Home దునియా అమ్మచ్చింది

అమ్మచ్చింది

Taatalu

అమ్మచ్చింది. అమ్మచ్చింది. గా ఎలిగేడుకు అమ్మచ్చింది. గామె గొప్ప గొప్ప మయిమలు గలది. మయిమగల అమ్మంటరామెను. గామె గిక్కన్నుంచి రాలే. ఎక్కన్నుంచనుకున్నరు. గా ఆంధ్ర నుంచి. మస్తు దూరం నుంచి. గా గుంటూరవుతల్నుంచి. గామె దర్శినెం జేసుకుంటే ఇగ అన్ని బాదలు వోతయి. గా సల్లగ జూసిందంటె సాలు ఏది గావన్నంటె గదయితది. గామంటె ఏమనుకున్నరు. మాదండమ్మ గా దొరగారింట్ల నెరిసిందట. గామె సేతులల్ల దేవున్ని సూపెడుతది. అరసేతిల మయిమలుంటయి.

సేతిలనే దేవుడుంటడు గద. గామె గాలనీరు బువ్వ తినకున్నా బతుకతది. గిట్ల మా ఊరోల్లంత అనుకోవట్టిండు. రోజుక్కొంతమంది ఉరికురికి గా ఊరికి పోవట్టిండ్రు. గా ఊరు మా ఊరుకు ఏడు కిలోమీటర్ల దూరంలుంటది. గప్పుడు బస్సుల్లేవేం లెవ్వు. కాలినడకన పోవుడే. ఎడ్లుబండి ఉన్నోల్లయితె సరారెడ్లబండో, పెద్ద కచ్చురంలనో పోదురు. గప్పుడందరికి బండ్లు గూడుండకపోవు. కొందరయితె బండిని అడుక్కొని ఎడ్లుగట్టుకొని పోదురు. లగ్గాలకు అవ్వే అన్నట్టు మీరెప్పటిసంగతనుకుంటండ్రు.

నేను పదోటి సదినప్పటి సంగతన్నట్టు. దగ్గెరదగ్గెర యాభైయేండ్ల కింది సంగతి. గప్పడునేను ఎలిగేట్లనే సదువుకుంటున్న.మా ఊల్లే తొమ్మిదోదే ఉండె. పది పదకొండు గా ఊల్లే నడుసుకువొయ్యి నడుసుకుంటచ్చి సదివేటోన్ని. మా ఊల్లే గిట్ల అందరనుకుంటాంటే నీయవ్వ నాకెందుకు తెలువపాయె గిది అనుకుంటి. ఎలిగేట్ల సదువుతున్న గా ఊల్లామె సంగతులెందుకు తెలువకపాయె. మరి తెలువన్నని ఏమున్నది. నేను బడికి వోతి వత్తి. గా ఊరు బడవతలనే ఉండె. గందుకోసం తెలువకపోవు నేమో. ఏదో అమ్మచ్చిందని మా యిన్న గని నేను గసోంటియి పట్టించుకోను గద.

గయిసేయలే. గదాని మీద మనుసు వెట్టలే. గదిన్నమోలె గదేందో సూడన్ననిపిచ్చింది. గిసోంటివాటి గురించి మలయశ్రీసారు సరిగ్గ జెప్పెటోడు. గయినె హేతువాది. దేవున్నినమ్మడు. సైన్సును నమ్ముతడు. నాగ్గూడ గదే ఇష్టం. గందుకనే మాకు సోపతయింది. సోపతంటె సోపతేం గాదు. గయినేమొ సారాయె. నేనేమొ. నేనేమొ బడిపొల్లగాన్నయితి.

గయినె గురువన్నట్టు నేను శిష్యుడన్నట్టు. ఇద్దరం మస్తు వాదించుకునెటోల్ల. ఇగ గాసారును అడుగన్నని బడికిపెయినంక ఓ లీజర్ పీరియడ్ల అడిగిన. అందరు మయిమలు మయిమలంటరు. గదేంది సారు. అనడినమోలె గయినె గలగల నవ్విండు. గయినెకంఠల గదోజీరుంటది. మాటలు గూడ గమ్మితిగ, తీరుతీరుగుంటయి. గా సారన్నడుగద. ఇగో మల్లయ్య. నాలుగ్గంటలకు బడి సుట్టయితదిగద! గప్పుడువొయ్యి గా అమ్మేందో సూసిరా. గదే గా వెలుమ దొరింట్లున్నది. గా మయిమలేందో నువ్వయితె సూసిరా రేపు గా సంగతులన్ని సెప్పుత అన్నడు.

