Friday, April 19, 2024

కాలగతిపై కాంతి స్పర్శ ‘ప్రాణదీపం’

- Advertisement -
- Advertisement -

Touch of light on time Pranadeepam

కూచోబెట్టి బొమ్మ గీసిచ్చే చిత్రకళ మాదిరే కవిత్వం కూడా ఓ అరుదైన విద్యనే. అది అబ్బినవాడికి కొంచెం సమయమిస్తే చాలు అక్షరాలతో ఓ భావనను మూస పోస్తాడు. వర్తమాన కాలపరిస్థితులు కవిని కదిలించడమో లేదా కవి తానుగా స్పందిచడమో జరగ్గానే నిశ్చల నీళ్లలో రాయి విసిరినట్లు అలలు అలలుగా కవితావృత్తాలు రూపుదిద్దుకుంటాయి. అందుకే కవిత్వానికి సంవేదన ప్రాథమికం. పాండిత్యం ద్వితీయం. లోతైన భావనను మాములు మాటల్లో చెప్పినా అది నిలుస్తుంది. ఒకరు చెప్పిందే మళ్ళీ చెప్పడానికి మాత్రం కవి పద ప్రకర్షను ఆశ్రయించక తప్పదు. తెలిసి రాసిన కవికి,అరువు తెచ్చుకున్న భావనకి మధ్య ఈ వ్యత్యాసం కనబడుతుంది. కవిత్వం ఎంత వస్తున్నా అనుభవసార వ్యక్తీకరణయే మిగులుతోంది. ఈ మిగులు గుణం ఉన్న కవిత్వం గాజోజు నాగభూషణం సంపుటి ’ప్రాణదీపం’లో ఉంది.
కవి, గాయకుడు అయిన గాజోజు కవిత్వంలో శ్రామిక పక్షపాత మానవీయ కోణముంది. ధిక్కారముంది, ఆవేదన ఉంది. ఈ కవిత్వం కవి నమ్మి నిటారుగా పట్టుకొన్న భావజాలపతాకానికి ఊతమిస్తుంది. ఇందులోని చాలా కవితలకు ప్రత్యేక తనదైన ప్రయోజనముంది. ఒక వీర మరణం, ఒక నిర్బంధ వేదన, దూరమైన మిత్రుడి జ్ఞాపకంలాంటి తల్లడింపులు అక్షరాలా సాలుగా మారినప్పుడు కవి స్వరం సాధారణ మనిషి భాషా స్థాయికి ఎదుగుతుంది. గాఢ పదాల చికాకు లేకుండా ఎదురైనవాడికి అలై బలై ఇస్తుంది.
తనకిష్టమైన కవి అనుభవిస్తున్న కారాగార కాఠిన్యాన్ని తట్టుకోలేక ’కలాలు కన్నీళ్లు పెడుతున్నాయి/ తుడిచే ఆ చేతుల సంకెళ్లు తెంపేయరూ..’ అనడంలో సాటి మనిషి సాయాన్ని కోరినట్లు భేషజాల్లేని వేదన నిండిన భాష ఉంది. అదే సాధారణీయత కరోనా వలస కార్మికుల బాధలు చూసి రాసిన ’కాళ్లల్లో తిరిగేటి పిల్లి పిల్లకు కంకెడు / ముద్ద వేసిన కారుణ్యమెటువాయె’లో ఉంది. బడి నారు మడి కావాలి కవితలోనూ ’ఏమున్నది చూసుకోవడానికి / మా ముఖాలను మేమే’ అనడంలోనూ తోటి మనిషి ముచ్చట చూడవచ్చు.
ఈ సంపుటిలోని చాలా కవితలు తప్పక స్పందించాల్సిన భిన్న సందర్భాల్లోంచి పుట్టినవే. జార్జి ఫ్లయిడ్ మరణానికి స్పందిస్తూ కవి ’ఇప్పుడు వీస్తున్న గాలి / నలుపు సుగంధాన్ని అద్దుకున్న గెలుపుకేళి’ అంటాడు. లోక్ సత్తా శీనన్న యాదిలో ’హక్కుల రెక్కలు తెగకుండా కాపాడేదెవరు?’ అని వేదన చెందుతాడు. పాత్రికేయ మిత్రుడి తౌటు నాగభూషణం స్మరణలో ’అనంత ఆకాశంలో / అక్షరనక్షత్రమై వెలుగుతూనే ఉంటావు’ అని ఆశిస్తాడు. అమరుడు మచ్చ ప్రభాకర్ ను ’జీవికకోసం జీతగాడైనా చోట / జీవన విలువల్ని నాటినవాడు’ అని కీర్తిస్తాడు.
