Home బిజినెస్ మూడేళ్ల గరిష్టానికి వాణిజ్య లోటు

మూడేళ్ల గరిష్టానికి వాణిజ్య లోటు

bsns

2017 డిసెంబర్‌లో 14.88 బిలియన్ డాలర్లకు పెరుగుదల

న్యూఢిల్లీ : డిసెంబర్‌లో దేశీయ ఎగుమతులు ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ దిగుమతులు మాత్రం మరింతగా పెరుగుతూ పోతున్నాయి. దీని పర్యవసానంగా దేశీయ వాణిజ్య లోటు మూడేళ్ల గరిష్టా నికి చేరుకుంది. గత నెలలో ఎగుమతులు 12.3 శాతం పెరిగి 27 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అదే సమయంలో బంగారం, క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు.. దిగుమతులను పెంచేశాయి. దీంతో డిసెంబర్‌లో దిగుమతులు 21.1 శాతం పెరిగి 41.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీని కారణంగా 2016 డిసెంబర్‌లో 11.5 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ వాణిజ్య లోటు 2017 డిసెంబర్‌లో 14.88 బిలియన్ డాలర్లకు చేరింది. 2014 నవంబర్‌లో వాణిజ్య లోటు 16.2 బిలియన్ల స్థాయిలో ఉంది. బంగారం, క్రూడాయిల్ దిగుమతుల భారం పెరగడంతో వాణిజ్యలోటు పెరిగిందని వాణిజ్య శాఖ వెల్లడించింది. గత నెలలో దేశీయ దిగుమతులు 2016తో పోలిస్తే 21.1శాతం పెరిగి 4,190 కోట్ల డాలర్లకు చేరాయి. అయితే దేశీయ దిగుమతులు పెరగడం ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరగడానికి సంకేతమని బ్రోకరేజ్‌సంస్థ నోమురా అభిప్రాయపడింది. గత డిసెంబర్‌లో బంగారం దిగుమతి అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 71.5 శాతం పెరిగింది. వరుసగా రెండునెలల పతనం తర్వాత బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరిగాయి. మరోవైపు చమురు దిగుమతి 2016 డిసెంబర్‌తో పోలిస్తే 35 శాతం పెరిగి 1034 కోట్ల డాలర్లకు చేరింది. క్రూడ్ ఆయిల్ ధరలు గతనెల్లో భారీగా పెరగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. దేశ దిగుమతుల్లో ఎక్కువ శాతం వాటా చమురుదే కావడం, వీటి ధరల్లో ఒక్క డాలర్ పెరిగినా దిగుమతుల బిల్లులో 156 కోట్ల డాలర్ల భారం పెరుగుతుందని ఎస్‌బిఐ అంచనా వేసింది. ఇక గత డిసెంబర్‌లో ఎగుమతులు 12.36 శాతం పెరిగి 2703కోట్ల డాలర్లకు చేరగా, గత అక్టోబర్ నుంచే ఎగుమతులు కాస్త ఊపందుకున్నాయి. ఎగుమతుల్లో అధికభాగం ఇంజనీరింగ్ గూడ్స్.. గతనెల 25.32 శాతం వృద్ధి నమోదు చేశాయి. విలువైన రాళ్లు, ఆభరణాలు, పెట్రోఉత్పత్తులు, సేంద్రీయ, నిరీంద్రయ రసాయనాల ఎగుమతులు కూడా వృద్ధి నమోదు చేశాయి. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వాణిజ్య లోటుకు కారణమవుతోంది.