Friday, April 19, 2024

రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ట్రైసర్వీస్ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ట్రైసర్వీస్ దర్యాప్తు
ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో ఇప్పటికే మొదలైన దర్యాప్తు
ప్రమాదంపై పార్లమెంటులో ప్రకటన చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
రెండు నిమిషాలు మౌనం పాటించి నిమృతులకు నివాళి తెలిపిన ఎంపిలు

న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై త్రివిధ దళాలతో దర్యాప్తు జరుపుతున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో త్రివిధ దళాల దర్యాప్తు బృందం బుధవారమే వెల్లింగ్టన్ చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. సైనిక హెలికాప్టర్ ప్రమాదంపై ట్రైసర్వీస్ విచారణకు భారత వైమానిక దళం ఆదేశించిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో ఒక ప్రకటన చేశారు. తొలుత లోక్‌సభలో హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తీరును వివరించిన ఆయన రావత్ అంత్యక్రియలను పూర్తి సైనిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. ఇతర సైనిక సిబ్బంది అంత్యక్రియలు కూడా తగిన సైనిక గౌరవాలతో జరుగుతాయని, హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన రావత్, ఆయన భార్య మధులిక, మరో 11 మంది భౌతిక కాయాలు గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటాయని తెలిపారు. ప్రాణాలతో బయటపడిన గ్రూపు కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్టన్ సైనిక ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

సంఘటన గురించి రాష్ట్రపతికి వివరించడం కోసం తాను ఈ రోజు ఆయనను కలుస్తానని కూడా రక్షణ మంత్రి తెలిపారు అనంతరం సభ్యులు లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి హెలికాప్టర్ ప్రమాద మృతులకు నివాళి అర్పించారు. రాజ్యసభలో కూడా రాజ్‌నాథ్ సింగ్ ఇదే విధమైన ప్రకటన చేశారు. బిపిన్ రావత్‌కు నివాళులర్పించడానికి విపక్షాల నేతలను అనుమతించాలని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన అభ్యర్థనకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అంగీకరించలేదు. అనంతరం సభ్యులందరూ లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి మృతులకు నివాళి అర్పించారు. మృతులకు నివాళి అర్పించడం కోసం విపక్షాలు 12 మంది విపక్ష ఎంపిల సస్పెన్షన్‌కు నిరసనగా తాము చేస్తున్న ధర్నాను సైతం వాయిదా వేసుకోవడం గమనార్హం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజునుంచి ఒక్క రోజు కూడా సజావుగా సాగని సభ ఈ రోజు మాత్రం ప్రశాంతంగా సాగింది.

Tri Services Probe on Rawat Chopper Crash

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News