Home ఖమ్మం గిరిజనుల బతుకులు బాగుపడేనా?

గిరిజనుల బతుకులు బాగుపడేనా?

నేడు ఐటిడిఎ పాలక మండలి సమావేశం
ఈసారైనా సమస్యలకు పరిష్కారం దొరికేనా?
నాలుగు అంశాలపైనే చర్చ

kmmభద్రాచలం: మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా నాగరిక సమాజానికి ఆమడ దూరంలో ఉండే గిరిజనులను సమగ్రంగా అభివృద్ధి పథంలో నడిపేందుకు సుమారు 35 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఐటిడిఎ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డవలప్‌మెంట్ ఏజెన్సీ) సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఆ దిశగా అడుగులేస్తున్నప్పటికీ వారి బతుకుల్లో పూర్తి స్థాయి కాంతి రేఖలు ప్రసరించే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు తప్పులు దొర్లుతూనే ఉన్నా… వాటిని సరిచేసే లోపే ఇక్కడ ప్రాజెక్టు అధికారులుగా పదవీబాధ్యతలు నిర్వర్తించే ఐఏఎస్‌లో ప్రమోషన్ల పేరిట బదిలీలు అవుతుం డటంతో పరిస్థితి మళ్లీ మోదటికి వస్తోంది. గిరిజనాభివృద్ధికి భాగస్వాములు అవుతున్న ప్రభుత్వ శాఖలను ప్రతీ మూడు నెలలకు ఓ సారి సమావేశ పరిచి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాల్సిన అధికారులు ఏళ్లు తరబడి సమావేశాలు నిర్వహించక పోవడంతో అడిగే వారు లేక నిర్లక్షం రాజ్య మేలుతోంది.
నేడు పాలకమండలి: జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలం ఐటిడిఏలో పాలక మండలి సమావేశం నిర్వహించనున్నారు. గత ఏడాది జూన్ 21వ తేదీన భద్రాచలం ఐటిడిఏ పాలకమండలి సమావేశం ఖమ్మంలో జరిగింది. అప్పటి రోజుల్లో రాష్ట్ర విభజన జరిగి ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనం కావడంతో ఆందోళనలు జరుగుతాయనే అనుమానంతో అప్పటి కలెక్టర్ ఇలంబరిది అక్కడ నిర్వహించారు. తిరిగి ఏడాది మూడు నెలల తర్వాత పాలకమండలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ప్రతీ మూడు నెలలకోసారి పాలకమండలని సమావేశ పరచాలి. కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. ఈ సమావేశానికి జిల్లా పరిధిలోని మంత్రులు, ఎంఎల్‌ఎలు, జెడ్పి చైర్ పర్సన్, జెడ్పిటిసి, జిల్లా అధికార యంత్రాంగం రానున్నారు.
సమావేశాలు సరే… సమస్యల సంగతేంటి: అడపాదడపా సమావేశాలు పెడుతున్నారు సరే… మరి సమస్యల పరిష్కారం సంగతేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఐటిడిఏ ఏర్పాటైన నాటి నుంచి సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. గిరిజన కమిషన్లు వచ్చిపోతూనే ఉన్నాయి. కానీ గిరిజనుల సమస్యల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఐటిడిఏ పరిధిలో ప్రస్తుతం 24 గిరిజన మండలాల పరిపాలన సాగుతోంది. ప్రతి సోమవారం గిరిజనుల కోసం గిరిజన దర్భారు (ప్రజావాణి) నిర్వహిస్తున్నారు. పై మండాలలకు చెందిన వందలాది మంది గిరిజనులు ప్రతీ వారం సమస్యలపై వినతి పత్రాలు ఇస్తున్నారే తప్ప అవి పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇక మొక్కుబడిగా సాగే పాలక మండలి సమావేశాల్లో అంశాలు చర్చకు వస్తాయే తప్ప అవి పరిష్కారం మాత్రం కావు.
సమస్యలు కోకొల్లలు : ఐటిడిఏ పరిధిలో పరిపాలన సాగుతు న్న ఏ మండలంలో చూసినా సమస్యలు తిష్ట వేసే ఉన్నాయి. సుమారు 38 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 క్లస్టర్ అస్పత్రులు, 05 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు నడుస్తున్నాయి. వీటి పరిధిలో సుమారు 595లకు పైగా హై రిస్క్ విలేజ్‌లు ఉంటాయి. ఆయా గ్రామాల్లో అధిక శాతం మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాల భారిన ప్రజలు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో దోమలు మందు పిచికారీ చేసేందుకు కూడా ఈ ఏడాది డబ్బుల్లేక మానుకున్నారు. ఆస్పత్రుల నిర్వహణకు కేటాయించే శానిటేషన్ నిధులు దుర్వినియోగం