Tuesday, April 23, 2024

అమెరికాతో వాణిజ్య యుద్ధం!

- Advertisement -
- Advertisement -

Trade war with America!

 

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగునపడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి. చమురు ధరలు పెరిగితే కొనుక్కోలేము, తగ్గితే కొని నిల్వ చేసుకొనేందుకు సౌకర్యాలు, స్వంత ఉత్పత్తిని పెంచుకోలేని మనం చమురు ఎగుమతి దేశాల మీద దాడి చేయటం ఏమిటి? సౌదీ అరేబియా నుంచి కొనుగోళ్లను నిలిపివేసి లేదా బాగా తగ్గించి ఇతర మార్కెట్లలో ఏ రోజు ధర ఎంత ఉంటే అంతకు కొనుగోలు చేసి మన సత్తా ఏమిటో చూపాలన్నట్లుగా వార్తలు వచ్చాయి.

స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం, వారసత్వం లేని కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు ఆ విషయం తెలుసో లేదో తెలియదు (అయినా అమెరికా ఆదేశించింది గనుక మనమే “స్వంత” నిర్ణయం తీసుకొని ఇరాన్ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాం. ఇరాక్ నుంచి గణనీయంగా తగ్గించాం.) ఇప్పుడు సౌదీ అరేబియా (నరేంద్ర మోడీ మీద గౌరవంతో సౌదీ అరేబియా మనకు రాయితీ ధరలకు చమురు విక్రయించేందుకు అంగీకరించిందని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది.)మీద కారాలు, మిరియాలు నూరుతున్నాం. వారు నందంటే నంది పందంటే పంది అని జనం కూడా మాట్లాడాలి మరి, లేకుంటే దేశభక్తి లేదని ముద్రవేస్తారు మరి !

గత కొద్ది సంవత్సరాలుగా చమురు దిగుమతి చేసుకొనే దేశంగా ఉన్న అమెరికా ఇటీవలి కాలంలో షేల్ ఆయిల్ ఉత్పత్తి కారణంగా చమురు ఎగుమతి దేశంగా మారిపోయింది. అమెరికాతో మన వాణిజ్యం కొద్దిగా మిగులులో ఉంది. కనుక తమ కంపెనీల నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, ఆయుధాలతో పాటు చమురు కూడా కొంటా రా లేదా అని అది వత్తిడి చేస్తోంది. పశ్చిమాసియా, గల్ఫ్ దేశాలు మనకు ఎప్పుడూ మిత్రులుగానే ఉన్నాయి తప్ప శత్రువులు కాదు. గల్ఫ్ దేశాల నుంచి కొనుగోళ్లు తగ్గించి ఆమేరకు అమెరికా చమురు కొనాలంటే ఏదో ఒకసాకు కావాలి. సౌదీ అరేబియా ఇటీవల చమురు ఉత్పత్తిని తగ్గించిన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. తగ్గినపుడు ఆ మేరకు మన జనానికి తగ్గించకుండా పన్నులు వేసి ఆ మొత్తాలను అదానీ, అంబానీల వంటి కార్పొరేట్లకు పన్నుల రాయితీల రూపంలో మూటగట్టి మరీ ఇచ్చారు, ఇస్తున్నారు. ఇప్పుడు చమురు ధరలు పెరిగితే ప్రస్తుతం నరేంద్ర మోడీ మత్తులో ఉన్న జనానికి అది వదిలిన తరువాత ఏం జరుగుతుందో అందరి కంటే నరేంద్ర మోడీకే బాగా తెలుసు గనుక చమురు ఎగుమతి దేశాల మీద రుసరుసలాడుతున్నారు.

