Home ఎడిటోరియల్ ఆర్‌సెప్ రహిత ఆర్థిక వ్యవస్థ

ఆర్‌సెప్ రహిత ఆర్థిక వ్యవస్థ

Cartoon

 

భారత ప్రభుత్వం ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్.సి.ఇ.పి.) నుంచి విరమించుకోవడాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వం కుదుర్చుకునే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు తమ జీవనోపాధిపై ప్రభావం చూపించిన నేపథ్యం లో ప్రజలు ఇచ్చిన ఓటు తీర్పు కారణంగా అనుకోవాలా? లేదా ప్రభుత్వం ప్రాంతీయంగా ఆర్థిక ఆధిపత్యం ప్రదర్శించడానికి ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయంగా భావించాలా? లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించే వారు బలవంత పెట్టినందువల్ల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం నుంచి వైదొలగారనుకోవాలా? కారణం ఏమైనప్పటికీ ప్రపం చం వాణిజ్యంలో అయిదింట రెండు వంతులుగా ఉన్న భాగస్వామ్యం నుంచి విరమించుకోవడానికి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు అభినందించవలసిందే. దురదృష్టవశాత్తు చారిత్రక దృష్టితో చూస్తే ప్రభుత్వ నిర్ణయం ఆమోద యోగ్యమైంది కాదు. ప్రభుత్వ నిర్ణయం రాజకీయంగా తాత్కాలికమైందే తప్ప నిర్దిష్టమైన ఆర్థిక సమీకృత ‘విధానం’ అయితే కాదు.

అనేక ఇతర ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాల లాగే ఆర్.సి. ఇ.పి. కూడా ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) కేంద్రగా ఉన్నదే. ఆసియాన్ లో కొన్ని దశాబ్దాలుగా వాణిజ్యానికి సంబంధించి అనేక చర్చలు జరిగాయి. వ్యూహాలు అనుసరించారు. బలవంతాన సరుకు దిమ్మరించడం మొదలైన సమస్యలను పరిష్కరించడంలో ఆసియాన్ విఫలమైంది. సింగపూరు తో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమూ ఉంది, రెండు వైపులా పన్ను విధించడాన్ని నివారించే ఒప్పందమూ ఉంది. అయినా సింగపూర్ ద్వారా చైనా చౌకగా తయారయ్యే తన సరుకులను దిమ్మరిస్తూనే ఉంది. ఇది సరైంది కాదు అని గుర్తించినా నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది.

భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో ‘సరుకు ఎక్కడిది’ అన్న అంశం లేనందువల్ల సరుకు ఎక్కడి నుంచి దిమ్మరిస్తున్నారో చెప్పడం కష్టం. ఆర్.సి.ఇ.పి.లో ఇలాంటి నిబంధన ఉండాలను భారత్ పట్టుబడుతోంది. అందువల్ల ఆర్.సి.ఇ.పి నుంచి వైదొలగడం భారతం అవకాశం విడనాడుకున్నట్టేనా? దీనివల్ల ఆర్.సి.ఇ.పి. నుంచి విరమించుకోవడంవల్ల ప్రాంతీయ వాణిజ్య భాగస్వామిగా ఉన్న విశ్వసనీయత దెబ్బ తింటుం దా? ఆర్థిక సంక్షేమానికి ప్రాంతీయ వాణిజ్యం అంత ప్రధానమైంది అయితే ఆర్.సి.ఇ.పి.లో ఉంటేనే అవసరమైన నిబంధనలు అమలు అయ్యేట్టు చూడకుండా ఎందుకు విరమించుకున్నట్టు?

ఆసియాన్ కానీ, ఆసియాన్ నేతృత్వంలో ఉన్న ఆర్.సి. ఇ.పి. కానీ సహజంగా భారత్ కు వాణిజ్య భాగస్వామి కావడానికి వీలైంది కాదు అని వాదించే వారూ ఉన్నారు. లేదా భారత్ తో చైనాతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకునే స్థితి లేదు. ఆసియాన్‌లోని దేశాలతో అందులోని (ఆర్.సి.ఇ.పి.తో సహా) దేశాలతో భారత్ వాణిజ్యం ఈ ప్రాంతంలోని మొత్తం దేశాలతో కొనసాగిస్తున్న వాణిజ్యం కన్నా ఎక్కువ. ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం అనుకున్నా ప్రపంచ వాణిజ్యంలో ఆసియాన్ వాటా 7 శాతం మాత్రమే. ఆసియాన్ అవతరించి అయిదు దశాబ్దాలైనా వాణిజ్యం మాత్రం అవసరమైనంత పెరగలేదు. మొత్తం ఆసియాన్ వాణిజ్యంలో భారత వాటా కేవలం 2 నుంచి 3 శాతం మాత్రమే ఉంది. వాణిజ్యంలో ఇంత తక్కువ వాటా ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి భారత్ ఆ సంఘం చర్చల్లో పాల్గొంటూనే ఉంది. ఇక ముందు కూడా పాల్గొనవచ్చు. ఆర్.సి.ఇ.పి.లో సభ్యత్వం లేక పోయి నా ఆసియాన్ చర్చల్లో భాగస్వామి కావచ్చు. ఆర్.సి.ఇ.పి. నుంచి భారత్ ఉపసం హరించుకున్నందువల్ల ఆర్. సి.ఇ.పి. వాణిజ్యం మూడో వంతు తగ్గుతుంది. కానీ ఈ ప్రాంతంలోని వివిధ దేశాలతో వాణిజ్యంలో భారత్ వాటా మునుపటి రీతిలోనే ఉంటుంది.

చివరి నిమిషంలో భారత్ ఆర్.సి.ఇ.పి. నుంచి వైదొలగడం అద్భుతమైన చర్య. దీనివల్ల రాజకీయ ప్రయోజనం ఉంటుంది కాని ఆర్థిక ప్రయోజనం అంతగా ఉండకపోవచ్చు. సార్క్ దేశాలతో ఒప్పందాలు కుదిరినా ఏళ్లు గడుస్తున్నా అవి మూడు దశాబ్దాలు గడిచినా ఆరంభమే కాలేదు. పైగా సార్క్ దేశాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఆసియాన్ దేశాల వాదనలో ఆసియాన్ దేశాల్లోని వివిధ దేశాలు రాజకీయ చట్టబద్ధత కోసం ప్రయత్నమే కనిపిస్తుంది. ఇలాంటి వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నా వీటిలో భాగస్వామ్యం ఉండడం ఉదారవాద ఆర్థిక విధానాలు జోరుగా సాగినప్పుడు ఉపకరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తమ వాణిజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న దశలో ఇలాంటి ప్రయోజనాలకు అవకాశం ఉండకపోవచ్చు.

ఆర్.సి.ఇ.పి. నుంచి ఆఖరి క్షణంలో ఉపసంహరించుకుని ఆసియా పసిఫిక్ దేశాలతో సర్దుకుపోయే ధోరణిని ప్రదర్శించడంతో పాటు దేశం లోపల ‘సామాన్య మానువుడికి అనుకూలమైన’ ప్రభుత్వం కాదన్న మచ్చ చెరిపేసుకోవడానికి కూడా ప్రభుత్వ నిర్ణయం ఉపకరించింది. అయితే దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములైన వారికి కలిగే ఉపశమనం తాత్కాలికమైందే. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మక లోపాలను సరిదిద్దే అవకాశం ఆ భాగస్వాములకు లేదు. ఉదాహరణకు ఆర్.సి.ఇ.పి.లో భాగస్వామ్యం లేకపోవడంతో స్థానిక మార్కెట్లో పాలు అమ్ముకునే పాడి పరిశ్రమల వారికి కలిగే నష్టం ఏమీ లేదు. మహా అయితే దేశంలోని బడా వ్యాపారుల ప్రయోజనాలు సురక్షితం అవుతాయి.

భారత పాడి ఉత్పత్తులకు అంతర్జాతీయ పోటీ మెరుగయ్యే అవకాశం ఏమీ లేదు. ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు’ చేయడం కోసం ఎక్కువ విలువగల పంటలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అలాంటప్పుడు ఉత్పత్తిదార్లకు ప్రత్యామ్నాయ మార్కె ట్లు అందుబాటులోకి వచ్చే విధానాలు రూపొందించవలసిన అవసరం ఉండదా? ‘జాగరూకతతో కూడిన ద్వైపాక్షికత’ పేర ఉత్పత్తిదార్ల అవకాశాలను విభజించడం వల్ల ప్రయోజనం ఏమిటి? అంతర్జాతీయ వాణిజ్యం ఎంత ఆర్థికమైందో అంతే రాజకీయమైంది కూడా. అందుకే ఇలాంటి ఒప్పందాలు చేసుకునేటప్పుడు ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం తన బాధ్యతాయుత అవసరాన్ని కాపాడుకోవడంతో పాటు తన బాధ్యతను విస్మరించే పని కూడా చేయవచ్చు. ఆర్.సి.ఇ.పి. నుంచి వైదొలగిన భారత ప్రభుత్వాన్ని మెచ్చుకునేటప్పుడు జాగ్రత్త కూడా అవసరం.

Trade Liberalization Through Free Trade Agreements