Home కుమ్రం భీం ఆసిఫాబాద్ పులికి మరో బాలిక బలి

పులికి మరో బాలిక బలి

Tribal Woman Killed In Tiger Attack

 

కొమురంబీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి ఏరుతున్న నిర్మలపై పెద్ద పులి దాడి, అక్కడికక్కడే మృతి
దాడిలో నిర్మల అనే యువతి దుర్మరణం
ఇప్పటికే ఎనిమిది మంది మృత్యువాత
ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

మనతెలంగాణ/మంచిర్యాల : మ్యాన్ ఈటర్‌గా మారిన పెద్దపులి మాటువేసి మనుషులపై పంజావిసురుతోంది. మహారాష్ట్ర అడవుల నుంచి కాగజ్‌నగర్ ప్రాంతానికి వలస వచ్చిన పెద్దపులి ప్రత్యకంగా మనుషులపైనే దాడి చేస్తూ హతమారుస్తోంది. అటవీశాఖ అధికారులు పెద్దపులిని సురక్షితంగా పట్టుకోవడానికి విఫలయత్నం చేస్తున్నారు.ఇక్రమంలోనే ఆదివారం మరో బాలికపై దాడి చేసి హతమార్చడం కలవరానికి గురిచేస్తోంది. పెంచికల్‌పేట మండలం కొండపల్లి అటవీ గ్రామాల శివారులో పత్తి ఏరుడుతుండగా నిర్మల(14) అనే బాలికపై పులి దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. పత్తి చేనులో పత్తి ఏరుతున్న మరికొందరు కూలీలు పెద్దపులిని ప్రత్యక్షంగా చూసి పరుగులు తీశారు. ఈ సంఘటనను కండ్ల నిండా చూసిన కూలీలు గజగజ వనుకుతూ గ్రామానికి వెళ్లి నిర్మల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్థులు కుటుంబీకులు, పత్తి చేనులోకి వెళ్లి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు.

పక్షం రోజుల క్రితమే దహెగాం మండలం దిగిడాగ్రామానికి చెందిన యువకుడు చేపలవేటకు వెళ్లగా అతనిపై పులిదాడి చేసి హతమార్చిన సంఘటన మర్చిపోకముందే మళ్లీ బాలికను హతమార్చడం కలకలం రేపుతోంది. సంఘటన స్థలాన్ని అటవీ, పోలీస్ అధికారులు సందర్శించి సిసి కెమెరాల్లో పులి కదలికలను గుర్తించి బెజ్జూర అడవుల వైపు వెళ్లిందని ఆ ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే పులి దాడిలో తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దు అడవుల్లో ఎనిమిది మృతువాత పడ్డారు. రెండు రోజుల క్రితం కెరమెరి వాగులో నీరు తాగేందుకు వెళ్తున్న పెద్దపులిని జాలర్లు ప్రత్యక్షంగా చూసి సెల్‌పోన్‌లలో చిత్రీకరించారు. అడవుల నుంచి నేరుగా వాగు వద్దకు వచ్చి నీరు తాగుతుండడంతో వాగులో ఉన్న జాలర్లు పులిని చూసి ఒక్కసారిగా పరుగులు తీశారు. మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌జిల్లాలోని అటవీ గ్రామాల పరిసరాల్లో పులుల సంచారం పెరగడంతో భయాందోళనలకు గురువుతున్నారు.

ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం, పెంచికల్‌పేట్, బెజ్జూర్, కౌటాల మండలాలతో పాటు మంచిర్యాలజిల్లాలోని మందమర్రి, పాతబెల్లంపల్లి, కన్నెపల్లి, కోటపల్లి, వేమనపల్లి, మండలాల శివారులో ఇప్పటి వరకు పలు సార్లు పులి ప్రత్యక్షంగా కనిపించడంతో అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత 15 రోజులుగా పులి జాడ కోసం పోలీసుల సమన్వయంతో గాలింపు చర్యలు చేప్పటినప్పటికి అంతుచిక్కని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతినిత్యం ఏదో ఒక చోట పులి ప్రత్యకంగా కనిపిస్తుండడంతో అటవీ గ్రామాల ప్రజలుప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవనాన్ని గడుతుపున్నారు. ఇటీవల దహెగాం మండలంలో చేపలకువెళ్లిన యువకున్ని పులి హతమార్చి అడవిలోకి లాకెళ్లగా మహరాష్ట్ర నుంచి వచ్చిన పులి మ్యాన్ ఈటర్‌గా మారిందని, అదునుచూసి దాడులు చేస్తుందని అటవీ అధికారులు భావిస్తున్నారు.

మ్యాన్ ఈటర్‌గా మారిన పెద్దపులి కెరమెరి వాగులో నీరు తాగేందుకు వెళ్లినట్లు గుర్తించారు. అడవుల్లో ఆహారం లభించకపోవడంతోనే, మనుషులు, పశువులపై దాడులు చేస్తున్నాయని పలువురు అనుమానిస్తున్నారు. ఏదిఏమైనా ప్రతినిత్యం పెద్దపులి ప్రత్యక్షంగా కనిపిస్తుండడంతో అటవీ గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. కాగా పత్తి చేనులో పత్తి ఏరేందుకు వెళ్లిన బాలికపై పులి దాడి చేసి హతమర్చాడం అటవీశాఖలో కలవరం రేపుతోంది. అధికారుల నిర్లక్షం వల్లనే పులి జాడను గుర్తించకపోవడంతో మనుషులు మృత్యువాత పడుతున్నారని పలువురు బావిస్తున్నారు. ఇప్పటికైనా మ్యాన్ ఈటర్‌గా మారిన పెద్దపులిని పట్టుకొని ప్రాణాలను కాపాడాలని అటవీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.