ముంబైని చూడగానే ’పచ్చలహారంలా తళుకులీనుతున్న నీ తనువుపై / పుట్టుమచ్చలై ఒదిగి ఉన్నవాళ్లను / కండ్లల్ల వెట్టుకొని కాపాడుకో తల్లీ?’ అని వేడుకొంటాడు. కళ్లారా ఉస్మానియా క్యాంపస్ ను చూడగానే అక్కడి విద్యార్థులు ’కాలం కర్తవ్య కెరటమై తరిమినప్పుడల్లా / లాఠీలకు, తూటాలకు ముచ్చెమటలు పట్టించేవాళ్ళు’గా దర్శనమిస్తారు. సాటి కవి మిత్రుడు కందుకూరి అంజయ్య పదవీ విరమణ కూడా గాజోజుకు కవితార్హమే. ’ఇద్దరి ఎదలయలదీ ఒకటే క్షతగాత్రగానం’ గుర్తు చేస్తాడు. కవి, రచయిత నలిమెల భాస్కర్ ను భాషల చెట్టుగా అభివర్ణిస్తూ ’కలాలు ముక్కున కరచుకొని / కవన గూటిని అల్లుకుందామని / ఎన్ని పిట్టలు ఈ చెట్టుపై వాలాయో’ అని అభినందిస్తాడు. కూరగాయల అంగడిని ’ఆకుపచ్చ ఎడారి’తో పోలుస్తూ ’నా చూపులన్నీ / కొనేవాటికంటే / కొడికట్టిన దీపాల మీదనే వాలుతాయి’ అని మనకు కొత్త చూపునిస్తాడు. తన అధ్యాపక వృత్తిని ప్రేమిస్తూ ’నలుదిశల పరీవ్యాప్త మేధోవికసిత కాంతిని / నాలుగు గోడల నడుమ పరావర్తనం చెందించి / నా నీడను బతుకు పాఠాల జాడగా మారుస్తున్న / బాల బుద్దుల బోధి వృక్షాన్ని’ అనడంలో ఓ బాధ్యత ఉంది.
కొన్ని కవితలు తన జీవనయానంలోంచి ఏరుకున్నవి. ప్రాణదీపం, అమ్మమ్మ ఊరు, రేపటి కవిత, పునరుత్తానపుష్పం ఇలా కొన్ని. వీటిలో సంపుటి శీర్షికగా వెలుగుతున్న ’ప్రాణదీపం’ కవి తన తల్లి మరణం తాలూకు ఎడబాటును గుర్తుచేసుకుంటూ కూర్చిన వేదనాభరిత అక్షరాలు.
నిజానికి కవిత్వంలో సాధారణ పదజాలం సృష్టించినంత మార్మికత, కలుపుగోలుతనం భారీ వ్యక్తీకరణలో కనిపించదు. దీనికి ఈ సంపుటిలోని చాలా కవితల్లో ఆ దగ్గరితనం ఉన్నా కొన్ని చోట్ల అనవసర గాంభీర్యత పొడసూపింది.’కళకళలాడిన జీవనసోయగం కళేబరమై / నిర్జీవ భవన సమాధులు వెలసిన స్మశానమయ్యింది’, ’నీ మరణవేదన మానవ సమూహాల / రణ చరణ నిస్వన నినాదమయ్యింది’ లాంటి పంక్తులను సులభ భాషలో చెప్పడం వీలు కాదా అనిపిస్తుంది. ’రక్త సముద్రాలై ఉప్పొంగిన నరాలు / తెగిన వీణియ నాదాలవుతున్నాయి’ అనే పాదాల్లో కవి ఆంతర్యంపై పదాల భారం సుస్పష్టం. కొన్ని పదాలు వాడి వాడి మొండిబారినయేమో అనేది కూడా కవులు ఆలోచించాలి. ఉదాహరణకు ’అలౌకికానందానుభూతులు, నిబిడాంధకారం, మస్తిష్కాంతర, పరిస్వంగం, విస్ఫోటనం, సుప్తచేతనావస్థ, నిశీధి, వైయక్తికం’ లాంటి పదజాలాన్ని సరళీకరించుకోవాలేమో అనిపిస్తోంది.
కవిత్వం పట్ల గాజోజు నాగభూషణం కు ఉన్న స్పష్టత ఆయన ’ కవిత్వాన్ని ప్రేమించడమంటే.. జీవితాన్ని ప్రేమించడమే!’ అనే మాటల్లోనే తెలుస్తోంది. ’నేను కవిత్వాన్ని ప్రేమిస్తాను. నేను రాసిందని కన్నా.. నా జీవితాన్ని ప్రభావితం చేసిన ఎందరో ప్రతిభావంతుల కవిత్వాన్ని మరింత ఎక్కువగా’ అనడంలో నిజాయితీ ఉంది. తన కవిత్వం, జీవితం వేరు వేరు కాదు అని ప్రకటించేందుకు కవికి ఊగిసలాటలేని సంకల్పం కావాలి. అది కవిత్వంలోకి తర్జుమా కావాలి. ఆ రూపాంతర సారమే ’ప్రాణ దీపం’ చమురుగా వెలుగులీనుతోంది. అన్నవరం శ్రీనివాస్ వేసిన పల్లెలో పొద్దుపొడుపు ముఖచిత్రం సహజ వర్ణాలు, చలనశీల రేఖలతో పలకరిస్తుంది.

ప్రాణదీపం (కవిత్వం)
రచన: గాజోజు నాగభూషణం
పేజీలు 170, వెల: రూ. 150 /-
ప్రచురణ: తెలంగాణ రచయితల వేదిక
ప్రతులకు: మునుగంటి శోభారాణి, కరీంనగర్
సెల్. 9885462052

బి.నర్సన్
94401 28169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News