Home రాష్ట్ర వార్తలు ప్రజల తలలో నాలుకలవ్వండి

ప్రజల తలలో నాలుకలవ్వండి

ktr2

హైదరాబాద్ నగర ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి పనిచేయండి
జిహెచ్‌ఎంసి కార్పొరేటర్లకు మంత్రి కెటిఆర్ ఉద్బోధ

సిటీబ్యూరో : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనలకు అనుగుణంగా అందరం కలిసి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పాటుపడాలని మున్సిపల్ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. జిహెచ్‌ఎంసి నుంచి ప్రజలు అద్భుతాలేమీ ఆశించడం లేదని, వారి కనీస అవసరాలను తీర్చితే సరిపోతుందన్నారు. శనివారం బేగంపేట హరిత ప్లాజాలో నగర కార్పొరేటర్లు, రాష్ట్ర మున్సిపాల్ శాఖ, జిహెచ్‌ఎంసి, వాటర్‌బోర్డ్, హెచ్‌ఎండిఎ, టిఎస్ సిపిడిసిఎల్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో చేపట్టిన పలు ప్రాజెక్ట్‌లు, సంక్షేమ పథకాలపై కార్పొరేటర్లకు కెటిఆర్ సుదీర్ఘంగా వివరించారు. నగరంలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై కార్పొరేటర్ల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. సమావేశంలో కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను కెటిఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను తీర్చేలా జిహెచ్‌ఎంసి అధికారులతో కలిసి పనిచేయలన్నారు. సర్కిళ్ల స్థాయిలో నిర్వహిస్తున్న ఉమ్మడి సమన్వయ సమావేశాలలో ఇకపై కార్పొరేటర్లను కూడా భాగస్వాములను చేసుకోవాలని అధికారులకు కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వానికి గౌరవం తెచ్చేలా నడుచుకోవాలని కార్పొరేటర్లకు గుర్తు చేశారు.