Tuesday, April 23, 2024

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

- Advertisement -
- Advertisement -

 TWallet

 

నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన
త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం

హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సేవలను మరిన్ని శాఖల్లో అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళుతుంది. ఇప్పటికే పలు శాఖల్లో టివ్యాలెట్‌ను ఉపయోగించడంతో అవినీతి ఆస్కారం లేని పారదర్శకమైన సేవలు అందుతున్నా యని అధికారులు పేర్కొంటున్నారు. టివ్యాలెట్‌లో మరిన్ని సేవలందించేలా సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల సేవలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దేశంలో ఈ యాప్ ద్వారా అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం కల్పిస్తున్న మొదటి రాష్ట్రంగా రానున్న రోజుల్లో తెలంగాణ నిలవనుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఆర్‌బిఐ నుంచి అనుమతి..
డిజిటల్ చెల్లింపులను పెంచాలన్న ఉద్ధేశంతో ప్రభుత్వం టివ్యాలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. టి వ్యాలెట్ ద్వారా అన్ని రకాల చెల్లింపులు చేసుకునే అవకాశముంది. ఆర్బీఐ నుంచి ఈ విధానానికి ప్రత్యేక అనుమతినిచ్చింది. దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే టివ్యాలెట్ వంటి యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దానిని విజయవంతంగా కొనసాగిస్తోంది. టివ్యాలెట్ వల్ల అవినీతి జరిగే ఆస్కారం కూడా ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.

మొదటిసారిగా విద్యుత్‌శాఖలో..
త్వరలో బుక్‌మై షో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో షాపింగ్‌లకు ఈ యాప్ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం లభించనుంది. రోజురోజుకు టివ్యాలెట్ ఉపయోగించే వారి సంఖ్య పెరగడంతో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల పది లక్షలకు చేరింది. గతేడాది జనవరిలో నెలకు 4 నుంచి 5 లక్షలలోపు లావాదేవీలు జరగ్గా, ప్రస్తుతం నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. మొదటిసారిగా టి-వ్యాలెట్‌ను విద్యుత్‌శాఖలో వినియోగంలోకి తీసుకురాగా, ఆ తర్వాత నీటి బిల్లులు, ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్, గ్రౌండ్ బుకింగ్ వంటి జీహెచ్‌ఎంసీ చెల్లింపులు, మీ సేవ సర్వీసుల చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

పరీక్షల ఫీజులు చెల్లించేలా రూపకల్పన..
ప్రస్తుతం ట్రాఫిక్ చలాన్లు, టిఎస్ ఆర్టీసీ బస్ టికెట్లు, టిఎస్‌పిఎస్సీ నోటిఫికేషన్ల చెల్లింపులు, టాస్క్ రిజిస్ట్రేషన్, దోస్త్ రిజిస్ట్రేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఫీజు, జెఎన్టీయూహెచ్ సేవలు, కార్మికశాఖ నుంచి కొత్త దుకాణాల రిజిస్ట్రేషన్లు, విజయ డెయిరీ వెండర్ పేమెంట్లు, టి చిట్స్ వంటి పేమెంట్లను జరుపుకునే సౌకర్యాన్ని కల్పించారు. మొబైల్ రీచార్జ్, డిటిహెచ్, ఇంటర్నెట్, మొబైల్, ల్యాండ్‌లైన్ ఫోన్ బిల్లులు, ప్రైవేట్ బస్ టికెట్లు, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్ వంటివి కూడా చెల్లించుకోవచ్చు. టివ్యాలెట్ ఖాతాదారులకు డెబిట్ కార్డుల తరహాలో వర్చువల్ రుపే కార్డులను అందిస్తారు. ఈ కార్డుల ద్వారా త్వరలో బుక్ మై షో, ఫ్లిప్‌కార్ట్, ఐఆర్‌టిసి, అమెజాన్, స్విగ్గీ, జొమాటో వంటి ఈ-కామర్స్ సైట్లలో షాపింగ్, బుకింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. అలాగే, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల ఫీజులు చెల్లించేలా టివ్యాలెట్‌ను అనుసం ధానం చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ వ్యాలెట్ ప్రత్యేకతలు..
మీసేవ ద్వారా టివ్యాలెట్ నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు 52 వేల లావాదేవీల ద్వారా సుమారు రూ.5 కోట్లను టివ్యాలెట్ ఖాతాదారులు విత్‌డ్రా చేసుకున్నారు. నిజామాబాద్ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను టి-వ్యాలెట్‌లో జమచేసేందుకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద అనుమతిచ్చింది. ఇక్కడ మంచి ఫలితాలివ్వడంతో ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 11,179 మంది విద్యార్థుల స్కాలర్‌షిప్ రూ. 6.27 కోట్లను వారి టివ్యాలెట్ ఖాతాలో జమ చేశారు. రేషన్‌షాపుల్లో టివ్యాలెట్ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

Transparent services with TWallet
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News