Thursday, April 25, 2024

ఇకపై రైలు టికెట్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే

- Advertisement -
- Advertisement -

Train tickets

 

హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా తొలి దశలో సుమారు వంద మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు ఏడాదిలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 మార్గాల్లో 17 ప్రైవేటు రైళ్లు ప్రారంభించనున్నారు. అయితే ఈ రైళ్లలో ప్రయాణించే వారికి టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రైలు ప్రయాణం చేయాలంటే ఆ స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకోవాలి. కానీ రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా ప్రైవేటు రైళ్లకు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయడం లేదు.

అంతా డిజిటల్ మయం అయిన నేపథ్యంలో దాదాపుగా అందరూ ఐఆర్‌సిటిసి ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా టికెట్లు రిజర్వేషన్లు ఖరారు చేసుకుంటున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇక పూర్తిగా రైళ్ల టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయించాలని రైల్వే శాఖ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో ప్రయివేటు రైళ్ల టికెట్ విక్రయాలు విజయవంతమైతే.. రైల్వేశాఖ పరిధిలోని అన్నీ రైళ్ల టికెట్‌లు రిజర్వేషన్లన్నీ ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరిపేందుకు ఆలోచన చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు. దీంతో ఇప్పట్నించే ఆన్‌లైన్‌లో రైలు టికెట్ కొనుగోలు అలవాటు చేసుకోవాల్సిందేనని వారు చెబుతున్నారు. అంటే రానున్న రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకోవడం, రిజర్వేషన్ చేసుకోవడమనేది ఇకపై ఉండకపోవచ్చన్నమాట. తత్ఫలితంగా రైల్వేస్టేషన్లలో 24 గంటలు అందుబాటులో ఉండే బుకింగ్ కౌంటర్లు అతి త్వరలో కనుమరుగు అవ్వనున్నాయి.
విమానం టికెట్ మాదిరిగా

ప్రైవేట్ రైళ్ల టికెట్ ఆన్‌లైన్‌లో కొనుగోలు…
ప్రయివేటు రైళ్ల టికెట్ కొనుగోలు కూడా విమానం టికెట్ మాదిరిగా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రయివేట్ రైళ్లలో బెర్త్ ఉంటేనే ఆన్‌లైన్‌లో టికెట్ లభిస్తుంది. కాగా, ఐఆర్ సిటిసిలో అయితే బెర్త్ లేకపోయినా వెయిటింగ్ లిస్ట్ టికెట్ లభిస్తుంది. కానీ ప్రైవేటు రైళ్లలో అలా కాదు. రైలులో బెర్త్ ఖాళీగా ఉంటేనే టికెట్ చూపిస్తుంది.

చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసుకుంటే నష్టం..ముందుగా బుక్ చేసుకుంటే లాభం
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయివేట్ రైళ్ల ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ రూపొందనుందన్నమాట. అదెలాగంటే… ఈ ప్రయివేటు రైళ్లలో చివరి నిమిషంలో కనుక టికెట్ రద్దు చేసుకుంటే ఎక్కువ శాతం నష్టపోయే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నిరోజులు ముందుగా బుక్ చేసుకుంటే అంత లాభం చేకూరుతుంది.

అత్యాధునిక సౌకర్యాలతో ప్రైవేటు రైళ్ల పరుగు…
ప్రయాణీకులకు అత్యాధునిక సౌకర్యాలను ప్రయివేటు రైళ్లు సమకూర్చనున్నాయి. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో రైల్వేస్‌ని అభివృద్ధి పర్చడమే రైల్వే శాఖ లక్షంగా ఉంది. అదే క్రమంలో త్వరలో ప్రయివేటు రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తున్నాయి. సాధారణ రైళ్ల కంటే అదనంగా ప్రైవేట్ రైళ్లలో వైఫే.. తదితర సౌకర్యాలుంటాయని అంటున్నారు. ఎక్కడైనా పోటీ తత్వం ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నది కేంద్రం భావనగా ఉంది.

అంతిమంగా ప్రయాణీకులు మెచ్చే విధంగా రైల్వేస్‌ని తీర్చిదిద్దడమే రైల్వే శాఖ లక్షంగా పెట్టుకుంది. ఆ లక్షం దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ప్రైవేటు రైళ్ల ప్రవేశం వల్ల రైల్వే శాఖకు ముప్పు పరిణమించే అవకాశం ఉందా? అన్న విషయంపై ఇది చాలా శుభ పరిణామంగానే తాము భావిస్తున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. మరిన్ని రానున్న రోజుల్లో రైల్వేస్‌లో ఎలాంటి పరిణామాలు.. ఇంకెన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయో.. వేచి చూడాల్సిందే…!

Train tickets are online now
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News