Thursday, April 25, 2024

అమెరికా చైనాల ఆధిపత్య పోరు

- Advertisement -
- Advertisement -

Trade war between america-china

అమెరికా చైనాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఏ చిన్న కారణమైనా విద్వేషాలకు దారి తీస్తోంది. కరోనా నుంచి హాం కాంగ్ వరకు ఎన్నో అంశాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇటీవల ట్రంప్ చేసిన ప్రకటనలు పరిశీలిస్తే రెండు దేశాలు ఎలా కాలుదువ్వుకుంటున్నాయో స్పష్టమౌతుంది. హాంకాంగ్ ప్రత్యేక వాణిజ్య హోదాను చట్ట ప్రకారం రద్దు చేస్తామని మే 29న ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. చైనా పీపుల్స్‌లిబరేషన్ ఆర్మీతో సంబంధాలున్న చైనా గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పరిశోధకులకు అమెరికాలో ప్రవేశం లేదని హెచ్చరించింది. అమెరికా స్టాక్ మార్కెట్ జాబితాలోని చైనా పరిశ్రమల తీరును నిశితంగా పరిశీలించాలని, అమెరికా చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించని వారిని ఆ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇవన్నీ చైనాను కట్టడి చేయడానికి అమెరికా పన్నుతున్న ఎత్తుగడలు తప్ప ఇంకేమీ కావని ఎవరైనా చెబుతారు.

ఇంత బద్ధవైరంగా ఉంటున్న ఈ రెండు దేశాల చారిత్రక నేపథ్యం పరిశీలిస్తే ఇది వరకు ఇవి ఎలా రాసుకుపూసుకు తిరిగాయో తెలుస్తుంది. 1900 నుంచి చైనాపై అమెరికన్లకు వింత వ్యామోహం ఉండేది. ఈ పరిస్థితి కలిగించడానికి ప్రోటెస్టెంట్ క్రైస్తవ మిషనరీలే కారణం. చైనీయులకు ఉపశమనం కలిగించడం భగవత్కార్యంగా క్రైస్తవ మిషనరీలు ఆనాడు భావించేవి. పెరల్ ఎస్.బక్ రచించిన ‘దిగాడ్స్‌ఎర్త్ ’, 193౦ లో ఎడ్గార్ స్నో రచించిన ‘రెడ్‌స్టార్ ఓవర్ చైనా’ వంటి పుస్తకాలు ఆ దేశాన్ని ఆకాసానికి ఎత్తేశాయి. చైనా కమ్యూనిస్టులు అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆమెరికన్ల ఆశలు చైనాపై మరింత పెరిగాయి. మావోజెడెంగ్‌తో కలసి ప్రపంచంలో ఆధిపత్యం సాగించ వచ్చని కలలు కన్నారు. ఇదే నమ్మకాన్ని చైనీయులు కూడా ఊరిస్తూ వచ్చారు.

ఆనాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనాకు కల్పించిన అంతర్జాతీయ గౌరవం 1972 లో మావో తిరిగి అధికారం చేపట్టడానికి దారి చూపించింది. 1978లో చైనాతో సంబంధాలు యధాప్రకారం కొనసాగడానికి వీలుగా ఆనాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్ తైవాన్‌తో దౌత్యసంబంధాలను తెగతెంపు చేసుకున్నారు. భౌగోళిక,రాజకీయ ప్రయోజనాలు ఆశించి 1989లో తియాన్‌మెన్ పాపాలను అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి హెచ్.డబ్లు.బుష్ తుడిచి వేసుకున్నారు. చైనాపై అవ్యాజ ప్రేమ చూపించడాన్ని అప్పటి అధ్యక్ష అభ్యర్థి బిల్‌క్లింటన్ తీవ్రంగా విమర్శించినప్పటికీ అధ్యక్షపదవిని సాధించిన తరువాత ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనాకు ద్వారపాలకునిగా వ్యవహరించడం పలువురు ముక్కున వేలు వేసుకున్నారు. 1960 నుంచి అమెరికా ప్రభుత్వాలన్నీ ఏదో ఒక ఆశతో చైనా ఉన్నతిలో పాలుపంచుకున్నాయి.

