Home తాజా వార్తలు టాలీవుడ్ డ్రగ్స్ కేసుల్లో టాప్ సీక్రెట్..

టాలీవుడ్ డ్రగ్స్ కేసుల్లో టాప్ సీక్రెట్..

ఎల్లలు దాటిన ‘మత్తు’ దందా
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా వెలుగులోకి
రెండేళ్ళ కాలంలో మొత్తం 12 డ్రగ్స్ కేసులు నమోదు
8 కేసుల వివరాలు అందజేత..మరో4 కేసుల్లో దాటవేత
టాలీవుడ్ కేసుల్లో టాప్ సీక్రెట్

Drugs

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో మాదక ద్రవ్యాల దందా అంతర్జాతీయ స్థాయికి చేరినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఛార్జీషీట్‌లో సంచలన విషయాలను వెల్లడయ్యాయి. జర్మనీ, బ్రిటన్, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్ ద్వారా హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. విదేశాలనుంచి స్టీల్‌బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్‌ఎస్‌డి వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకుని తెప్పించుకుంటుండటంతో డ్రగ్స్ దందా ఖండాంతరాలు దాటిన విషయం ఛార్జీషీట్ల ద్వారా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో గత రెండేళ్ల కాలంలో నమోదైన 12 డ్రగ్స్ కేసుల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం కింద సంపాదించింది. అయితే 12 కేసులకు గాను 8 కేసుల్లోనే చార్జిషీట్ నమోదు చేసినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ఆర్టీఐకు ఎక్సైజ్‌శాఖ సమాధానమిచ్చింది. ఈ క్రమంలో నగరం పరిధిలో గత రెండేళ్ళ కాలంలో మొత్తం 12 డ్రగ్స్ కేసులు నమోదు కాగా ఇందులో నాలుగు కేసులపై ఇంకా చార్జీషీట్ దాఖలు చేయలేదని వాటి వివరాలు ఇచ్చేందుకు సంబంధిత అధికారులు దాటవేశారు.

కాగా, ఈ నాలుగు కేసులు టాలీవుడ్ రంగానికి చెందినవే కావడం విశేషం. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులకు ఇచ్చిన ఎనిమిది ఛార్జీషీట్లలో పలు సంచలన అంశాలు వెలుగు చూశారు. ఇందులో ఎక్కువగా విద్యార్థులే వున్నారని ఛార్జీషీట్లలో పేర్కొన్నారు. ఈక్రమంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్ మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్ విక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఎనిమిది చార్జిషీట్లలో కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు ప్రముఖుల పేర్లు వుండడం విశేషం. మరోవైపు సంచలనం సృష్టించిన టాలీవుడ్ కేసులో మొత్తం 72 మంది పేర్లు వుండగా వారిలో 12 మంది మాత్రమే విచారణకు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఇచ్చిన ఛార్జీషీట్లతోపాటు మిగిలిన టాలీవుడ్‌తో సంబంధం ఉన్న నాలుగు కేసుల ఛార్జీషీట్లను వెలుగులోకి తేవాలని ఫోరం ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ దందాపై విచారించిన సిట్ నివేదికను బయట పెట్టాలని ఫోరం డిమాండ్ చేస్తోంది. సిట్ రిపోర్టు వెలుగు చూస్తే పలువురు టాలీవుడ్ ప్రముఖుల బండారం బయట పడుతుందని ఫోరం ప్రతినిధులంటున్నారు.

Tollywood top stars names hidden in Drugs case?