Saturday, April 20, 2024

థర్డ్ వేవ్ కోసం హెల్త్ అసిస్టెంట్లుగా 5వేల మంది యువజనులకు శిక్షణ

- Advertisement -
- Advertisement -

Train 5000 youth as Health Assistants:Kejriwal

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ప్రకటన

న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి మూడవ దశను ఎదుర్కోవడానికి చేపట్టిన సన్నాహక చర్యలలో భాగంగా డాక్టర్లకు, నర్సులకు సహాయపడేందుకు 5,000 మంది యువజనులకు ఢిల్లీ ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. నర్సింగ్, ప్రాణ రక్షణలో ఈ ఆరోగ్య సహాయకులు లేదా కమ్యూనిటీ నర్సింగ్ సహాయకులకు రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తెలిపారు. బ్యాచ్‌కు 500 మంది అభ్యర్థుల చొప్పున వీరికి ఈ నెల 28 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

కొవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి తాము చేపట్టనున్న ఈ చర్య మరింత బలాన్ని ఇస్తుందని తాను నమ్ముతున్నట్లు ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమైన బ్రిటన్ వంటి దేశాల నుంచి అనుభవాలను నేర్చుకుని రానున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమాయత్తం కావలసి ఉంటుందని ఆయన అన్నారు. శిక్షణ పొందే అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండి కనీసం 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని ఆయన తెలిపారు.

జూన్ 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారినే ఎంపిక చేసే పద్ధతిలో ఈ ప్రక్రియ ఉంటుందని ఆయన వివరించారు. థర్డ్ వేవ్ వచ్చిన పక్షంలో ఆరోగ్య సహాయకుల సేవలు ఎక్కడ అవసరమవుతాయో అక్కడే వారిని వినియోగించుకోవడం జరుగుతుందని, వారు పనిచేసిన రోజులకు వేతనం చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. నర్సింగ్‌లో ప్రాథమిక సేవలు, పారామెడికల్, ప్రాణరక్షణ, ప్రథమ చికిత్స, నమూనాల సేకరణ, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్ల నిర్వహణ, తదితర ఇతర వైద్య సేవలలో వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News