Friday, April 19, 2024

డేంజర్ జోన్‌లో ఎర్తింగ్ లేని ట్రాన్స్‌ఫార్మర్లు…

- Advertisement -
- Advertisement -

పట్టించుకోని అధికారులు

Transformers without earthing

మన తెలంగాణ,సిటీబ్యూరో: ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగ్ లేక ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఒక పక్క.. ట్రాన్స్‌ఫార్మర్లపై పడుతున్న లోడ్‌తో పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు పరిశీలించాల్సిన అధికారులు వాటిని పట్టించ కోక పోవడంతో తరచు రిపేరింగ్ సెంటర్లకు వెళ్తున్నాయి. గ్రేటర్ పరిదిలో సుమారు లక్షకు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు ఉంటే వాటిలో లోడ్ 30 శాతం ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగ్ లేకుండా నే విద్యుత్ సరఫరా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ప్రతి రోజు నీరు పోయాలని,ఎర్తింగ్ సమస్యలు లేకుండా చూసుకోవాలని డిస్కం సీఎండి, ఆపరేషన్ డైరక్టర ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. సంవత్సరాల తరబడి ట్రాన్స్‌ఫార్మర్లు మార్చక పోవడంతో విద్యుత్ సరఫరా పంపిణీ నష్టాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఎర్తింగ్ లేక పోవడంతో ట్రాన్స్‌ఫార్మర్లపైలోడ్ ఆయిల్ కారడం వంటి సమస్యలతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి.

వేసవి కాలంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. సాధారణంగా గ్రేటర్‌లో 47 నుంచి 50 ఎంయుల విద్యుత్ వినియోగం ఉండగా వేసవిలో పెద్ద ఎత్తున 65 నుంచి 70 ఎంయుల వరకు విద్యుత్ వినియోగం నమోదువుతుంది. ఈ నేపథ్యంలో సబ్‌స్టేషన్లతో పాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతుంది. లోడ్ పెరుగుతున్న కారణాలతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్న అధికారులు వాటి ఎర్తింగ్‌ను మాత్రం పట్టించు కోవడం లేదు. ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ కాంట్రాక్టర్లు నామమాత్రంగా ఎర్తింగ్ రాడ్‌లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

ఎర్తింగ్ పనితీరును పరిశీలించాల్సిన అధికారులు కూడా వాటివైపు కన్నెత్తి కూడా చూడక పోవడంతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు సైతం తరుచు రిపేరింగ్ సెంటర్లకు వెళ్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మ వద్ద ఏర్తింగ్ ఏర్పాటు కోసం నాలుగున్నర ఫీట్ల లోతు గుంత తవ్వి అందులో ఇనుపరాడ్‌కు కాపర్ తీగ కట్టి ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి. 20 నుంచి 40 ఎంఎం కంకర,ఇసుక,బొగ్గువేయడంతో పాటు ఎర్తింగ్ పౌడర్ చల్లాలనే నిబందనలు సరిగా అమలు చేయక పొవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగ్ సరిగా లేకపోవడంతో ఆ ప్రభావం ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ కనెక్షన్ ఉన్న వినియోగదారులపై పడుతోంది. వినియోదారులు ఇళ్లోలో ఓల్టేజి సమస్యలతో పాటు బిల్లులు కూడా ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు.

గతంలో వేసవి వచ్చిందంటే ప్రతి ట్రాన్స్‌ఫార్మర్ పనితీరు పరిశీలించడంతో పాటు సక్రమంగా ఎర్తింగ్ ఉండేలా చూసుకునే వాళ్ళమని ఇప్పుడు ్రట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్య పెరగడంతో అధికారులు పట్టించు కోవడం లేదని ఒక విశ్రాంత అధికారి తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న డిజిటల్ మీటర్లలో బిల్లులు పెరిగేందుకు ఎర్తింగ్ లేక పోవడం కూడా ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్ ఫార్మర్లకే ఎర్తింగ్ సరిగా లేక పోతే ఎలా అంటు వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News