Home ఆదిలాబాద్ మళ్లీ గోండు గూడాలపై జ్వరాల పంజా: ఇద్దరి చిన్నారులు మృతి

మళ్లీ గోండు గూడాలపై జ్వరాల పంజా: ఇద్దరి చిన్నారులు మృతి

FEVERఆదిలాబాద్: సిర్పూర్(యు)మండలంలో తగ్గుముఖం పట్టాయనుకున్న జ్వరాలు మళ్లీ పంజా విసురుతున్నాయి. మండల స్థాయి నుండి జిల్లా కలెక్టర్ వరకు జ్వరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎజెన్సీలో జ్వరాల మరణాలు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. ఒకే రోజు ఎజెన్సీలోని సిర్పూర్(యు) మండలంలో ఇద్దరు గిరిజన పిల్లలు జ్వరంతో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శనివారం విషాదం నింపింది. సిర్పూర్ (యు) మండల పరిధిలో మహగామ్ పటేల్ గూడ గ్రామానికి చెందిన మడావి ధన్‌రాజ్ అనే నాలుగేళ్ల చిన్నారి బాలుగు గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో జైనూర్‌కు తరలించి చికిత్సలు అందించినట్లు తల్లిదండ్రులు అనిల్, త్రిశూల బాయిలు తెలిపారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృత్యువాత పడడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన మడావి సుమన్, యమునా బాయి, శంకర్, సుహాసిని, గంగారాం మరో పది మంది జ్వరాల బారిన పడ్డారు. ఇదిలా ఉంటే పులార పరిధిలోని బొగుడ గూడ గ్రామానికి చెందిన ఆత్రం బర్వంతి బాయి(40) అనే మహిళ కూడా జ్వరంతో మృత్యువాత పడడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామాల్లో పౌష్టికాహార లోపం, రక్త హీనత పట్టి పీడిస్తుండగా అంతలోనే జ్వరాలు విజృంభిస్తుండటంతో గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో గ్రామాల్లో విషాదం అలుముకుంది.