ఏదేమైనా అమెరికా విషయంలో చైనా ఎప్పుడూ అప్రమత్తం గానే ఉంటోంది. సిద్ధాంత రీత్యా దూరంగా ఉంటున్నట్టు నటిస్తోంది. ఏరంగమైనా ముఖ్యంగా వాణిజ్య రంగంలో అమెరికా గుత్తాధిపత్యాన్ని అడ్డుకోవాలన్నదే చైనా ఆకాంక్ష. మావో నుంచి జిన్‌పింగ్ వరకు చైనా కమ్యూనిస్టు ఆధిపత్యానికి అమెరికా ప్రమాదకరమైనదేనన్న అభిప్రాయం కొనసాగుతోంది. ఈ విషయంలో మావో అపరచాణక్యుడనే చెప్పాలి. చైనా ఆధిపత్యాన్ని అణగదొక్కడానికి, వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి అమెరికా పన్నాగాలు పన్నుతోందని, ఈ ఎత్తుగడలకు ఏమాత్రం లొంగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని 1959 నవంబర్‌లో అత్యున్నత స్థాయి నేతలతో మావో చర్చించడం ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోవడం ఎంతైనా అవసరం. స్వంత సమానాంతర ప్రపంచాన్ని కల్పించడం ద్వారా శక్తివంతమైన దేశంగా ఎదిరించాలన్న చైనా నిర్ణయాన్ని సోవియెట్ పతనం అనుభవం మరింత బలోపేతం చేసింది. ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు, న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు, నియంత్రణతో చైనా ప్రత్యామ్నాయ వాణిజ్య వ్యవస్థను (దిబెల్టు అండ్ రోడ్ ఇనీషియేటివ్ ), బహుపక్ష బ్యాంకింగ్ వ్యవస్థను నిర్మిస్తోంది.

అలాగే గ్లోబల్ పొజిషినింగ్, డిజిటల్ పేమెంట్‌ప్లాట్ ఫార్మ్, వరల్డు క్లాస్ డిజిటల్ నెట్‌వర్క్, మిలిటరీ బలగాల ఆధునికీకరణ, తదితర వ్యవస్థలను అమెరికాకు సమాంతరంగా పాశ్చాత్య వనరుల సేకరణతో ఏర్పాటు చేస్తోంది. ఈ వ్యవహారాలు కొందరికి నచ్చలేదు. చైనా దూకుడు ఏమాత్రం శాంతికాముకం కాదని, 2005 లో రాజకీయ శాస్త్రవేత్త జాన్‌మియర్ షియమెర్ అభిప్రాయం వెలిబుచ్చారు. చైనా దీన్ని తోసిపుచ్చింది. శాంతి వాతావరణం విస్తరిస్తుందని నమ్మబలికింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శి హుజుంటావ్ మరింత నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నించారు. ప్రపంచ దేశాలను కూడా నమ్మించారు. అయితే ఇదంతా వాస్తవం కాదని ప్రపంచ దేశాలకు తెలియడానికి అట్టే కాలం పట్టలేదు.

దక్షిణ చైనా సముద్రంలో ఆగ్నేయాసియా దేశాల్లో చైనా మిలిటరీ స్థావరాలను విస్తరింప చేస్తోందని శాటిలైట్ సాక్షం ద్వారా బయటపడింది. దీంతో చైనా ఎదుగుదల శాంతికాముకం కాదన్న విమర్శలు వచ్చాయి. కానీ ఈ వివాదాస్పద అంశాలను కూడా అమెరికా నమ్మ గలిగేలా చైనా వ్యవహరించింది. అయితే ట్రంప్ పాలన ప్రారంభమైన తరువాత చైనా పై భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. రానురాను తారాస్థాయికి చేరుతున్నాయి. వాణిజ్య విధానాల్లో చైనా బయటపడాలని, 5 జి విడిచిపెట్టాలని చైనాకు షరతులతో కూడిన సూచనలు ట్రంప్ చేయడం ప్రారంభించారు.

