Friday, March 29, 2024

గర్భిణీలకు అండగా గాంధీ హాస్పిటల్

- Advertisement -
- Advertisement -
Treatment for 700 pregnant women in 7 months in Gandhi
7 నెలల్లో 700 మందికి చికిత్స,  ప్రత్యేక కేర్ తీసుకుంటున్న డాక్టర్ల బృందం,  వైద్యసేవలపై ప్రశంసలు కురిపించిన గవర్నర్ తమిళిసై,  15 బెడ్లతో డిపెండెన్స్ వార్డు సైతం ఏర్పాటు

హైదరాబాద్ : కోవిడ్ సోకిన గర్భిణీ స్త్రీలకు గాంధీ హాస్పిటల్ కొండంత అండగా మారింది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో వైరస్ సోకినా సదరు గర్భిణీలు గాంధీకి పరుగులు పెడుతున్నారు. గత ఏడు నెలల నుంచి ఇప్పటి వరకు సుమారు 700 మంది గర్భిణీలు చేరగా, ప్రస్తుతం ఆసుపత్రిలో కేవలం 42 మంది(శుక్రవారం వరకు) మాత్రమే చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు. మిగతా వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా అవసరమైన వారికి డెలివరీలు కూడా చేసి తల్లి, బిడ్లలను క్షేమం గా ఇళ్లకు పంపిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

అయి తే కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం అందించడంలో వైద్యబృందం తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. డెలివరీ సమయం లో వైద్యబృందం తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఇప్పటి వరకు తల్లి నుంచి బిడ్డకు కేవలం నలుగురికి మాత్రమే వైరస్ వ్యాప్తి చెందడం గమనార్హం. ఈక్రమంలో తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సైతం గాంధీ వైద్యసేవలపై ప్రశంసలు కురిపించారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలను కాపాడాల్సిందిగా ఆమె సూపరింటెండెంట్ డా రాజరావుకు సూచించారు.

గర్భిణీలకు దేవుళ్లుగా మారిన గాంధీ డాక్టర్లు…

కోవిడ్ సోకిన గర్భిణీలకు గాంధీ వైద్యులు దేవుళ్లుగా మారారు. పాజిటివ్ తేలిన గర్భిణీలకు ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం అందిస్తున్నారు. వాస్తవంగా చాలా ప్రాంతాల్లో కోవిడ్ సోకిన గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించాలంటే వైద్యులు వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో ఈ సంఘటనలు అధికంగా జరుగుతున్నాయి. పేషెంట్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు అడ్మిట్ చేసుకోవడం లేదు. పాజిటివ్ తేలిన గర్భిణీలు వెళ్తే తమ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స లేదంటూ కొన్ని ఆసుపత్రులు దాటవేస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ గర్భిణీ(29)కి పాజిటివ్ తేలడంతో నగరంలో వివిధ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను సంప్రదించింది.

ఎక్కడా అడ్మిట్ చేసుకోకపోవడంతో చివరికి గాంధీకి వెళ్లి చికిత్స తీసుకుంది. సుమారు 7, 8 హాస్పిటల్స్ తిరిగినట్లు ఆమె వెల్లడించారు. కానీ ఒక్క ఆసుపత్రి కూడా కనీసం పరీక్షించకుండానే ఎంట్రన్స్ దగ్గర నుంచే పంపించినట్లు ఆమె ఆరోపించారు. ఈక్రమంలో ఓ వైద్యుడి సలహ మేరకు గాంధీలో చేరి కోలుకున్నట్లు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు అనేక మంది గర్భిణీలకు ఎదురవుతున్నాయి. హైరిస్క్ గ్రూప్‌కు చెందిన వారికి వెంటనే వైద్యం అందించాలని ఓ వైపు ప్రభుత్వం పదేపదే చెబుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు ఆ మాటను లెక్కచేయడం లేదు. దీంతో పాజిటివ్ తేలిన గర్భిణీలకు గాంధీ ఆసుపత్రి పెద్ద దిక్కుగా మారింది.

కేర్ ఎలా తీసుకుంటున్నారు..?

