*రైతుల అభిప్రాయాలను సేకరించిన వ్యవసాయ శాఖ అధికారులు
మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా : వ్యవసాయ పెటుబడులకు ఎకరానికి 4 వేల రూపాయలను ఇచ్చే పథకంలో భాగంగా రైతులు నగదు రూపంలో తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని 18 మండలాలలో 18 గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. అధికారులు నిర్వహించిన సర్వేలో అత్యధిక శాతం రైతులు నగదు రూపంలో డబ్బులను ఇవ్వాలని అధికారులకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం జిల్లా 7 లక్షల 68 వేల 105 ఎకరాలలో విస్తరించి ఉన్నది. దీనిలో సాగుకు అనుకూలంగా 5 లక్షల 82 వేల 677 ఎకరాలు ఉన్నది. అదేవిధంగా జిల్లాలో 2 లక్షల 73 వేల 572 మంది రైతులు ఉన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు మాదిరెడ్డిపల్లి, పెద్దాపూర్, పీరంపల్లి, చెన్నారం, గోపాల్‌పూర్, నస్కల్, మద్గుల్‌చిట్టంపల్లి, దోమ, నవాంగ్ది, గట్టేపల్లి, మోమిన్‌పేట, కుత్బుల్లాపూర్, సుల్తాన్‌పూర్, రుద్రారం, బాలంపేట, దుద్యాల్, కోట్‌పల్లి, అంతారం గ్రామాలలో రైతుల అభిప్రాయాలను సేకరించారు. జిల్లాలో మొత్తం 1,921 రైతుల అభిప్రాయాలను సేకరించారు. ఫ్రీ లోడెడ్ కార్డు, బ్యాంకు అకౌంట్‌లో జమా చేయడం, చెక్కులు పంపిణీ చేయడం, పోస్ట్ ఆఫీస్ ద్వారా చెల్లించడం, పిఎసిఎస్ ద్వారా చెల్లించడం, నేరుగా రైతులకు నగదు రూపంలో పంపిణీ చేయడం వంటి పలు రకాలపై రైతుల అభిప్రాయాలను వ్యవసాయ అధికారులు సేకరించారు. ఫ్రీలోడెడ్ కార్డుల రూపంలో 8 మంది రైతులు అంటే కేవలం 0.42 శాతం రైతులు మొగ్గు చూపారు. అదేవిధంగా బ్యాంకు అకౌంట్‌లలో డబ్బులను జమ చేయడానికి 291 మంది రైతులు అంటే 15.15 శాతం రైతులు సమ్మతి తెలిపారు. అదేవిధంగా చెక్కుల రూపంలో 412 మంది రైతులు ఆసక్తి చూపగా, వీరి శాతం 21.45 ఉన్నది. పోస్టాఫీస్ ద్వారా 268 మంది రైతులు అంటే 14 శాతం ఆసక్తి కనబరిచారు. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్)ల ద్వారా 12 మంది రైతులు మాత్రమే కనబర్చగా, వీరి శాతం 0.6 ఉన్నది. అదేవిధంగా నగదు రూపంలో చెల్లించడానికి రైతులు అత్యధికంగా మొగ్గు చూపారు. 1,921 మంది రైతుల అభిప్రాయాలు సేకరించగా వీరిలో అత్యధికంగా 930 మంది రైతులు నగదు రూపంలో చెల్లించాలని తమ అభిప్రాయాలను అధికారులకు వ్యక్తం చేశారు. వీరి శాతం 487.412 ఉన్నది. రైతుల నుంచి సేకరించిన వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతామని వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ మంగళవారం తన కార్యాలయంలో “మన తెలంగాణ”తో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు మండలానికి ఓ గ్రామం చొప్పున మొత్తం 18 గ్రామాలలో రైతుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. పరిగి మండలంలోని నస్కల్, దోమ మండల కేంద్రాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని రైతుల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు.