Home తాజా వార్తలు బదిలీల మార్గదర్శకాలు రెండ్రోజుల్లో

బదిలీల మార్గదర్శకాలు రెండ్రోజుల్లో

Replace 105 vacancies in irrigation department

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూ పొందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ వివిధ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులను, సమావేశాలను పూర్తి చేసింది. మంగళవారంకల్లా మార్గదర్శకాలు విడుదలకావచ్చని సమాచారం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా అధ్యక్షతన ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా, కార్యదర్శి శివశంకర్‌లతో కూడిన కమిటీ ఒక రోజు ప్రభుత్వ ఉద్యోగులతో, మరోరోజు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ విధానాన్ని, ఉద్దేశాన్ని కూడా వివరించింది. మార్గదర్శకాల ముసాయిదా ఇప్పటికే తయారైందని, కమిటీ మరోమారు సమావేశమై వీటి పై లోతుగా చర్చించి ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైన సవరణలు చేయనున్నట్లు సమాచారం. సోమవారం ఈ ప్రక్రియ పూర్తయితే మంగళవారానికే తుది మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని, ఏదేని పరిస్థితుల్లో ఆలస్యమైతే బుధవారంకల్లా వస్తాయని అధికారి ఒకరు తెలిపారు. ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన దాదాపు అన్ని అంశాలకూ కమిటీ సానుకూలంగా స్పందించినా ఉపాధ్యాయ సంఘాల అంశాల్లో కొన్నింటికి కోర్టుతో సంబంధం ఉన్నందున స్పష్టత రాలేదని తెలిసింది. రెండేళ్ళ సర్వీసు పూర్తిచేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుందని, ఐదేళ్ళుగా ఒకేచోట పనిచేస్తున్నవారికి తప్పనిసరిగా బదిలీ ఉంటుందని, పదవీ విరమణ చేయడానికి కేవలం ఏడా ది కాలం మాత్రమే ఉన్నట్లయితే వారి అభిప్రాయం మేరకు బదిలీ ఉంటుందని, బదిలీకి ఇష్టం లేకపోతే అక్కడే కొనసాగవచ్చని ఈ కమిటీ సూచనప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్నట్లయితే బదిలీ సమయంలో వారు ఒకేచోట ఉండేలా తొలి ప్రాధాన్యత ఉంటుందని, ఆ తర్వాత ప్రత్యేక అవసరాలు (పదవీ విరమణకు ఏడాది కాలం మాత్రమే ఉన్నట్లయితే ఆ ఉద్యోగులు కోరుకున్న చోటకు బదిలీ అయ్యే) ఉన్నట్లయితే ఆ తర్వాతి ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది. మానసిక వైకల్యంతో ఉన్న పిల్లల సంరక్షణ కోసం ఉద్యోగులకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులకు, వికలాంగ ఉద్యోగులకు, సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఒంటరి మహిళా ఉద్యోగులకు, దీర్ఘకాలికంగా బదిలీ లేకుండా ఒకేచోట కొనసాగుతున్న ఉద్యోగులకు పై వరుసక్రమంలోనే ప్రాధాన్యత ఇచ్చేలా మార్గదర్శకాల్లో కమిటీ స్పష్టంగా పేర్కొంటున్నట్లు తెలిసింది.
బదిలీల సందర్భంగా పైరవీలు, అక్రమాలు, అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించినందువల్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడంపై అజయ్‌మిశ్రా కమిటీ దృష్టి సారించింది. తొలుత బదిలీకి అర్హత కలిగినవారి జాబితా, తప్పనిసరిగా బదిలీ అయ్యేవారి జాబితా, బదిలీకి గురయ్యే ఉద్యోగుల జాబితా.. ఇలా పలు రకాల జాబితాలను ముందుగానే ఉద్యోగుల ప్రదర్శన కోసం పెట్టి ఆ తర్వాత వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించి అర్థం చేయించడం, వివరణ ఇవ్వడం, పరిష్కరించడం లాంటి ప్రక్రియలు చేపట్టేందుకు నాలుగైదు రోజుల సమయం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియను జూన్ రెండవ వారం కల్లా పూర్తిచేయాలని అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు ఒకే అభిప్రాయంతో ఉన్నందువల్ల మార్గదర్శకాల తయారీ కూడా వేగంగానే జరుగుతోంది. ఆ తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికలు కూడా ఉంటున్నందున అజయ్‌మిశ్రా కమిటీ అన్ని కోణాల నుంచి ఆలోచించి మార్గదర్శకాలతో పాటు బదిలీ ప్రక్రియ షెడ్యూలు (సాధ్యాసాధ్యాలతో)ను కూడా సూచించనున్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపులు
ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కూడా జరగాల్సి ఉన్నందున వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో అజయ్‌మిశ్రా కమిటీ ఇప్పటికే సంప్రదింపులు పూర్తిచేసింది. వచ్చే నెల 6వ తేదీన హైకోర్టులో ఏకీకృత సర్వీసు నిబంధనలకు సంబంధించిన కేసు విచారణ ఉన్నందువల్ల తీర్పు వస్తే ఒక రకంగా లేకుంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకుని మరో రకంగా బదిలీలు, పదోన్నతులను ఖరారు చేయాలని కమిటీ భావిస్తోంది. అయితే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ కానందువల్ల వాటి కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు.
బదిలీలకు హైకోర్టు కేసు నుంచి ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ పదోన్నతుల విషయంలో మాత్రం కోర్టు తీర్పుకు లోబడి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు తీర్పు ఇవ్వని పక్షంలో ప్రత్యేకంగా అనుమతి తీసుకుని పదోన్నతులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూలుకంటే ముందే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా పదోన్నతులతో బదిలీ అంశం ముడిపడి ఉన్నందున జూన్ 6వ తేదీ కోర్టు విచారణకు అనుగుణంగా ఈ వ్యవహారం జరగాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు వ్యాఖ్యానించాయి.