Home నల్లగొండ ప్రాణాలతో చెలగాటం

ప్రాణాలతో చెలగాటం

Transformersప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫారంలు
రక్షణ వలయాలు ఏర్పాటు చేయని వైనం
భయాందోళనల్లో ప్రజలు

హాలియా: మండల కేంద్రం హాలియాలోని ప్రధాన వీధుల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి.ఇళ్ల మద్యలో ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంగడిబజార్ రోడ్డులోని నిర్మలస్కూల్ ,ఆకాంక్షస్కూల్, జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, పేరూరు రోడ్డులోని అచ్చిరెడ్డి ధియేటర్ ప్రక్కన,గందెపాపరావు ఇంటి సమీపంలో ఉన్నట్రాన్స్‌ఫార్మర్లకు కంచె కూడా లేకపోవడంతో ప్రమాదాన్ని తలపిస్తున్నాయి. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసిన అధికారులు రక్షణ వలయం నిర్మాణాన్ని విస్మరించారు. గతంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల భారిన పడి మూగజీవాలు విద్యుద్ఘాతంతో మృత్యువాత పడ్డాయి.ట్రాన్స్‌ఫార్మర్ సమీ పంలో చిరువ్యాపారులు పొట్టకూటి కోసం వ్యాపారం నిర్వహిస్తుం టారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి తరచూ పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన మంటలు వెలువడుతుండటంతో వ్యాపారులు, దారిన పోయే ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీయాల్సిన దుస్థితి.ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తుతున్న తీరుతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.జనసంచార ప్రదేశాల్లో ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకోవడంతో రక్షణ వలయాల్లేని ట్రాన్స్‌ఫార్మర్లు ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారాయి.ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ వలయాలు ఏర్పాటు, సురక్షిత ప్రదేశాల్లోకి ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు విషమై అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.అత్యంత ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను సురక్షిత ప్రదేశానికి తరలించి ప్రమాద నివారణా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.