Home జయశంకర్ భూపాలపల్లి ప్రకృతి అందాల పర్యాటకం.. బొగత జలపాతం

ప్రకృతి అందాల పర్యాటకం.. బొగత జలపాతం

Bogatha Waterfall

 

జయశంకర్ భూపాల్ పల్లి : పచ్చని ప్రకృతి.. ఎత్తైనా కొండలు.. ఆ కొండల నుంచి జాలువారుతున్న సెలయేరు లాంటి నీరు.. సమాంతరంగా ఉన్న కొండలపై నుంచి కిందికి దుంకుతున్న పాల నురుగుతో కూడిన నీటి అందాలు. అబ్బురపరిచే బోగత జలపాత ప్రకృతి సౌందర్యం పర్యాటకుల్ని కట్టి పడేస్తుంది. దీనికి తోడు మరో ప్రకృతి వరప్రదాయనిగా ఉన్న సరస్సును కీ. శ. 1312వ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకున్నదే లక్నవరం సరస్సు. కొండల నడుమ ఆనకట్టను నిర్మించి సరస్సును ఏర్పాటుచేసిన ఇంజనీరింగ్ అద్భుతం ఒకటైతే సరస్సులోని ఎత్తైన ఏడు కొండలు సరస్సు అందాలకు కొత్తదనం తీసుకొస్తుంది. సరస్సు మధ్యలో ధివిని మరిపించే రీతిలో టూరిజం శాఖ ఏర్పాటుచేసిన సౌకర్యాలు పర్యాటకుల్ని కట్టి పడేస్తున్నాయి.

బోటు షికారులో ధివికి వెళ్లిన పర్యాటకులకు అదొక ధివితో కూడిన దేశమన్న సంతృప్తి. వరంగల్ ఉమ్మడి జిల్లా ములుగు జిల్లా పరిధిలోని లక్నవరం, బోగత జలపాతం తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. నాలుగు రాష్ట్రాల నుంచి ఈ రెండు పర్యాటక కేంద్రాలకు నిత్యం వేలాది సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బోగత జలపాతం, లక్నవరం సరస్సులు ఉప్పొంగుతున్నాయి. దేశంలో 8వ ఎత్తైన జలపాతంగా బోగత జలపాతం పేరు ఎన్నిక కల్గింది.

ప్రకృతి ఒడికి నిలయం లక్నవరం సరస్సు..

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామం శివారులోని బుస్సాపూర్ క్రాస్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో సరస్సును నిర్మించారు. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఆ ప్రాంతంలో ఉన్న నీటి వనరుల్ని గుర్తించి కొండల నడుమ లక్నవరం సరస్సును నిర్మించారు. నాటి సరస్సు నిర్మాణం నీటి 35 ఫీట్ల సామర్థం 8,700 ఆయకట్టుకు సాగునీరందించడానికి ఏర్పాటుచేశారు. కాకతీయ రాజులు కళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే వారు. లక్నవరం సరస్సు నిర్మాణం రైతాంగం కోసమే ప్రత్యేక శ్రద్ధ కనబర్చినట్లు కనబపడుతుంది. ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజీనిరింగ్ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది.

సాధారణంగా కాకతీయ రాజులు సరస్సులతోపాటు కొనేరు, దేవాలయాల్ని నిర్మించే వారు. ఇక్కడ మాత్రం రైతుల కోసమే సరస్సు నిర్మాణం రైతుల వరప్రదాయనిగా ఉంది. సరస్సు నిర్మాణ సమయంలోనే సాగునీటి కోసం రంగాపూర్, శ్రీరాంపతి, నర్సింహులపేట లాంటి నాలుగు ప్రధాన కాలువల్ని నిర్మించారు. ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంత లోతట్టు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఈ సరస్సు నిండుతుంది. సరస్సుకు తొమ్మిది ప్రధాన తూములను నిర్మించారు. ఆ తూముల ద్వారా నీటిని విడుదల చేసి సమీపంలోని సద్దిమడుగు రిజర్వాయర్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ఆయకట్టు పొలాలకు నీటిని అందించడం సరస్సు ఉద్దేశం అయితే, పర్యాటకంగా సరస్సును అభివృద్ధి చేశారు. చెరువు కట్ట నుంచి సరస్సులోకి సస్పెన్షన్ బ్రిడ్జిలను నిర్మించారు.

అక్కడే హరిత కాకతీయ ఆధ్వర్యంలో రెస్టారెంట్ నిర్మించారు. అక్కడి నుంచి సరస్సు మధ్యలో ఉన్న కొండల్లో గ్రీన్ హట్స్‌తోపాటు పార్కులను కూడా ఏర్పాటుచేశారు. అక్కడికి వెళ్లడానికి ప్రత్యేక బోట్లను ఏర్పాటుచేశారు. పర్యాటకులు రోజుల తరబడి సరస్సు నీటి మధ్యలో ఉన్న రెస్టారెంట్‌లో ఉండటానికి సౌకర్యాలు చేపట్టారు. సరస్సు మధ్యలోని కొండల్లో ఉన్న రెస్టారెంట్లలో గడిపిన వారికి ఒక ప్రత్యేక ధివి సీమలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

అబ్బుర పరుస్తున్న బోగత జలపాతం

ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురం గ్రామ శివారులోని అడవుల్లో వెలసిన జలపాతమే బోగత జలపాతంగా ప్రసిద్ధి గాంచింది. దేశంలోనే 8వ ప్రముఖ జలపాతంగా గుర్తింపు పొందిన బోగత ఉమ్మడి రాష్ట్రంలో ప్రచారంలోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016–17లో ముఖ్యమంత్రి కేసీఆర్ బోగత జలపాతాన్ని ప్రపంచ పటంలో పెట్టి రూ. 12 కోట్ల నిధుల్ని కేటాయించి పర్యాటకులకు సౌకర్యాల్ని కల్పించారు. వాటిలో ట్రెక్కింగ్, పగోడాలు, వాచ్ టవర్, రెస్టారెంట్, మరుగుదొడ్లను నిర్మించారు. జులై నెల నుంచి డిసెంబరు వరకు బోగత జలపాతం నిత్యం వాటర్స్ ఫాల్స్ రూపంలో దర్శనమిస్తుంది. అక్కడ జాలువారుతున్న నీటిలో సేద తీరడానికి పర్యాటకులు భారీ ఎత్తున వస్తున్నారు.