గతంలో మా దగ్గర కారుచవకగా కొన్న చమురు ఉంది కదా ఆమేరకు మీ వినియోగదారులకు భారం తగ్గించండి అని సౌదీ అరేబియా సలహాయిచ్చింది. దాన్ని సాకుగా తీసుకొని వేరే మార్కెట్లలో కొనుగోలు చేయాలని మన చమురు కంపెనీలను కోరారు.పోనీ ఆ వేరే మార్కెట్లలో మన లావు పాత పోలిక వద్దు లెండి ఇప్పుడు గడ్డం పొడవు చూసి అనాలేమో ! తక్కువ ధరలకు ఏమైనా ఇస్తాయా ? ఒక్క సెంటు(మన ఏడు పైసలకు సమానం) కూడా తగ్గించవు. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారమే, డాలర్లు మరీ చెల్లించి మనం కొనుక్కోవాలి, మన పొరుగునే ఉన్న గల్ఫ్ నుంచి రవాణా ఖర్చులు తక్కువ, అదే అమెరికా నుంచి కొనుగోలు చేస్తే తడచిమోపెడంత అవుతాయి… తనది కాదు గనుక తాటిపట్ట వేసి గోక్కోమన్నాడట వెనుకటికెవడో ! అలాగే కేంద్ర పెద్దలదేముంది, భరించేది మనమే కదా ఎంతైనా, ఎక్కడి నుంచైనా తెస్తారు? చమురు కార్పొరేట్లతో వారి సంబంధాలు ముఖ్యం కదా !

మన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా స్నేహం పట్టినప్పటి నుంచీ కొంత చమురును మన రూపాయల్లో కొనే వెసులుబాటు కల్పించిన ఇరాన్‌ను వదలిపెట్టి అమెరికన్లను మెప్పించేందుకు చమురు కొనుగోళ్లను ఎలా పెంచారో తెలుసా? 201718లో రోజుకు 38 వేల పీపాల చమురు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాము. 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తం 5,45,300 పీపాలకు పెరిగింది. ప్రస్తుతం 8,67,500 పీపాలతో మొదటి స్ధానం లో ఉన్న ఇరాక్ నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించి అమెరికా మీద అధికంగా ఆధారపడే విధంగా మోడీ వేగంగా ప్రయాణిస్తున్నారు. మన పశ్చిమాసియా మిత్ర దేశాలతో చమురు వైరుధ్యం తెచ్చుకొని ఆ దారులన్నీ మూసుకున్న తరువాత అమెరికా ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ, ఎలా నిలబడమంటే అలా నిలబడాల్సిన రోజు వచ్చినా ఆశ్చర్యం లేదు. మన చమురు ఆయుధాన్ని మన మీదే ప్రయోగిస్తే చేయగలిగిందేమీ లేదు.

డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ఎవడైతేనేం అమెరికన్ కార్పొరేట్ల చౌకీదార్లు. వారికోసం ఏ గడ్డికరవమన్నా కరుస్తారు. వాటంగా ఉంటే కౌగలించుకొని మత్తులో ముంచుతారు లేకపోతే కాటు వేసి దెబ్బ తీస్తారు. ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ డిజిటలైజేషన్ గురించి ఎన్నో కబుర్లు చెబుతున్నారు. ఆయన ప్రత్యేకత ఏమంటే అసలు మన దేశంలో ఇంటర్నెట్, డిజిటల్ కెమెరా రాకముందే వాటిని ఉపయోగించి అద్వానీనే ఆశ్చర్యపరిచిన ఘనత ఆయన సొంతం. స్వయంగా ఆయనే చెప్పుకున్న విషయం, దాని మంచిచెడ్డలు వదలివేద్దాం. విదేశాలకు చెందిన సంస్ధలు మన దేశంలో డిజిటల్ సేవలను అందించి వ్యాపారం చేస్తున్నపుడు దానికిగాను డిజిటల్ సర్వీసు టాక్సు(డిఎస్‌టి) చెల్లించాలని మన దేశం 2016లోనే అనేక దేశాలతో పాటు ఆదాయం మీద ఆరు శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. అయితే అంతర్జాతీయ కార్పొరేట్ సంస్ధల వత్తిడి మేరకు మోడీ సర్కార్ దాన్ని ఆన్‌లైన్ ప్రకటనల సేవలకు మాత్రమే పరిమితం చేసింది.