అమెరికా అధికారానికి, ప్రతిష్ఠకు ప్రయోజనాలకు చైనా, రష్యా ప్రతిబందకాలుగా ఉన్నాయని వాదన లేవదీస్తూ ట్రంప్ 2017 లో జాతీయ భద్రతా వ్యూహాత్మక డాక్యుమెంట్ రూపొందించారు. చైనా వాణిజ్యం పైన, చట్టపరమైన వలసల పైనా ఆంక్షలు విధించారు. అమెరికా అంతటా ఇప్పుడు పూర్తి స్థాయిలో చైనా పైనే చర్చ సాగుతోంది. చైనాతో పరోక్షంగా అమెరికా యుద్ధం ప్రారంభించిందని, వైట్‌హౌస్ మాజీ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీల్ బ్యానన్ వెల్లడించారు. ఈ విద్వేషం ఒక పొరపాటుగా దౌత్యవేత్త రిచర్డ్ హాస్, ప్రపంచ బ్యాంకు మాజీ అధ్యక్షుడు రాబర్ట్ జోలిక్ వ్యాఖ్యానించారు. సేద్యం నుంచి పరిశ్రమల వరకు రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాలు ఏ విధంగా పెనవేసుకున్నాయో రెండు వైపులా తెలుసు. చైనా సప్లయి చైనుపై అమెరికా పెద్ద ఎత్తున ఆధారపడింది.ఈ బంధాలనుంచి తెగతెంపులు చేసుకోవడం అమెరికాకు ఒక విధంగా కత్తిమీద సామే. సప్లయి చైనును వదిలించుకోవాలన్నదే ట్రంప్ కోరికైతే జిన్‌పింగ్ కూడా అదే విధంగా అమెరికా టెక్నాలజీ నుంచి బయటపడాలని భావించడం సహజం. అయితే ఏ స్థాయిలో ఈ తెగతెంపులు సాధ్యమో చెప్పలేం.

అయితే ఈ పోరులో భారత్ అటుఇటు కొంత నలగవచ్చు. ఇదిలా ఉండగా హాంకాంగ్ సమస్య ఈ రెండు దేశాల మధ్య పంతాలు, పట్టింపులకు దారి తీస్తోంది. హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం అమలుకు చైనా సిద్ధం కావడం అమెరికాకు కంటగింపుగా తయారైంది. మిత్రదేశాలు కూడా దీన్ని తప్పుపడుతున్నాయి. ప్రజాస్వామ్య దేశాల అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటోందన్న ఫిర్యాదులు ఉన్నాయి. పశ్చిమదేశాలు ఈ సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతున్నా చైనాతో తమ వాణిజ్యానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త పడుతున్నాయి.

అయితే హాంకాంగ్ విషయం వేరు. ఇది తూర్పులో పశ్చిమదేశాల పెట్టుబడికి పెట్టని కోట. అంతేకాదు పశ్చిమదేశాల భావ జాలానికి, ఆదర్శాలకు కంచుకాగడా. స్వేచ్ఛా స్వాతంత్రాలు, ప్రజాస్వామ్య వెలుగులు ఇక్కడ ప్రసరిస్తాయన్న నమ్మకం చాలా దేశాల్లో ఇంతవరకు ఉంది. చైనాతో వాణిజ్యానికి, ఇతర సంబంధాలకు ఇది దగ్గరి దారి. దీనిపై పట్టు సాధించాలని తన గుప్పెటలో పెట్టుకోవాలని చైనా ఆరాటపడుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలని అమెరికా చూస్తోంది. హాంకాంగ్ వాసుల స్వేచ్ఛా హక్కులపై, స్వయం ప్రతిపత్తిపై చైనా ఉక్కుపాదం మోపుతోందని అమెరికా ఘోషిస్తుండగా, దీనికి ప్రతిగా చైనా అమెరికాలో నల్లజాతీయుడు ఫ్లాయిడ్ హత్యను తెరమీదకు తెస్తోంది. ఇది మానవ హక్కులను మట్టుబెట్టడం కాదా అని ఎదురు ప్రశ్న వేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య రావణ కాష్టం ఇంతలో ఆరేటట్టు లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News