అవుతున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారని ఆయా గ్రామాల్లో ప్రజలు బాహాటంగానే అంటున్నారు. ఈ మధ్య కాలంలో డెంగ్యూ జ్వరం భారిన పడి పలువురు మృత్యువాతపడ్డారు. ఇక విద్యా విభాగానిది అదే తీరు. ఐటిడిఏ పరిధిలో 524 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 4 బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో మొత్తం సుమారు 53 వేల మంది చదువుతున్నారు. హాస్టళ్లలో మౌలిక వసతుల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఎందరో చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పౌష్టికాహారం అందించేందుకు భద్రాచలంలో న్యూట్రీషియన్ సెంటర్ ఏర్పాటు చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. మారుమూల గ్రామాల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారికి ఇక్కడికి తరలించే విషయంలో అలసత్వం చోటు చేసుకుంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంజినీ రింగ్ విభాగంలో పరిస్థితి షరామామూలే… ఏళ్లు తరబడి కట్టడాలు సాగూతూనే ఉంటాయి. ఐటిడిఏలో గిరిజనులే కాంట్రాక్టర్లుగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ గిరిజనేతరులు బినామీలుగా చెలామని అవుతున్నారు. ఐకేపిలో పరిస్థితి ఈ విధంగానే ఉందని పలువురు అంటున్నారు. ఉపాధి హామీ పథకం పరిస్థితి ఇక చెప్పనక్కరలేదు. ఉద్యాన వన విభాగంలో గతంలో మామిడి, జీడి మామిడి, ఉసిరి, సపోట తోటలు వేసినప్పటికీ ఇప్పుడు అవి కొన్ని భూముల్లో లేనే లేవు. మరికొన్ని నిర్వహణ లోపంతో పతనమై పోయాయి. అటవీహక్కుల చట్టం కింద గిరిజనులకు పట్టాల్సి ఇవ్వాల్సి ఉండగా, ఆ భూముల్లోనే హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నట్లు , ఈవ్యవహారంలో గిరిజనులు అటవీ అధికారుల మధ్య ఘర్షణనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రైకార్ యాక్షన్ ప్లాన్ సైతం తప్పు దొవ పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఐడిసి తీరు చూస్తే ముక్కన వేలు వేసుకోవాల్సిందే. ఏళ్లు తరబడి నిరాధరణకు గురైన పథకాలను బాగుచేసేందుకు కనీసం నిధులు విడుదల కావడం లేదు. ఐటిడిఏ పనితీరులో ఎటు చూసినా డొల్ల తనమే కనిపిస్తోందని బహిరంగ ఆరోపణలు వస్తున్నాయి.
ఈ సారి ఏజెండా నాలుగే నాలుగు అంశాలపై: గత ఏడాది జూన్ 21న కలెక్టర్ ఇలంబరిది ఆధ్వర్యంలో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో సుమారు 19 అంశాలపై చర్చించారు. కానీ ఈ సారి పాలక మండలి సమావేశంలో కేవలం నాలుగే నాలుగు అంశాలపై చర్చ నిర్వహించనున్నారు. అవి కూడా ఇంజినీరింగ్ విభాగం, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, విద్య, అటవీహక్కుల చట్టం 2006, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం. వీటిపైనే పాలక మండలి సమావేశం జరిపి చర్చించేందుకు అన్ని ఏర్పాట్లు. చేశారు. గత సారి ఏజెండాలో పోందుపరిచిన 19 అంశాల్లోని పురోగతి పక్కన పెడితే ఈసారి నాలుగే అంశాలను ఎన్నుకోవడం పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు. ఏదో మొక్కుబడిగా పాలక మండలి నిర్వహించేందుకు ఇలా చేస్తున్నారని అంటున్నారు.
నూతన కలెక్టర్ దృష్టి సారించేనా: ఐటిడిఏలోని పలు విభాగాల్లో సమస్యలు కోకొల్లల ఉన్నప్పటికీ వాటిపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి. ఇలా అయితే మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందేనా…. వారి అభివృద్ధి సాధ్యమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యలు చేపట్టిన లోకేష్ కుమార్ భద్రాచలం ఐటిడిఏకు పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారి నియమితులయ్యేలా చర్యలు తీసుకుని గిరిజన సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని, పలు శాఖల్లో పెరుకుపోతున్న అలసత్వాన్ని, అవినీతిని నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.