గాంధీ హాస్పిటల్ పూర్తిస్థాయిలో కోవిడ్ నోడల్ కేంద్రంగా మారడంతో వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైరిస్క్(గర్భిణీలు, వృద్ధు లు, చిన్నారులు) కేటగిరికి చెందిన వారికి స్పెషల్ వార్డు లు ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ వార్డులను మిగతా కోవిడ్ పేషెంట్లకు దూరంగా వేరే బ్లాక్‌లలో ఏర్పాటు చేశారు. ఓపి కౌంటర్లను కూడా వేర్వేరుగా ఏర్పాటు చేశారు. పాజిటివ్ తేలిన గర్భిణీ అడ్మిట్ కాగానే మొదట ఆమె ఆరోగ్య పరిస్థితిని వివిధ విభాగాలకు చెందిన ఐదుగురు డాక్టర్ల బృందం పరీక్షించి కేస్ షీట్‌ను తయారు చేస్తున్నారు. బిపి, ఫల్స్ రేట్, బరువు వంటివి చూసి నమోదు చేస్తున్నారు.

ఆ తర్వాత సదరు గర్భిణీ ఏ నెలలో ఉంది? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డెలివరీకి ఎన్ని రోజుల సమయం ఉంది? ఇతర ఆరోగ్య సమస్యలు ఎమైనా ఉన్నాయా? క్రిటికల్ కండీషన్ అయ్యే అవకాశం ఉందా? అనే అంశాలను గైనకాలజీ బృందం క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంది. అనంతరం స్పెష ల్ వార్డుకు తరలించి 14 రోజుల పాటు కోవిడ్ చికిత్సను అందిస్తున్నారు.ఆ తర్వాత మరోసారి ఆర్‌టిపిసిఆర్ టెస్టు ను చేసి నెగటివ్ వస్తేనే ఇళ్లకు పంపతున్నారు. పాజిటివ్ వస్తే మరో వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. ఈక్రమంలో యోగా, ఇతర చిన్నపాటి శరీర వ్యాయమాలు కూడా చేపిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

మరోవైపు చికిత్స సమయంలో ప్రతి రోజు పౌష్ఠికాహారంతో పాటు ఇమ్యూనిటీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు డాక్టర్ల సూచన మేరకు ప్రతి రోజు ప్రత్యేకమైన డైట్‌ను ఇస్తున్నామని గైనకాలజీ విభాగం వైద్యులు తెలిపారు. అంతేగాక అవసరమైన వారికి డెలివరీలు కూడా చేస్తున్నారు. డిశ్చార్జ్ సమయంలో తల్లి, బిడ్డకు ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేసి నెగటివ్ తేలితే ఇళ్లకు పంపుతున్నారు. అయితే ఈ కరోనా గర్భిణీల వార్డులో ప్రతి షిప్టు కు అన్ని విభాగాల ప్రోఫెసర్లు, అసిస్టెంట్ ప్రోఫెసర్లు, వైద్యులు, పిజీలు, నర్సులు, ఇతర సహయకులు కలిపి 50 మంది పనిచేస్తున్నారని సూపరింటెండెంట్ ప్రో. రాజరావు పేర్కొన్నారు. మూడు షిష్టులలో వైద్య సేవలందిస్తూ మతా శిశువులను రక్షిస్తున్నామని తెలిపారు.

15 బెడ్లతో డిపెండెన్స్ వార్డు…

గాంధీ ఆసుపత్రిలో 15 బెడ్లతో డిపెండెన్స్ వార్డును కూడా ఏర్పాటు చేశామని ప్రో డా రాజరావు అన్నారు. పక్షవాతం, కాళ్లు క్షీణించుట, మానసిక సమస్యలు, ఆహారం తీసుకోలేని వారి కోసం ఈ వార్డును వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడ ప్రత్యేకంగా పేషెంట్ కేర్‌లను ఏర్పాటు చేసి ప్రతి రోజు వారిని మానిటరింగ్ చేస్తూ వైద్యం అందిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఈ కేటగిరికి చెందిన చాలా మంది కోలుకున్నప్పటికీ ఇళ్లకు తీసుకువెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం బాధకరమని ఆయన తెలిపారు.

గాంధీ హాస్పిటల్ సేఫ్ : సూపరింటెండెంట్ ప్రొ. రాజారావు

కోవిడ్ సోకిన గర్భిణీ స్త్రీలకు గాంధీ హాస్పిటల్ రక్షణగా ఉంటుందని సూపరింటెండెంట్ ప్రో డా రాజరావు భరోసానిచ్చారు. ఇక్కడ వివిధ విభాగాలతో కూడిన వైద్యుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. అంతేగాక డెలివరీ అవసరమైన వారికి కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని చేసి తల్లి, బిడ్డలను కాపాడుతున్నామని పేర్కొన్నారు. అనవసరంగా ఆందోళన చెంది ప్రైవేట్ హస్పిటల్స్‌కు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News