దేశంలోనే 8వ ఎత్తైన జలపాతంగా ఉన్న బోగతను అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ రాష్ట్రా సరిహద్దు అడవుల్లోని పాములూరు గ్రామ శివారులో పుట్టిన వాగు పెనుగోలు చీకుపల్లి వద్ద జలపాతంగా మారి కనువిందు చేస్తుంది. అక్కడ నుంచి కింద సమాంతరంగా ఉన్న బోగత గుట్టలపై ఆరు నెలల పాటు భారీ ఎత్తున జలధార పడుతుంది. ఆ నీటితో పరుపు బండలాగా ఉన్న బోగత గుట్టలపై నుంచి జాలువారుతున్న నీరు అద్భుతాన్ని మరిపిస్తుంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పర్యాటకుల కోసం అనేక ఏర్పాట్లు, సౌకర్యాలు చేపట్టారు.

జలపాతంలోకి పర్యాటకులు వెళ్లి మృతిచెందిన సంఘటనలు గుర్తించిన ప్రభుత్వం చుట్టూ కంచెను నిర్మించారు. వచ్చిన జలపాతం నీరు చుట్టూ ఆవరించి ఉన్నందున పర్యాటకులు, పిల్లల కోసం ప్రత్యేకంగా కొలనులను ఏర్పాటుచేశారు. వాటితోపాటు పగోడాలు, పిల్లల పార్కు, బట్టర్‌ఫ్లై పార్కు, సాహస క్రీడలకు వేదికగా మలిచారు. నీటిలోనే జిప్ సైకిల్, జిప్ లైన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రకృతిపరంగా ఉన్న వాటర్ ఫాల్స్ అందాలతోపాటు పర్యాటకంగా చేస్తున్న అభివృద్ధితో వచ్చిన పర్యాటకులు తన్మయత్వంతో సేద తీరుతున్నారు. గత రెండు రోజుల నుంచి బోగతకు రోజుకు 10 వేల మందికి పైగా పర్యాటకులు రావడం విశేషం.

లక్నవరం.. బోగతకు ప్రత్యేక ప్యాకేజీ

ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా ఉన్న లక్నవరం సరస్సుతోపాటు బోగత జలపాతానికి టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటుచేశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ అక్కడి నుంచి లక్నవరం అక్కడి నుంచి బోగతకు చేరుకునేందుకు ఈ ప్యాకేజీని రూపొందించారు. దానికి సంబంధించిన వెబ్‌సైట్ www.tstdc.in ద్వారా బుక్ చేసుకోవచ్చు. లక్నవరం, తాడ్వాయి వన కుటీరాల సందర్శనకు టూరిజం శాఖ ప్యాకేజీని ఏర్పాటుచేసింది. దానికి సంబంధించిన వెబ్ సైట్ www.ecotourism.bhupalpally.com ద్వారా బుక్ చేసుకోవచ్చు.

రవాణా సౌకర్యాల వివరాలు

ములుగు జిల్లాలోని లక్నవరం, బోగత పర్యాటక ప్రాంతాలకు హైదరాబాద్, వరంగల్ నుంచి పర్యాటకుల సంఖ్య భారీ ఎత్తున ఉంది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న పర్యాటకులు హన్మకొండకు చేరుకుని అక్కడి నుంచి ఏటూరునాగారంకు 135 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఏటూరునాగారం నుంచి బోగతకు 24 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. హైదరాబాద్ టు వరంగల్, ఏటూరునాగారం నుంచి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. ఏటూరునాగారం నుంచి వాజేడు మండలం జగన్నాథపురం మీదుగా బోగత జలపాతానికి చేరుకోడానికి ఆర్టీసీ, ఇతర ప్రయివేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. లక్నవరం సరస్సుకు హైదరాబాద్ నుంచి హన్మకొండ చేరుకుని అక్కడ ఏటూరునాగారం బస్సు ద్వారా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చేరుకోవాలి అక్కడ నుంచి ప్రయివేటు వాహనాల్లో సరస్సుకు చేరుకోవచ్చు.

ఇదిలా ఉంటే పర్యాటకులు విడిది చేయడం కోసం వరంగల్, హన్మకొండలోని పర్యాటక శాఖకు చెందిన హరిత కాకతీయ హోటల్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నేరుగా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వాటితో పాటు వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాల్లో పది ప్రముఖ హోటల్లో సౌకర్యం ఉంది. హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వరంగల్ చేరుకున్న పర్యాటకులకు లక్నవరం, బోగత జలపాతానికి వెళ్లడానికి కావల్సిన టూరిస్టు ఏసీ బస్సులు, కార్లు హోటల్ హరిత కాకతీయలో అందుబాటులో ఉంటాయి.

Tourist buzz at Bogatha Waterfall