తరువాత అన్ని రకాల డిజిటల్ సేవలకు గాను రెండు శాతం చెల్లించాలని గత ఏడాది మార్చి నెలలో 2020 ఫైనాన్స్ చట్టం ద్వారా నిర్ణయించింది. అలాంటి సేవలందించే సంస్ధలలో అత్యధిక భాగం అమెరికాకు చెందినవే. మన దేశం విధించిన పన్ను పరిధిలోకి వివిధ దేశాలకు చెందిన 119 సంస్ధలు వస్తాయి, వీటిలో కేవలం అమెరికా నుంచే 86 ఉన్నాయి. ఈ పన్ను అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం, అమెరికా వాణిజ్య సంస్ధల పట్ల వివక్ష చూపటమే అని అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాపితంగా డిజిటల్ ఆర్ధిక వ్యవస్ధ శరవేగంగా అభివృద్ది చెందుతున్న దశలో ఏ దేశమూ దాని ద్వారా రావాల్సిన ఆదాయాన్ని వదులుకోజాలదు. మన దేశ వినియోగదారులతో విదేశీయులు జరిపే ప్రతిలావాదేవీకి ఈ పన్ను వర్తిస్తుంది.

అమెరికా వారు ఎంత అదరగొండి బాపతు అంటే వారికి అంతర్జాతీయ చట్టాలు పట్టవు. 1974 వారు చేసిన అమెరికా వాణిజ్య చట్టంలోని 301 సెక్షన్ ప్రకారం ఏ దేశమైనా అమెరికా వాణిజ్యానికి వ్యతిరేకమైన చర్యలు తీసుకున్నదని భావిస్తే తమ స్వంత చట్టం ద్వారా విచారణ జరుపుతారట. ఆ మేరకు చర్యలు కూడా తీసుకుంటారు. మన దేశం విధించిన డిఎస్‌టి అమెరికా, తదితర విదేశీ డిజిటల్ సంస్ధలకు మాత్రమే వర్తింపచేస్తూ భారతీయ సంస్థలకు మినహాయింపు ఇవ్వటం వివక్ష కిందకు వస్తుందన్నది ఒక అభ్యంతరం. ఉదా॥ అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి వాటితో పాటు అంబానీ, అదానీ కంపెనీలు డిజిటల్ సేవలు అందించినా ఈ చట్టం ప్రకారం అదానీ, అంబానీలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రెండవది కొన్ని నాన్ డిజిటల్ సేవా సంస్థలు డిజిటల్ సేవల మాదిరి వాటిని అందచేసినా వాటికి మినహాయింపు ఇవ్వటం వివక్షాపూరితం అన్నది అమెరికా అభ్యంతరం. దీన్ని మన దేశం అంగీకరించలేదు. ఏ కంపెనీ అయినా మన దేశంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే దానికి మన దేశంలోని పన్ను చట్టాలు వర్తిస్తాయి. గనుక వాటి మీద మరొక పన్ను విధించాల్సిన అవసరం లేదన్నది మన వాదన. అమెరికా సంస్ధలు ఏవైనా మన దేశంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే అదే సూత్రం వర్తిస్తుంది.

మనకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా మన సేవల ద్వారా లాభాలు పొంది వాటిని తమ దేశాలకు తరలించుకుపోవాలన్నది విదేశీ కార్పొరేట్ శక్తుల ఎత్తుగడ. చైనా, భారత్ వంటి దేశాలలో పెద్ద ఎత్తున డిజిటల్ సేవలను విస్తరిస్తున్నందున వాటి నుంచి పన్ను ఆదాయం రాబట్టకుండా ఆర్ధిక వ్యవస్ధలు నడవవు. అనేక దేశాలు వివిధ రూపాలలో వస్తు, సేవల మీద పన్నులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు చైనాలో డిఎస్‌టి లేదు. చైనాకు చెందిన అలీబాబా వంటి సంస్థలు డిజిటల్ సేవలు అందిస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం 18 రకాల పన్నులు ఉన్నాయి. డిజిటల్ సేవల మీద కూడా పన్ను విధించాలనే ఆలోచన చేస్తున్నారు. అక్కడ కూడా అమలు చేస్తే ప్రస్తుతం సాగుతున్న వస్తు,సేవల వాణిజ్య యుద్ధం డిజిటల్ సేవల వాణిజ్యానికి కూడా విస్తరించవచ్చు. మన దేశం విధించిన 2% డిఎస్‌టికి ప్రతిగా కొన్ని భారతీయ వస్తువులపై 25 శాతం దిగుమతి పన్ను విధించి బదులు తీర్చుకుంటామని మార్చి నెల చివరి వారంలో అమెరికా నూతన వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయి బెదిరించారు. ఆస్ట్రియా, బ్రిటన్, ఇటలీ, టర్కీ, స్పెయిన్, ఇతర దేశాల మీద కూడా బస్తీమే సవాల్ అన్నారు.

టర్కీ 7.5, ఆస్ట్రియా 5, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్సు 3% చొప్పున, బ్రిటన్ 2% డిఎస్‌టి విధిస్తామని ప్రకటించాయి, బ్రెజిల్ కూడా పన్ను విధింపు ఆలోచన చేస్తున్నది. ఒకవైపు డిజిటల్ సేవల పన్ను మీద ప్రపంచ ఒప్పందం చేసుకొనే అంశం గురించి చర్చించుదామని జో బైడెన్ మాట మాత్రంగా అంటున్నా, అది కుదిరే వరకు గతంలో ట్రంప్ ప్రతిపాదించిన ప్రతికూల చర్యలను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తాయ్ ప్రకటన నిర్ధారించింది. ఆమె ప్రకటనను అమెరికా ఇంటర్నెట్ అసోసియేషన్ అభినందించింది. మన దేశం విధించిన డిఎస్‌టి ద్వారా ఏటా 5.5 కోట్ల డాలర్ల మేరకు పన్ను ఆదాయం వస్తుందని అంచనా. అంత మొత్తానికి సమంగా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా పన్ను విధించే ఆలోచన చేస్తున్నది. అదే గనుక జరిగితే మన రొయ్యలు, బాసుమతి బియ్యం, రంగురాళ్లు, వెదురు ఉత్పత్తులు, ఫర్నీచర్, బంగారు ఆభరణాలు మొదలైన వాటి మీద 25 శాతం వరకు పన్నులు విధిస్తామని ప్రకటించింది.

ఇంతకు ముందే మన ఎగుమతులకు ఇచ్చే రాయితీలను కొన్నింటిని ట్రంప్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఉన్నవి పోయాయి, ఇప్పుడు కొత్తవి తగులుకుంటాయి. అయితే అమెరికా చర్యలకు ప్రతీకారంగా అమెరికాను ప్రపంచ వాణిజ్య సంస్థ కోర్టులోకి లాగవచ్చు. అమెరికా నుంచి వస్తున్న ఆడియో, వీడియో ప్రసారాల మీద పన్ను వేయవచ్చు, అమెరికా క్రెడిట్ కార్డు కంపెనీలు, మెసేజింగ్ సేవలను నిలిపివేయవచ్చు. ఆ చర్యలు తీసుకొనే దమ్మూ ధైర్యం మన 56 అంగుళాల ప్రధానికి ఉందా ? బహుశా మరొక పద్ధతిలో బైడెన్‌న్ను ప్రసన్నం చేసుకొనేందుకు సౌదీ బదులు మరింతగా అమెరికా నుంచి చమురు కొంటామనే సంకేతం పంపారా? అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయి బెదిరింపు ఈ సంకేతం ఒకే సమయంలో వెలువడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News