Home ఎడిటోరియల్ కశ్మీర్ పర్యా‘టంకం’!

కశ్మీర్ పర్యా‘టంకం’!

Kashmir-Cartoon

కశ్మీర్ లోయలో హింసాకాండ వ్యాపించడంతో ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పర్యాటక రంగం ఈ ఏడాది నష్టాల్లో పడింది. 2016లో సుమారు 13 లక్షల మంది పర్యాటకులు జమ్ము-కశ్మీర్ రాష్ట్రాన్ని సందర్శించారు. టూరిస్టుల రాక అత్యధికంగా ఉండే వేసవిలో ఈ ఏడాది వారి సంఖ్య కేవలం కొన్ని వేల మందే. ముఖ్యంగా శ్రీనగర్‌లోని దాల్ లేక్‌లో పడవలు నడిపేవారు గిరాకీ కొరవడి భారీగా ఆదాయ నష్టాన్ని చవి చూశారు. జమ్ము – కశ్మీర్ స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)లో 8 శాతం వాటా పర్యాటక రంగం నుంచే వస్తోంది.
గత ఏడాది ఇదే కాలంలో టూరిస్టుల రద్దీ చాలా హెచ్చుగా ఉంది. సరస్సులో విహరించడానికి, సమీపంలోని జాబర్వాన్ కొండలను తిలకించడానికి ఈ ప్రాంతానికి టూరిస్టుల రద్దీ హెచ్చుగా ఉంటుంది. మీడియా వార్తలకు భయపడి టూరిస్టులు రావడం మానుకున్నట్లు పడవలు నడిపేవారు చెప్పారు. టివిలో వార్తలు తిలకించి కశ్మీర్ తగలబడుతోందన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారని వారు అంటున్నారు. 2016 జూలైలో యువ మిలిటెంట్ బుర్హాన్ వనీని పోలీసులు కాల్పుల్లో మరణించిన ఘటన తర్వాత కశ్మీర్ లోయలో దీర్ఘ కాలంగా పాటు హింసాకాండ కొనసాగుతున్నది.
రోజుకు ప్రతి పడవపై రూ.1000 నుంచి రూ. 1500 ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రోజుకు రూ. 400 ఆదాయం రావడం గగనంగా వుంది. శ్రీనగర్‌కు ఏడు కి.మీల దూరంలోని సైదా కదల్ రోడ్‌లో తివాచీలు, శాలువల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ‘కోట్లాది రూపా యల రగ్గులు, శాలువలు, తివాచీలు అమ్ముడుకాకుండాపడి ఉన్నాయి. వేసవి గిరాకీ తట్టుకోవడానికి కిందటి శీతాకాలంలోనే చేతి వృత్తుల వారికి ఆర్డర్లు ఇచ్చి సరుకు తయారు చేయించామని, వేసవిలో పరిస్థితులు ఇంత ఘోరంగా ఉంటాయని ఊహించలేదని రగ్గులు, శాలువల వ్యాపారులు వాపోతున్నారు. ఈ రంగంలో దాదాపు లక్ష మంది కార్మికులు నేరుగా, పరోక్షంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
శ్రీనగర్ సమీపంలో 2008లో వచ్చిన మరో పర్యాటక కేంద్రం 33 హెక్టార్లలో వెలసిన ‘తులిప్ గార్డెన్’. ఈ కేంద్రానికి కూడా మీడియా ప్రచారాలకు భయపడి పర్యాటకుల రాక బాగా తగ్గి పోయింది. శాంతి భద్రతల సమస్య ప్రభావం పర్యాటక రంగంపై తీవ్రంగా ఉంటుంది. ఇటీవల కొన్ని నెలలుగా జాతీయ మీడియాలో కశ్మీర్‌లోయలో హింసాకాండ వార్తలు ప్రముఖంగా వచ్చాయి. ఏప్రిల్ నుంచి జూన్ మొదటి వారం దాకా కేవలం కొన్ని వేల మంది మాత్రమే పర్యాటకులు లోయను సందర్శించినట్లు అధికార్లు తెలిపారు.
ఇటీవల కొన్నేళ్లుగా లోయలో తిరుగుబాటుతో చెలరేగే హింసా కాండ తగ్గింది. వీధుల్లో హింసాకాండ మాత్రం పెరిగింది. ముఖ్యంగా రాళ్లు విసరడం పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ రకం హింసా కాండ చెదురు మదురుగా జరిగిందని ‘టూర్ ఆపరేటర్లు’ వివరిం చారు. అది పర్యాటకులను భయపెట్టేంత భీకరమైన హింసాకాండ కాదని, కేవలం స్థానికమైనదని కూడా వారు చెప్పారు. అయితే మీడియా ప్రచా రం వల్ల పర్యాటకులు భయభ్రాంతులయ్యారని వారు ఆరోపించారు. పర్యాటకులను పెద్దదిగాని, చిన్నదిగాని – ఎటువంటి సమస్య అయినా భయపెట్టి తీరుతుంది. ఈ నెల భార్యాబిడ్డలతో జరపవలసిన కశ్మీర్ పర్యటనను ఒక బెంగుళూరు నివాసి రద్దు చేసుకున్నాడు. ముందే రిజర్వు అయిన టికెట్లను కాన్సిలేషన్ ఛార్జీలకు భయపడక ఆయన రద్దు చేసుకున్నారు. దీనికి కారణం కశ్మీర్ పరిస్థితిపై భయాలే. టూరిస్టులు శ్రీనగర్‌లో దాల్ లేక్‌తో పాటు నాగీన్ సరస్సును, సోనామార్గ్‌లో బసను బాగా ఇష్టపడతారు. టూర్ ఆపరేటర్ అక్కడి పరిస్థితులు భద్రతకు అనుగుణంగానే వున్నాయని హామీ ఇచ్చినా ధైర్యం లేదని ఆ టూరిస్టు తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతి భద్రతల పరిస్థితికి, పర్యాటకుల రాకకు మధ్య నేరుగా సంబంధం ఉంటోంది. 1988 దాకా ఆ రాష్ట్రం దేశంలో, ప్రపంచంలో పర్యాటకుల స్వర్గ ధామంగా విలసిల్లింది. అప్పట్లో ఏడాదికి 7 లక్షల మంది దాకా టూరిస్టులు రాష్ట్రాన్ని సంద ర్శించే వారు. కానీ సాయుధ హింసాకాండ మొదలయ్యాక వారి సంఖ్య 1989లో 2 లక్షలకు పడిపోయింది. 1990లో 4,211; 1991లో 3,780 హింసాత్మక ఘటనలు కశ్మీర్ లోయలో చోటు చేసుకొనడంతో పర్యాటకుల సంఖ్య 98 శాతం పడిపోయి ఆ సంఖ్య 6,287 కు దిగిపోయింది. 1995లో హింసాకాండ తగ్గడంతో 8 ఏళ్ల గవర్నర్ పాలనకు అంతం పలికి, 1996లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉనికి పర్యాటకులకు ధైర్యాన్ని ఇచ్చింది. 1998లో దాదాపు లక్షమంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారు. 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ తో సంబంధాలు పూర్తిగా చెడిపోయి యుద్ధ వాతావరణం నెలకొంది. అదే ఏడాది సెప్టెంబర్‌లో జమ్ము-కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి నప్పుడు కూడా హింస ప్రజ్వరిల్లింది. దీనితో 2002లో టూరిస్టుల రాక 27,356కి పడిపోయింది. 2003లో భారత, పాకిస్థాన్‌ల మధ్య శాంతి ప్రక్రియ మొదలయ్యాక 2012 దాకా పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వచ్చి 1.3 మిలియన్ అయింది. 2014 సెప్టెంబర్‌లో వరదల వల్ల కశ్మీర్ ఛిన్నాభిన్నం కావడంతో మరుసటి ఏడాది టూరిస్టుల సంఖ్య మిలియన్ దిగువకు తగ్గింది.
శ్రీనగర్‌లో ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో హోటళ్ల లో చేరే వారి సంఖ్య 2016లో కంటే 70-80 శాతం పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో ‘గదులు ఖాళీగా లేవు’ అని ప్రకటించిన హోటళ్లు ఈ ఏడాది పర్యాటకుల కోసం ఎదురు చూశాయి. హోటళ్లలో మొత్తం 80 గదులకు కేవలం 15 మాత్రమే భర్తీ అవుతున్న పరిస్థితి ఉంది. కశ్మీర్ పరిస్థితిపై ప్రచార సాధనాలు ఇటీవల కాలంలో కొంచెం అతి ప్రదర్శించాయని, శాంతి భద్రతలపై లేనిపోని ప్రచారాలు చేశాయని టూరిజంపై ఆధారపడిన పలు వ్యాపార సంస్థలు విచారం వ్యక్తం చేశాయి. మార్చి నుంచి టివి చానళ్లు శాంతి భద్రతల స్థితి భీకరంగా ఉన్నట్లు ప్రచారం చేశాయని పలువురు వ్యాపారులు తెలిపారు. ప్రచార సాధనాలు ‘కశ్మీర్ బాయ్‌కాట్’ ను ప్రోత్సహించాయని టూర్ ఆపరేటర్లు కూడా విమర్శించారు. ‘భారతీయ పతాకాలను తగులబెట్టే చోటుకి వెళ్లవద్దు’ అంటూ ప్రచారాలు కూడా చేశాయని, వాట్సాప్, ఇతర సామాజిక ప్రచార సాధనాలు కూడా అదే దారి అనుసరించాయని వారు వాపోయారు. చెదురు మదురు ఘటనలకు తీవ్రవాద కార్యకలాపాల రంగును ప్రచార సాధనాలే పులిమాయని కశ్మీర్ పర్యాటక రంగ ప్రతినిధులు చాలా మంది ఆరోపించారు.

– అతార్ పర్వేజ్