Saturday, April 20, 2024

మళ్లీ మొదలైంది.. ట్రాఫిక్ చలాన్ల బాదుడు

- Advertisement -
- Advertisement -

Traffic Police Focus On Pending Challans

హైదరాబాద్: మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మళ్లీ ట్రాఫిక్ చలాన్ల బాదుడు మొదలైంది. కరోనా సమయంలో పోలీసులు లాక్‌డౌన్ విధులు నిర్వర్తించడంతో ట్రాఫిక్ చలాన్లను పట్టించుకోలేదు. ఆ సమయంలో నష్టపోయిన డబ్బులను రికవరీ చేసుకునేందుకు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విచ్చల విడిగా ట్రాఫిక్ చలాన్లు వేస్తున్నారని వాహనదారులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ట్రాఫిక్‌ను గాడిలో పెట్టడం మర్చిపోయి ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు చలాన్లు వేయడంపైనే దృష్టిపెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలను చూపి విచ్చల విడిగా జరిమానాలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. లాక్‌డౌన్ విధించడంతో నగరం నుంచి పలువురు గ్రామాల బాటపట్టారు. అంతేకాకుండా ఇళ్లల్లో నుంచి చాలామంది బయటికి రాలేదు. దీంతో వాహనాల రద్ది తక్కువగా ఉండడంతో పోలీసులు వాహనాలపై దృష్టి పెట్టలేదు. గతంలో వాహనం వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టుకోకుంటే జరిమానా విధించేవారు కాదు.

ప్రస్తుతం దానికి కూడా జరిమానా విధిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకు కూడా జరిమానాలు విధించడం చేస్తున్నారు. జరిమానాలు ఎక్కువగా మోటార్ సైకిల్ దారులకు విధిస్తున్నారు. కరోనా ఉదృతి తగ్గకపోవడంతో చాలామంది నగరబాట పట్టారు. వారితో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు చలాన్లు వేయడం ప్రారంభించారు. కొన్ని కూడళ్లలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు కెమెరాలు ఇచ్చి కేవలం హెల్మెట్ పెట్టుకోని వాహనదారులు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటోలు తీయడమే డ్యూటీగా పెట్టారు. ఇది సరైనది కాదని వాహనదారులు విమర్శలు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా విధులు నిర్వర్తిస్తు, నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటోలు తీయాల్సింది పోయి, జరిమానాల కోసమే కానిస్టేబుళ్లను నియమించడం విమర్శలకు దారితీస్తోంది.

Traffic Police Focus On Pending Challans

మార్పు కోసం ప్రయత్నం ఏది…

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారుల్లో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు వాహనదారుడు దొరుకుతాడా జరిమానా విధిద్దా అనే కోణంలో పోలీసులు ఉన్నరు తప్ప వారిలో మార్పు తీసుకురావాలని చూడడంలేదు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తీసుకురావాల్సింది పోయి, డబ్బుల కోసం జరిమానాలు విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Traffic Police Focus On Pending Challans

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News