Home నల్లగొండ నృత్యేంద్రజాల రవితేజం

నృత్యేంద్రజాల రవితేజం

తల్లిదండ్రులకుండే గొప్ప లక్షణాలు జీన్స్ ద్వారా పిల్లలకు సంక్రమిస్తాయని సైన్స్ చెబుతుంది.ఆరవ సంవత్సరం నుండే అద్భుతాలు చేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన గుంటి రవితేజకు కూడా నృత్యాభినివేశం తన తల్లి ద్వారా ప్రాప్తించింది.క్లాసికల్ డ్యాన్సర్ అయిన తల్లి,ప్రోత్సహించే తండ్రి తోడవడంతో తనలోని కళ మరింత ఎదిగి ప్రపంచవ్యాప్తం అయ్యింది.చిన్ననాటి నుండే నృత్య కళలో రాణించినా చదువుకూ సమప్రాధాన్యం ఇచ్చి నేడు అమెరికాలోని డల్లాస్‌లో నార్త్‌టెక్సాస్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చేస్తున్నాడు.నృత్యం చేస్తూనే వస్త్రధారణ మారుస్తూ సంబంధిత నృత్య రీతిలో ఒదిగిపోయే నృత్యేంద్రజాలం ప్రదర్శించి ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాడు.అమెరికాలో మాదరి స్టూడియోను స్థాపించి అనేకమందికి నృత్యాన్ని నేర్పిస్తున్నాడు.ఇటీవల అమెరికాలో బాలీవుడ్ సింగర్స్ పాటలకు నాట్య సహకారం అందించి కార్యక్రమానికి వన్నె తెచ్చాడు.నాట్య ప్రదర్శనతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకున్నాడు.ఉత్తమ నటుడిగా పేరు తెచ్చుకోవాలనుందంటున్న రవితేజ నేటి మన తెలంగాణ యువ తరంగం… 

ravi-tejaపాఠశాల వార్షికోత్సవంలో- నల్గొండ జిల్లా కోదాడ మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన రవితేజ కోదాడలో ఆరవతరగతి వరకు చదువుకున్నారు.తండ్రి వెంకటేశ్వర్లు,తల్లి పద్మావతి.చెల్లెలు రవళి.రవితేజ తల్లికి క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రవేశం ఉండడంతో వీరికీ కళమీద ఆసక్తి ఉండేది.పాఠశాలలో జరిగిన వార్షికోత్సవంలో వీరిద్దరు కలిసి చేసిన డాన్స్ ప్రేక్షకులను అలరించింది,మొదటి బహుమతి పొందారు.దాంతో వారి తల్లిదండ్రులు పిల్లలను డాన్స్ క్లాస్‌లో చేర్పించారు.అలా చిన్నప్పుడే తన డాన్స్ పర్ఫామెన్స్‌తో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో పేరు నమోదు చేసుకున్నారు.
రాష్ట్ర స్థాయిలో ప్రధమ బహుమతి- డాన్స్ నేర్చుకుంటూనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు రవితేజ.టి వి ఛానెల్స్ నిర్వహించే డాన్స్ బేబి డాన్స్ కార్యక్రమంలో సబ్ జూనియర్స్ లెవెల్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించారు.చొక్కాపు వెంకటరమణ దీవెనలతో పరిచయాలు పెరిగి సినీ అవకాశాలు కూడా పొందానని చెప్పారు రవితేజ.దాదాపుగా 15 సినిమాల్లో(చక్రం,ప్రయత్నం,అల్లరి బుల్లోడు మొదలగునవి) చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు.సినీ అవకాశాలు రావడంతో వారి తండ్రి ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో పిల్లలకు వెన్నంటి నిలిచి ప్రోత్సహించారు.సనీ రంగంలో గుండు హన్మంతరావు చాలా సాయమందించారని చెప్పారు రవితేజ.
మాదరి స్టూడియో- డాన్స్‌లో ప్రయోగాలు చేస్తూ చదువునూ కొనసాగించారు రవితేజ.ఏ వి ఎన్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్ళారు.డల్లాస్‌లోని నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చేస్తూ అక్కడే మాదరి స్టూడియోను నిర్వహిస్తున్నారు.సుంకిరెడ్డి నరేష్(మంగమ్మ పాట ప్రొడ్యూసర్) సహకారంతో మరో మూడు బ్రాంచ్‌లను ఏర్పాటుచేసి ఔత్సాహికులకు డాన్స్ నేర్పిస్తున్నారు రవితేజ.
అవార్డ్- వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకోవడమే కాకుండా2015 సంవత్సరంలో తెలంగాణ వనభోజనాలు కార్యక్రమంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ డెవలప్‌మెంట్ యూత్ లీడర్ అవార్డ్ అందుకున్నారు.స్థానిక టి.వి ఛానెల్స్ ఆధ్వర్యంలో అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు రవితేజ.తన ఎమ్మెస్ పూర్తిచేసుకుని ఉద్యోగం చేస్తూనే నటనా రంగంలో సత్తా నిరూపించుకోవాలనుకుంటున్న రవితేజకు మనమూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం మరి.