ఇగ నాకు గా అమ్మను సూడన్నని బాగుండె. మా ఊఉరోల్లంటున్నవు గద. మా మయిమలేందో సూడన్నని ఉండె. బడికెప్పుడు చట్టయితదని ఎదురుసూడవడ్తి. ఎదిరిసూడంగ సూడంగ చుట్టాయె. గా రోజు నాకు పాఠాలేం మనుసున వట్టలే. బడికి సుట్టిగాంగనే మాట్రెడ్డి, నేను, సెందురమొగిలి కలిసి గా దొరింటిదిక్కు ఉరుకవుచ్చుకుంటిమి. మా బడి ఇవుతలికడయికయితె గా యిల్లు అవుతలికడకు, అయినా గప్పుడు ఊళ్ళేపాటి పెద్దగుండె. తింపి తింపి కొడితె తీకదమ్మిడన్నట్టు. కీకవెట్టెకుంటురికితె కీకయిపోయేవారకు అవుతలి వాడచ్చేది. మేం బోతిమి. గక్కడికి పోయేవారకు తీర్థమోలె జనం. ఒగలను తోసుకుంటొగలు జెనం.

మా ఊరోల్లు గూడ మాలేషుమందే ఉన్నరు. మమ్ములం జూసి నవ్విరాల్లు. సదువుకున్న పోరగండ్లు మీరు నమ్మరు. గని గీ అమ్మకు ఒగమయిమల్లేవు. గీమె ఏది జెప్పుతే గదయితది. గీమెను అనుమానపడద్దు. లోపలేదో పెట్టుకొని రావద్దు. మంచి మనుషులతోని గీమె దగ్గరికి రావాలె అనిరి గాల్లు. మేం బడిపోరగాండ్లం మాకు సెడ్డ ఆలోసనేముంటది? మంచిగ సదువుకోవాలెనని ఉంటదిగని వేరే ఆలోసనేముంటది అంటనేను. అందరం తోసుకుంట తోసుకుంట నిల్సున్నం. ఇంతల్నే అమ్మత్తుంది. వత్తంది అన్రి. మేం గటు సూత్తిమి. అమ్మవారోలె అమ్ముండె. పెయ్యి మీద మస్తునగలున్నయి.

పట్టుసీర కట్టుకుంది. ముక్కుకు ముక్కుపోగుంది. ఇంతెత్తు శిఖె ఉంది. నొసలు మీన గిప్పటి రొండురూపాయల బిల్లంత ఎడల్పుబొట్టుంది. ఎర్రబొట్టామె. ధగదగమెరుత్తంది. కాల్లకు కడాలున్నయి. గామచ్చి తవుసుబల్లమీన కూసుండె. ఇగ అందరికి దర్శినమిత్తదన్నట్టు. గామె దగ్గరికి పోవుటానికి తోసుకుంటండ్రు. వాలంటరి పోరగాండ్లు ఆపుతండ్రు. కట్టెలతోని ఎనుకకు నూకేత్తండ్రు. ఆమె దగ్గెరికందరు ఒక్కపారి పోకుండ అడ్డంగ కట్టెలు కట్టిండు. దారవులుండే సూడవడ్తిమి. గామె ఏమెమోసెప్పింది. గదే దేవున్ని గురించి బగ్గమందయిరి. సరిగ్గ ఇనవడుత లేపాయె. గిట్ల సెయ్యి దొప్పోలె వట్టి సూపె.

పక్కక్కుయినె సెప్పవట్టె. అమ్మ మయిమగలమ్మ. ఆమె సేతిల్నే శంఖ చక్రాలుంటయి. అంట విష్ణుమూర్తి ఆమె చేతిల నివాసముంటడు. సృష్టి, స్థితి, లయనారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులంత అమ్మ చేతిలుంటరు. ఆమె ఏది చెప్పితె గదయితది. ఆమెను దర్శిస్తు పాపాలు పోతయి. పునీతులైతరు అ. నాకేంది పాపాలు సేత్తెగద పోవుటానికి. పాపాలు సేసుడెందుకు గవ్విపోవుటానికి గిన్ని తిప్పలు పడుడెందుకనిపిచ్చె. ఇగ అటెనుక ఒగలెనుకొగలు ఆమె దగ్గెరికి పొయ్యి దండంబెట్టి పోవట్రి. ఏవేవో ప్రశ్నలడుగవట్రి. అనుమానాలుంటె తీర్చుకోవట్రి. నేను దండం బెట్టద్దనుకున్నగని మా సోపతి పోరగండ్లు పెట్టమన్నమోలె దండం బెడ్తి.

అగో అగో అమ్మ మొకం ముడతవెడితె శంభచక్రాలు. చేతుల్ల శంఖ చక్రాలలు అని తలో తీరుగ అనుకోవట్రి. నాకైతె ఏమనిపియ్యలేదుగని గండ్లేం మాయున్నదో సముజుగాలేదు. ఇగ గవ్వి జూసిఎల్లిపోతిమి. తెల్లారి మా మలయశ్రీ సార్నడిగితి. గామయిమలన్లేందిసారని. మీరేమొ మహిమలు లేవంటరు గామె సూపనేవట్టె అని అడిగిన. గప్పుడయినె గిట్ల జెప్పవట్టిండు. జెనాలల్ల మూఢనమ్మకాలున్నంత వరకు గిట్ల అమ్మల పేర్లమీన బాబాల పేర్లమీన, మంత్రగాల్ల మీన మోసాలు సేత్తనే ఉంటరు. గిసోంటోల్లేమొ తెలిసే సేత్తరు. గవ్వీట్ని పల్లెటూరి ఎడ్డిమా లోకం నమ్ముతది.

