంగీతసాధనకు శృతిలయలు జననీజనకులు కాగా భావాలు, రాగాలు, తాళాలు వాటిని పుట్టిన బిడ్డలుగా భావిస్తారు. సంగీతపాఠంలో నిర్మలమైన తేనేతొలికే పదాలే పదాలుగా సంగీతంతో జతకలిసి రాగరంజితంగా వెలుగొందుతాయి.

సంగీతంలో రోజు రోజుకు ఎన్నో కొత్త ప్రక్రియలు వస్తున్నా సంగీతం అనే కళకు బలం చేకూరుస్తున్నాయే తప్ప మరే విధమైన ఇబ్బందిని కలిగించటం లేదని అనుభవజ్ఞులు చెప్తుంటారు. సంగీతంలో సరిగమపదనిస …అనే ఏడు స్వరాలే కీలకం, అక్కడ నుండే అనేక జనక రకాలు, వాటినుండి పుట్టిన అనేక జన్యరాగాలు ఉండనే ఉన్నాయి, ఇలా ఆ ఏడు స్వరాల నుండే సంగీతం అనే కళ గొప్పగా అవతరించి మన ముందుకు వచ్చింది. ఎవరు సంగీతం నేర్చుకున్నా ఇక్కడ నుండి ప్రారంభం జరగాలి. ప్రస్తుతం అమలులో ఉన్న రాగాలన్నీ ఇక్కడ నుండి పుట్టినవే. అయితే ఈ సంగీత ప్రవాహంలో ఒక్కొక్కరిదీ ఒక్కో పద్దతి. సంగీతంలో మరింత రాణింపు సాధించేందుకు చాలా మంది తమకు తోచిన విదంగా ప్రయోగాలు చేసి సఫలీకృతులవుతుంటారు.

త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలకు, అన్నమయ్య జాజిరి పాటలకు, భక్తరామదాసు భజన సాంప్రదాయానికి, కబీర్‌దాసు రామచరిత్ మానస్‌కు, ముత్తుస్వామిదీక్షితులు నవవర్ణకీర్తనలకు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆధునిక సంగీత కీర్తనలకు, ఎంఎస్ సుబ్బలక్ష్మీకర్ణాటక సంగీత రాగాలకు ఇంకా అనేకమంది లబ్దప్రతిష్టులైన సంగీత ప్రముఖులకు అంతర్జాతీయ కీర్తిని సంపాదించి పెట్టిన సంగీతంతో వారు కూడా బహుముఖంగా కీర్తింపబడ్డారు. వీరి భక్తిమార్గానికి సంగీతం ఆలంబన నిలిచింది. చక్కటి పదకూర్పుతో సంగీతాన్ని భక్తి మార్గానికి ఉపయోగించారు. త్యాగరాజస్వామి,ముత్తుస్వామి దీక్షిత్తులు, శ్యామశాస్త్రిలను సంగీత త్రిమూర్తులు అంటారు, వీరి రచనలు ఒకరొది ద్రాక్షపాకం, ఇంకొకరిది కదిలీపాకం, మరోకరి నారీకేళపాకంలా ఉంటాయని ప్రతీతి. ఇంత గొప్పగా ఉంది కాబట్టే భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రపంచ సంగీతానికే తలమానికంగా నిలబడింది.

Today World Music Day