Home ఆఫ్ బీట్ టమోటా రసంతో మొటిమలు మాయం!

టమోటా రసంతో మొటిమలు మాయం!

Glowing skin

 

రేపు పొద్దున్నే ఫంక్షన్‌కు, పార్టీకి వెళ్లాలి. ఉదయాన్నే లేచి అద్దంలో ముఖాన్ని చూసుకుంటే.. ఒక్కసారి మూడ్‌ఆఫ్ అయిపోయారు. మిమ్మల్ని భయపెట్టింది.. మీ ముక్కు మీదున్న ఒక చిన్న మొటిమ. అందుకే ఆ పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాదు అనుకుని దిగులుగా అయిపోతారు. అలాంటి వాళ్లకు ఈ టిప్స్..

1. మీకు మొటిమలు వచ్చే అవకాశం ఉందనిపిస్తే – పది నుంచి పదిహేను నిమిషాల సేపు ముఖం మీద పుదీనా ఆకుల్ని పెట్టుకోండి. ఆ తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఒకవేళ మీకు ఇప్పటికే మొటిమలు వచ్చుంటే.. ఆకులతో రుద్దకండి. స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశం లేకపోలేదు.

2. జిడ్డు చర్మం ఉన్న వాళ్లకు మొటిమలతో పెద్ద సమస్య. ఇటువంటి వాళ్లకు ముల్తానీ మట్టి ఫేస్‌ఫ్యాక్ బెస్ట్. మట్టిలో మూడు నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలుపుకుని.. ముఖానికి మాస్క్ వేసుకోండి. జిడ్డును లాగి పడేసి.. మురికిని తొలగిస్తుంది. అయితే పదే పదే ఈ ఫేస్‌ప్యాక్ వేసుకోవద్దు.
3. వారానికి ఒక్కసారే వేసుకోవాలి. ఒకవేళ మీ చర్మం మరింత సెన్సిటివ్ అయినా, పొడి చర్మం అయినా.. ముల్తానీ మాస్క్ వద్దు.
4. చర్మ సమస్యలు తొలగించేందుకు వేప చక్కటి ఔషధం. ఈ విషయాన్ని ఆయుర్వేదవైద్యం ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నదే! కాబట్టి.. వేప ఆకుల్ని ఉడికించిన నీళ్లతో స్నానం చేయొచ్చు. మొటిమలు రాకుండా ఇది కూడా ఒక పరిష్కారం.
5. ఒక్కోసారి మొటిమలు చిన్నగా వాచి నొప్పిని కలిగిస్తూ.. ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు ఐస్‌ముక్కల్ని వాటి మీద కాసేపు పెట్టండి. ఉపశమనం కలగడమే కాకుండా.. సమస్య మరింత పెద్దదవ్వదు. అయితే మొటిమల మీద ఐస్‌తో గట్టిగా ప్రెస్ చేయకండి.
6. ముఖం మీద మొటిమలు, చర్మ సమస్యలు రాకుండా.. అందరి చేతుల్లోను ఉన్న సులువైన పరిష్కారం –
బయటికి వెళ్లి ఇంటికి వచ్చిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవడం. రోజుకు రెండు మూడుసార్లు ఇలా చేస్తే చర్మం మీద పేరుకుపోయిన మలినాలు తొలగి.. సమస్యలు దరి చేరవు.
7. దివ్యౌషధం పసుపు. ఇందులోని ఔషధ గుణాలు చర్మసమస్యలకు చక్కటి విరుగుడు. వారానికి రెండుసార్లు అయినా ముఖానికి నాణ్యమైన పసుపును రాసుకోండి. తరతరాల నుంచి వస్తున్న ట్రెడిషనల్ కాస్మొటిక్ టిప్ ఇది.
8. టొమోటో జ్యూస్‌లో తేనె కలిపి.. ముఖానికి రాసుకోవచ్చు. పదిహేను నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. మొటిమలు పోవడమే కాదు, ఇదివరకు ఏర్పడినప్పుడు వాటి స్థానంలో వచ్చిన నల్లమచ్చలు కూడా తగ్గుతాయి. అయితే స్కిన్ ఇరిటేషన్ సమస్యలు ఉన్న వాళ్లు ఈ చిట్కా జోలికి వెళ్లకండి.
9. ఆపిల్ గుజ్జు, తేనె కలిపిన మిశ్రమాన్ని కూడా పింపుల్స్‌ను పోగొట్టేందుకు వాడొచ్చు. మాస్క్ వేసుకున్న కాసేపటి తరువాత.. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
10. తేనె, నిమ్మరసాల మిశ్రమంతో కూడా
ఇలాగే చేయొచ్చు.
11. మొటిమలు రాకుండా గృహవైద్యాన్ని, కాస్మొటిక్స్‌ను వాడటమే కాదు. ఆహారం విషయంలోను జాగ్రత్తలు పాటించాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా రెండు లీటర్ల నీళ్లు తాగాలి. దీనివల్ల శరీరంలోని మలినాలు పోతాయి.
వంటనూనెను బాగా తగ్గించాలి. మసాలాలు, జంక్‌ఫుడ్‌లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.
12. కనీసం రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే మరింత మంచిది.

Tomato juice for glowing skin