నిజమేననుకుంటది. మంత్రాలని సేత్తరు సూసినవా? అల్లూల్లల్ల మంత్రగాల్లని ఉంటరు. తేలు మంత్రలంటరు. పాము మంత్రమంటరు. గవ్వన్ని వట్టియే తేలుగుట్టిన కాడ నోటితోని రక్తం పీల్చుతడు. ఉమ్మి పారేత్తడు. గక్కడ దారం గడుతడు. అంటె రగుతంతోని విషం శరీరంలకు పోకుంట అడ్డంగ దారం గడుతడు. సెయ్యితోని తీడుతా ఉంటడు. తీడుతాంటె గా విషం కిందికత్తది. నోటితోని పీల్చినప్పుడే సానవోతది గద. ఇగ గిట్లజేసేవారకు ఆయింత వోతది. గిండ్ల మంత్రమేముండది. పాముమంత్రం గూడ గంతే. రాల్లుముడేసుడు గవ్వన్ని వట్టియే. పాములల్ల అన్ని విషప్పాములండయి. కొన్నే ఉంటయి. గవ్వి కుట్టినప్పుడు ఏంగాదుగద! గారాల్లు ముడేత్తెనో, మంత్రంతోనో విషం తగ్గిందనుకుంటరు. కని గదంత వట్టిదే.

ఎన్నిరాల్లుముడేసినా సరైన వైద్యం అందకపోతే పాముకాటుతోని సచ్చిపోతనే ఉన్నరు. గిది వట్టిమూఢనమ్మకమే. గట్లనే ఇంటికేదో దయ్యమత్తుందని ఇంటింటికి బూడిద గుమ్మిడికాయ గడుతరు. గా బూడిద గుమ్మిడికాయకు బయపడేదేం దయ్యం? దయ్యం ఈవాడకచ్చిందంటరు. ఆ వాడకంటరు. ఎవ్వ లు దాన్ని సూసిందిలేదు. ఎవ్వలన్న బయటకు పోతాంటె దుమ్ముతె తప్పంటరు. శుభం కాదంటరు. తుమ్ము తమ్ముదయి సెప్పుతున్నదంటరు. గది వట్టిదే. జలుబుజేస్తే దగ్గత్తది. పడిశెం బడితె తుమ్మత్తది. గింత మాత్రానికి ఏదోసేత్తరు. పిల్లెదుర్తెతె అల్లుగాలేదంటరు. తొడమీద సుడి ఉంటె మంచిదిగాదంటరు. కాకులు గలుస్తాంటె సూడద్దం టరు. ఆడోల్లకు కుడికన్ను, మొగోల్లకు ఎడుమ కన్నదురుతె మంచిది గాదంటరు.

గిట్ల ఎన్ని రకాల మూఢాలు. గిట్రెడ్డి ఎరుకే గద. గాడు కట్నంల బీడంటువెట్టుకుంటడని నువ్వేసెప్పినవు. ఆనికేమైతది. ఏంగాదుగద. గట్లనే దేవుడు తూలుడుగద. మనిషిమీన పూనుడేంది. గదో హిస్టీరియా అసోంటిది పూనకం వచ్చుడంటె. గీ అమ్మ అసోంటియి గూడ అంతే. మీ ఊళ్ళె గొర్లగాసెటయినె దేవుడ్రామయ్య గాలేదో గట్లనే. గిండ్ల ఏం మాయలేదు. మంత్రాల్లేవు. మోసముంది. ఎడ్డిపల్లెటూరోల్లను మోసం జేసుడుంది. ఆమె చేతుల్ల శంఖచక్రాలు కనబడుతున్న యంటున్నవు గద.

గదాన్ని నమ్ముతండ్రా? గది కనికట్టసోంటిది. కాటిపాపలోని జిమ్మిక్కసోంటిది. అరచేతిని మలుస్తది గద. చేయి గీతలు గుండ్రగచ్చెటట్టు మల్సుడు నేర్సుకున్నది. అందరు అమ్మ చేతిల శంకచక్రాలున్నయని గవ్వే సూద్దామనుకుంటరు. వాళ్ళ కండ్లకు గవ్వేకనవడుతయి. ఇగో పటు నేను సూపెడుత అని సెయ్యిమలిసి గురిగోలె మలిసి సూపెట్టిండు. నాకు గా అమ్మ సూపినట్టే కనవడ్డయి. గిండ్ల గింత మతలబుందా అనిపిచ్చింది. అమ్మ మయిమంటె గదన్నమాట. అనుకున్న. ఇగ గప్పట్నుంచి గిప్పట్రాక గసోంటియి నమ్ముతలేన్నేను. శనార్తులు.

-డా ॥కాలువ మల్లయ్య, 98493 77578