Home భద్రాద్రి కొత్తగూడెం డెంగీ పరేషాన్

డెంగీ పరేషాన్

Tribal people infected with toxic fever

విష జ్వరాల బారిన గిరిజన ప్రజలు
ప్రభుత్వ వైద్యశాలలు లేక అవస్థలు
మోయలేని బారంగా ప్రవేటు వైద్యం
పారిశుద్ధ్యం మరిచిన అధికారులు

మన తెలంగాణ/మణుగూరు టౌన్ : పినపాక ఏజెన్స్సీ ప్రాంతంలో విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నాయి. దిక్కుతోచని స్థితిలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరిసరాలు అపరిశుభ్రంగా  మారటంలో మారుమూల ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురౌతున్నారు. ముఖ్యంగా పినపాక నియోజకవర్గంలో మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో విషజ్వరాల ప్రబావం అధికంగా ఉంది. వర్షాకాలంలో అధికారులు దోమల నివారణకు చేయాల్సిన పాగింగ్ చేయకపోవంటంతో దోమల తీవ్రత అధికంగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న మణుగూరు మండలంలో 100 పడకల వైద్యశాలలో వైద్యసేవలు ప్రారంభం కాకపోవటంతో మన్యం ప్రజలందరు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించక తప్పటంలేదు, దీనితో ప్రవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మణుగూరు పట్టణంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలోనే ఇప్పటికి 15 డెంగ్యూ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధం అవుతుంది.

నియోజకవర్గంలో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. వైద్య సేవలు అందించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారు. అత్యఅవసర సమయంలో వైద్య సేవలు అందటంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మండల పరిధిలో పారిశుద్ధ్య లోపాల వలన ప్రజలు అనారోగ్య పాలవుతున్న ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్షం వహిస్తున్నారు. మణుగూరు పట్టణ పరిధిలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో 15 డెంగ్యూ కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులే ధృవీకరిస్తున్నారు. గత రెండు సంవత్సారాల కాలంగా చూస్తే ఈ సంవత్సరం ప్రస్తుత పరిస్థితులలో అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపారు. తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం బాగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్షంతో మణుగూరులోని మూప్పై పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చి భవన నిర్మాణం పూర్తిచేసుకొని, ప్రారంభించి సంవత్సరం గడిచిన నేటికి పూర్తి స్ధాయిలో వైద్యులు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రభుత్వ వైద్యశాలలు లేక దిక్కుతోచని స్థితిలో ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించి నిలువు దోపిడీకి గురవుతున్నారు. గిరిజన గ్రామాల ప్రజల ఆర్థిక పరిస్థితి ప్రైవేటు వైద్యశాల మెట్లు ఎక్కలేని స్థితి. గిరిజన గ్రామాల ప్రజలు వ్యయ ప్రయసాలకోర్చి సూదూర ప్రాంతాలైన భద్రాచలం, కొత్తగూడెం, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయించకునే దుస్తితి నియోజకవర్గంలో నెలకొంది. ఇటీవల పాము కాటుకు గురైనా రైతుకు మణగూరు పట్టణంలో సరైనా వైద్య సదుపాయం అందక భద్రాచలం తరలించిన ఘటన అందరికి తెలిసిందే. ఆపద సమయాల్లో అదుకునే నాథుడు కరవయ్యాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మెతో మండలంలో అపరిశుభ్ర వాతావరణం నెలకోంది. ముఖ్యంగా రాజీవ్ గాంధీనగర్, ఆశోకనగర్, సమితిసింగారం ప్రాంతాలలో పందుల సంచారం అధికంగా ఉంది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలలో పూర్తిగా విఫలం చెందారని ఇట్టే తెలుస్తుంది. ఇటీవల రాజీవ్‌గాంధీ నగర్ వ్యవసాయ మార్కెట్ పరిసర ప్రాంతంలో చెత్తకుప్పలో గర్భస్థ శిశువు పడివేస్తే చెత్త ఏమేరకు పేరుకు పోయిందో చెప్పనవసరం లేదు.

డా. కె. శశిధర్, సాయి మమత వైద్యశాల వైద్యులు :

మణుగూరు, పినపాక మండలాలలో డెంగ్యూ తీవ్రత కనిపిస్తుంది. పట్టణంలో సాయి మమత వైద్యశాలలో 15 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనారోగ్య తీవ్రత అధికంగా పెరగటంతో మణుగూరు పట్టణంలోని ప్రైవేటు వైద్యులపై భారం పడుతుంది. గిరిజన ప్రజలు వైద్య ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్నారు. ప్రజలు తమ వంతుగా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా విష జ్వరాల భారి నుంచి తమను తాము కొంత కాపాడుకోగలిగిన వారవతారు. ముఖ్యంగా మంచినీరు వలన టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం వలన తాగునీటి విషయంలో తగిన జగ్రత్తలు పాటించాలి. కాచిన గోరు వెచ్చని నీరు తాగుటం శ్రేయస్కరం.