Home తాజా వార్తలు రూ.1.47 లక్షల కోట్లు పెరిగింది

రూ.1.47 లక్షల కోట్లు పెరిగింది

Sensex

 

గతవారం టాప్ 9 కంపెనీల మార్కెట్ విలువ
ఒక్క ఇన్ఫోసిస్‌కు మాత్రమే నష్టాలు

వాషింగ్టన్ : గత వారం దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో దూసుకెళ్లాయి. వరుసగా ఆరు రోజులు లాభాల పరంపరను కొనసాగించాయి. దీంతో టాప్ 10 బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) గత వారం రూ.1.47 లక్షల కోట్లు పెరిగింది. దీనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసిఎస్ అత్యధికంగా మార్కెట్ విలువను పెంచుకున్నాయి. ఒక్క ఇన్ఫోసిస్ తప్ప మిగతా తొమ్మిది కంపెనీలు అన్నీ లాభపడ్డాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ 39,876 కోట్లు పెరిగి రూ.8,97,179 కోట్లకు చేరింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.9 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించి, దేశంలోనే మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. శుక్రవారం బిఎస్‌ఇ ట్రేడింగ్ సమయంలో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(ఎంక్యాప్) తొమ్మిది లక్షల కోట్లకు పైగా చేరుకుంది. ఐటి దిగ్గజం టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .26,379.27 కోట్లు పెరిగి రూ .7,71,996.87 కోట్లకు, అలాగే హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఎంక్యాప్ 21,962 కోట్ల రూపాయలు పెరిగి రూ .4,55,952 కోట్లకు చేరుకుంది.

ఇతర కంపెనీలకు లాభాలు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలువ రూ.16,767 కోట్లు పెరిగి రూ.6,72,466.30 కోట్లకు చేరగా, ఇక హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ రూ.14,728 కోట్లు పెరిగి రూ.3,61,801 కోట్లు అయింది. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) విలువ రూ.13,521 కోట్లు పెరిగి రూ.2,40,652 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ విషయాని కొస్తే విలువ రూ.6,046 కోట్లు ఎంక్యాప్ పెరిగి రూ.2,82,783 కోట్లు కాగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్యాపిటలైజేషన్ రూ.5,223 కోట్లు పెరిగి రూ.3,08,555 కోట్లకు చేరింది. ఐటిసి మార్కెట్ విలువ కూడా రూ.2,948 కోట్లు పెరిగి రూ.3,02,861 కోట్లకు చేరుకుంది. వీటికి విరుద్ధంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ మాత్రం రూ.20,594 కోట్లు తగ్గి రూ.3,29,751 కోట్లకు చేరుకుంది.

ర్యాంకింగ్ ఇలా
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ పది కంపెనీలలో మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ ఉన్నాయి.

Top 9 companies market value rose by Rs 1.47 lakh cr