Home బిజినెస్ సెప్టెంబరు 28న ట్రేడర్ల షాప్‌లు బంద్

సెప్టెంబరు 28న ట్రేడర్ల షాప్‌లు బంద్

Traders association CAT, september 28, bandh

ఫ్లిప్‌కార్ట్‌వాల్‌మార్ట్ డీల్‌పై సిఎఐటి నిరసన

న్యూఢిల్లీ: దేశీయ ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలును వ్యతిరేకిస్తూ ట్రేడర్ల సంఘం సిఎఐటి సెప్టెంబర్ 28న బంధ్‌కు పిలుపునిచ్చింది. సిఎఐటి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ మాట్లాడుతూ, ఫ్లిప్‌కార్ట్‌వాల్‌మార్ట్ డీల్ నిబంధనలకు విరుద్ధమని, ఇ కామర్స్‌తో రిటైల్ వ్యాపారం తగ్గిపోతోందని అన్నారు. ఈ డీల్‌కు వ్యతిరేకంగా సెప్టెంబర్ 15న దేశవ్యాప్తంగా రథ యాత్ర ప్రారంభిస్తామన్నారు. ట్రేడర్లపై వివక్షకు నిరసనగా డిసెంబర్ 16న మెగా ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు.

77 శాతం వాటాల కొనుగోలు పూర్తి
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 77 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది. ఈ డీల్‌ను మే నెలలో ప్రకటించగా, ఈ డీల్ కోసం వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్‌మెంట్ పూర్తి కావడంతో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు 77 శాతం వాటాలు లభించాయి. మిగతా వాటా ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, టెన్సెంట్, టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మొదలైన ఇతర షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటుందని వాల్‌మార్ట్ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటికీ.. రెండు సంస్థలూ వేర్వేరు బ్రాండ్స్‌గానే కొనసాగనున్నాయి.ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత మేనేజ్‌మెంట్ టీమ్ సారథ్యంలోనే ఉంటుంది. వాల్‌మార్ట్‌కి చెందిన కొందరు అధికారులు ఫ్లిప్‌కార్ట్ బోర్డులో చేరతారు.
ఇకపై ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక ఫలితాలను వాల్‌మార్ట్ అంతర్జాతీయ వ్యాపార విభాగం ఫలితాల్లో చేర్చనున్నారు. ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు భారత్‌లో 21 హోల్‌సేల్ స్టోర్స్ ఉన్నాయి.