Home తాజా వార్తలు హ్యాట్రిక్ గెలుపు ఎవరిదో?

హ్యాట్రిక్ గెలుపు ఎవరిదో?

Tomorrow match between KKR vs CSK

రేపు సిఎస్‌కెతో కోల్‌కతా ఢీ

అబుదాబి: ఐపిఎల్ రెండో దశ టోర్నమెంట్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆదివారం జరిగే సమరానికి ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యాయి. ఆరు జట్లు కూడా యుఎఇలో తాము ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి జోరుమీదున్నాయి. చెన్నైతో పోల్చితే కోల్‌కతాకు ఈ మ్యాచ్ చాలా కీలకమని చెప్పాలి. సిఎస్‌కే ఇప్పటికే 9 మ్యాచుల్లో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు కోల్‌కతా రెండో దశలో దూకుడు మీద కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. ఇరు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఏ జట్టు గెలుస్తుందో ముందే ఊహించడం కష్టంగా కనిపిస్తోంది. బెంగళూరు, ముంబై ఇండియన్స్‌లతో జరిగిన మ్యాచుల్లో కోల్‌కతా విజయం సాధించి ప్లేఆఫ్ బెర్త్ రేసులో కొనసాగుతోంది. మరోవైపు చెన్నై కూడా ముంబై, బెంగళూరులతో జరిగిన మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. ఇక ఆదివారం రెండు జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

జోరుమీదున్న వెంకటేశ్..

ఇక కోల్‌కతాకు చెందిన యువ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ జోరుమీదున్నాడు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ చెలరేగి ఆడాడు. బెంగళూరు, ముంబైలతో జరిగిన మ్యాచుల్లో దూకుడుగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక తొలి మ్యాచ్‌లో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా దూకుడుగా ఆడాడు. ఈసారి మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. గిల్, అయ్యర్‌లు చెలరేగితే ఈ మ్యాచ్‌లో కూడా కోల్‌కతాకు శుభారంభం ఖాయమనే చెప్పాలి. ఇక ముంబైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ముంబై బౌలర్లను హడలెత్తించాడు. ఈసారి కూడా త్రిపాఠి నుంచి కోల్‌కతా ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన త్రిపాఠి విజృంభిస్తే కోల్‌కతాకు భారీ స్కోరు చేయడం కష్టమేమీ కాదు. ఇక కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, నితీష్ రాణాలు కూడా తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరిస్తే కోల్‌కతాకు ఎదురే ఉండదు.

అయితే మోర్గాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలం కావడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఇక సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్, ఫెర్గూసన్ వంటి ఆల్‌రౌండర్లు కోల్‌కతాకు అందుబాటులో ఉన్నారు. ఇటు బ్యాట్‌తో అటు బంతితో రాణించే సత్తా వీరికుంది. రసెల్, నరైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఫెర్గూసన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ అసాధారణ బౌలింగ్‌ను కనబరిచారు. ఈసారి కూడా ఇదే జోరును కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు వరుణ్ చక్రవర్తి రూపంలో మ్యాచ్ విన్నర్ స్పిన్నర్ ఉన్న విషయం తెలిసిందే.

జోరుమీదున్న గైక్వాడ్..

మరోవైపు చెన్నై కూడా వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుంది. కోల్‌కతాపై కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జోరుమీదున్నాడు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ రాణించాడు. ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. రుతురాజ్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే చెన్నైకి భారీ స్కోరు ఖాయం. ఇక మరో ఓపెనర్ డుప్లెసిస్ కూడా ముంబైపై బాగానే ఆడాడు. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేశ్ రైనా తదితరులతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వీరిలో ఏ ఇద్దరూ నిలదొక్కుకున్నా కోల్‌కతా బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. అంతేగాక బ్రావో, జడేజా, చాహర్, శార్దూల్‌ల రూపంలో మ్యాచ్ విన్నర్ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో బలంగా ఉన్న సిఎస్‌కె ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.